ఆ వ్యాఖ్యలతో తీవ్రవాదులకు లాభం: హిల్లరీ

24 Aug, 2016 12:22 IST|Sakshi
ఆ వ్యాఖ్యలతో తీవ్రవాదులకు లాభం: హిల్లరీ
లాస్ ఏంజల్స్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ ప్రెసిడెంట్ నామినీ హిల్లరీ క్లింటన్ తన ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.  జిమ్మీ కిమ్మెల్ లైవ్ షోలో మాట్లాడుతూ.. అసలు అధ్యక్ష పదవి రేసులో తన ప్రత్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ కాకుండా.. అర్హత కలిగిన వేరే వ్యక్తి పోటీలో ఉంటే బాగుండేదని భావిస్తున్నట్లు హిల్లరీ తెలిపారు. డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు తీవ్రవాదులకు ఉపయోగపడేలా ఉన్నాయని ఆమె విమర్శించారు. ట్రంప్ వ్యాఖ్యలు తీవ్రవాదులకు ఒక సందర్భాన్ని ఇచ్చినట్లు అవుతోందని.. ఇవి పరోక్షంగా వారికి ఉపయోగపడుతాయని హిల్లరీ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో తగినన్ని ఆధారాలు సైతం ఉన్నాయని ఆమె తెలిపారు.
 
హిల్లరీ క్లింటన్, బరాక్ ఒబామా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థను తయారుచేశారన్న ట్రంప్ వ్యాఖ్యలపై మాట్లాడుతూ.. ట్రంప్ నోటి నుంచి ఈ మాటలు చాలాసార్లు విన్నామని, అయితే అవి పిచ్చిమాటలని కొట్టిపారేశారు. అయితే.. ఈ వ్యాఖ్యలు సైతం ప్రమాదకరమైనవని హిల్లరీ పేర్కొన్నారు. రిపబ్లికన్ పార్టీకి చెందిన ప్రజలు కూడా తనను సపోర్ట్ చేస్తున్నారని, లేఖలు రాస్తున్నారని హిల్లరీ వెల్లడించారు.
 
>
మరిన్ని వార్తలు