తెలుసుకుని తీసిపారేస్తుంది

23 Jun, 2017 02:50 IST|Sakshi
∙టెర్టిల్‌ అడుగున ఉండే చక్రాలు కలుపు పెరక్కుండా నిరోధిస్తాయి. చక్రాల మధ్య ఉండే ఒక చిన్న యంత్రం కలుపు మొక్కల్ని నేలమట్టం చేస్తుంది. (ఇన్‌సెట్

మీరెప్పుడైనా పొలాల్లో కలుపు తీశారా? తీసుంటే.. కనీసం చూసుంటే.. ఆ పని ఒళ్లు హూనమయ్యేంత కష్టమని మీకు తెలిసే ఉంటుందికదా! ఆ కష్టాన్ని తీసేసే రోబో ఇది. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. కలుపు మొక్కల్ని నాశనం చేసేసే రోబో. భలే ఉంది కదూ. దీన్ని తయారు చేసింది ఎవరనుకుంటున్నారు? ఆమధ్యకాలంలో వచ్చిన రోబో వాక్యూమ్‌ క్లీనర్‌ రూంబాను తయారు చేసిన జో జోన్స్‌దే ఈ ఐడియా కూడా. కాకపోతే ప్రస్తుతానికి దీన్ని పెరటి తోటలకు మాత్రమే వాడుకునే వీలుంది.

మొక్క సైజును బట్టి ఏది కలుపు, ఏది కాదన్నది గుర్తుపడుతుందట టెర్టిల్‌ అనే పేరున్న ఈ రోబో. అంగుళం కంటే ఎక్కువ సైజున్నవి పనికొచ్చే మొక్కలుగా గుర్తిస్తుంది. అంతకంటే చిన్న వాటిని తన చక్రాల మధ్యలో ఉండే చిన్న యంత్రం సాయంతో నేలమట్టం చేసేస్తుంది. అవసరమైన మొక్కలు చిన్నగా ఉన్నప్పుడు వాటిచుట్టూ ఇనుప కంచెలాంటిది వేస్తే చాలు. దాని జోలికి వెళ్లదు. పైగా వాలుగా ఉన్న దీని చక్రాలను చూశారా.. అవికూడా అటుఇటూ తిరిగేటప్పుడు కలుపు మొక్కలను పెరక్కుండా నిరోధిస్తాయి. అంతేకాదు, ఏ రకమైన రసాయనాలూ వాడకుండానే కావాల్సినప్పుడల్లా కలుపు తీసేసుకోవచ్చు. అడ్డంకులను గుర్తించేందుకు, తన దారి తానే వెతుక్కునేందుకు వీలుగా దీంట్లో కొన్ని సెన్సర్లను ఏర్పాటు చేశారు. పైన ఉన్న సోలార్‌ ప్యానెల్స్‌తో పనిచేస్తుంది కాబట్టి... కరెంటు కనెక్షన్‌ కూడా అవసరం లేదన్నమాట. కలుపు మొక్కలను పూర్తిగా పీకేయకున్నా, ఎప్పటికప్పుడు ఎదగకుండా చూస్తుంది కాబట్టి టెర్టిల్‌తో ఉపయోగమే కానీ నష్టమేమీ లేదంటున్నారు జోన్స్‌.

ఇప్పటì  వరకైతే టెర్టిల్‌ రోబోల నమూనాలు సిద్ధమయ్యాయి గానీ.. వాణిజ్యస్థాయిలో ఉత్పత్తి చేసేందుకు జోన్స్‌ ప్రస్తుతం కిక్‌స్టార్టర్‌ ద్వారా నిధులు సేకరించే పనుల్లో ఉన్నాడు. వచ్చే ఏడాది మార్చికల్లా దీన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది ఫ్రాంక్లిన్‌ రోబోటిక్స్‌ అనే అమెరికన్‌ సంస్థ! బాగానే ఉందిగానీ.. దీన్ని వ్యవసాయ పొలాల్లో వాడుకోవచ్చా? సమీప భవిష్యత్తులో అదీ సాధ్యమేనేమో!

మరిన్ని వార్తలు