భారత్‌ భారంగా మారింది..!!

18 May, 2018 09:45 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచ ఆరోగ్య సంస్థ 2030 నాటికి సాధించాల్సిన సుస్థిరాభివృద్థి లక్ష్యాలకు సంబంధించిన ప్రపంచ ఆరోగ్య గణాంకాల నివేదికను విడుదల చేసింది. సగానికి పైగా ప్రపంచ దేశాలు అవసరమైన వైద్య సేవలను పొందలేకపోతున్నాయని, ఐదేళ్లలోపు చిన్నారుల మరణరేటును తగ్గించలేకపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా భారత్‌ వంటి దిగువ మధ్యతరగతి దేశాల్లో ఈ సమస్యలు ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది. అంతేకాదు భారతదేశంలో అంటువ్యాధుల కన్నా ఇతర దీర్ఘకాలిక వ్యాధుల వల్లే ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయని తెలిపింది.

ఆ దేశాల వల్లే వెనుకబాటు...
దిగువ మధ్యతరగతి దేశాల వల్ల 2030 నాటికి అనుకున్న సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించలేకపోతున్నట్లు డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. ఈ దేశాల కారణంగానే ప్రపంచ ఆరోగ్య ప్రమాణాల సగటు తగ్గిపోతున్నట్లు పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా ఏడాదికి 70 ఏళ్ల కన్నా తక్కువ వయసున్న 13 మిలియన్ల మంది గుండె జబ్బులు, దీర్ఘకాలిక శ్వాసకోశ సంబంధ వ్యాధులు, డయాబెటిస్‌, క్యాన్సర్‌  వంటి రోగాల వల్ల మరణిస్తున్నట్లు ఆందోళన వ్యక్తం చేసింది. ఇటువంటి మరణాల సంఖ్య దిగువ మధ్యతరగతి దేశాల్లోనే ఎక్కువగా ఉ‍న్నట్లు తెలిపింది.

భారత్‌ భారంగా మారింది..
2016 సంవత్సరానికిగానూ భారత్‌లో.. 30 నుంచి 70 ఏళ్ల వయసున్న వ్యక్తులు 23.3 శాతం మంది ఇటువంటి దీర్ఘకాలిక వ్యాధుల వల్ల మరణించినట్లు పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా ఇటువంటి వ్యాధుల వల్ల మరణించిన వారి శాతం(18 శాతం) కంటే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగించే విషయమని తెలిపింది. అంతేకాదు భారత్‌లో ప్రతీ లక్ష మంది జనాభాలో 211 మంది టీబీ బాధితులేనని పేర్కొంది.

అయితే 2030 నాటికి టీబీని పూర్తిగా నిర్మూలించడం డబ్ల్యూహెచ్‌వో లక్ష్యమైతే.. 2025 నాటికే టీబీని దేశంలో లేకుండా చేస్తామని భారత్‌ ప్రకటించిందని.. కానీ ఆ దిశగా అడుగులు వేయడం లేదని అసహనం వ్యక్తం చేసింది. 2015 ఏడాది గణాంకాల ప్రకారం భారత్‌లో ప్రతీ లక్ష జననాలకు.. 174 ప్రసూతి మరణాలు సంభవిస్తున్నాయని పేర్కొంది. ఎస్‌డీజీలో భాగంగా 2030 నాటికి ఈ సంఖ్యను 70కి తగ్గించడం డబ్ల్యూహెచ్‌వో లక్ష్యమని తెలిపింది.

కారణాలివే..
భారత్‌ వంటి దిగువ మధ్య తరగతి దేశాల్లో ఆరోగ్య ప్రమాణాల స్థాయి పడిపోవడానికి కాలుష్యం, జనాభా పెరుగుదల ప్రధాన కారణాలని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. కాలుష్యం విషయంలో ఆగ్నేయాసియా దేశమైన నేపాల్‌ ముందుస్థానంలో ఉండగా, భారత్‌ రెండో స్థానంలో కొనసాగుతోందని పేర్కొంది. 

మరిన్ని వార్తలు