ఫ్రాన్స్‌పైనే దాడులు ఎందుకు?

16 Jul, 2016 01:24 IST|Sakshi
ఫ్రాన్స్‌పైనే దాడులు ఎందుకు?

- వివక్షపై స్థానిక ముస్లింలలో అసంతృప్తి  
- ఉగ్రపోరులో చురుగ్గా ఉండటమూ ఓ కారణమే
 
 పారిస్ : ఫ్రాన్స్‌లో ఉగ్రవాదం నేడు కొత్తేం కాదు. నిరసనలు, ఉగ్రదాడుల్లో ఫ్రెంచ్ ప్రజలకు సుదీర్ఘమైన చరిత్ర ఉంది. 1950ల్లో అల్జీరియా యుద్ధం సందర్భంగా.. మొదలైన ఉగ్రదాడులు అడపాదడపా కొనసాగుతూనే ఉన్నాయి. 2015 ఫ్రాన్స్‌లో అత్యంత దారుణమైన ఉగ్రదాడులకు(చార్లీ హెబ్దో పత్రికపై దాడిలో 20 మంది, నవంబర్‌లో పారిస్‌లో దాడిలో 130 మంది మృతి) సాక్షిగా నిలిచింది. 60 ఏళ్లలో ఫ్రాన్స్‌లో చిన్నాచితకా ఉగ్రవాద దాడులు కూడా జరగనిది ఒక్క 1971లోనే. 1980ల్లో పారిస్‌లో ఓ జర్మన్ దౌత్యవేత్తను కుర్ద్ ఉగ్రవాదులు హత్యచేశారు. రాజధానిలో ఉగ్ర ఘటనతో మేల్కొన్న ఫ్రాన్స్ కఠినమైన చట్టాలను అమల్లోకి తెచ్చింది. అయినా మూడు దశాబ్దాలుగా వివిధ ఉగ్రవాద గ్రూపుల సంస్థలు యథేచ్చగా దాడులకు పాల్పడుతున్నాయి. ఫ్రాన్స్‌పై దాడి ద్వారా ప్రపంచ దేశాలకు సవాల్ విసురుతున్నాయి.

 సౌభ్రాతృత్వం కనిపించకే!
 ఫ్రాన్స్ రాజ్యాంగం పౌరులకు కల్పించిన స్వేచ్ఛ, సమానత్వం విషయం పక్కన పెడితే.. ‘సౌభ్రాతత్వం’ అందటం లేదని స్థానిక ముస్లిం యువకులు భావిస్తున్నారు.  తమకు ఉపాధి అవకాశాలు తక్కువగా ఉంటున్నాయనే అభిప్రాయంలో వారున్నారు. ఇదే దశాబ్ద కాలంగా వీరిలో అసంతృప్తికి కారణమవుతోంది. పేదరికం, నివాస సమస్యలు, మిగతా సమాజం నుంచి తమను ఒంటరివారిని చేస్తున్నారనే బాధ వీరిని వేధిస్తోంది. నిరుద్యోగ సమస్య, ఫ్రెంచ్ సమాజంలో సరైన అవకాశాలు దొరక్కపోవటం ఇటీవలి కాలంలో ఇస్లామిస్టుల ఉగ్రవాదులు పేట్రేగిపోయేందుకు కారణమవుతోంది. ఇదిప్పుడు ఫ్రాన్స్ ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తోంది. నీస్ నగరంలో ఓ మామూలు ట్రక్కు డ్రైవర్ జాతీయ దినోత్సవ వేడుకల్లో విధ్వంసానికి ఒడిగట్టడం.. అక్కడి ముస్లిం ప్రజల్లో సౌభ్రాతత్వంపై ఉన్న అభిప్రాయాలకు అద్దంపడుతోంది.

 మా జోలికొస్తే ఖబడ్దార్
 ఫ్రాన్స్‌లో భిన్నసంస్కృతులను గౌరవించాలనే మాటే వినబడదు. ఫ్రాన్స్‌లో 47 లక్షల మంది, జర్మనీలో 48 లక్షల మంది ముస్లింలున్నారు. అయితే.. ఇరాక్ యుద్ధానికి జర్మనీ దూరంగా ఉండగా.. స్పెయిన్ తన బలగాలను పంపించింది. దీనికి ప్రతీకారంగా 2004లో స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లోని రైల్లో అల్‌కాయిదా ఉగ్రదాడికి పాల్పడి 191 మందిని బలితీసుకుంది. తాజాగా ఫ్రాంకోయిస్ హోలండ్ అధ్యక్షుడయ్యాక.. అంతర్జాతీయంగా జరుగుతున్న ఉగ్రవాద వ్యతిరేక కార్యక్రమాల్లో ఫ్రాన్స్ చాలా చురుకుగా పాల్గొంటోంది. ఐసిస్ ప్రభావం ఎక్కువగా ఉన్న సిరియాలో వైమానిక దాడులు చేస్తోంది. ఇది కూడా ఐసిస్ ఫ్రాన్స్‌ను లక్ష్యంగా చేసుకునేందుకు కారణమైందనే వాదన వినిపిస్తోంది. యురోపియన్ యూనియన్, వివిధ ప్రపంచ దేశాలు ఫ్రాన్స్‌కు అండగా నిలిచినా.. ఎందుకు ఉగ్రవాదులు తమనే లక్ష్యంగా చేసుకుంటున్నారనే విషయంపై ఫ్రాన్స్ ఆలోచించాల్సిన సమయమిది. ఇటీవలి వరుస ఉగ్ర ఘటనలకు కారణాన్ని.. ప్రమాదం నుంచి బయటపడే  మార్గాలను అన్వేషించాలి.

 లో-టెక్ టై
 నైపుణ్యంతో బాంబులు (ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివెజైస్-ఐఈడీలు) రూపొందించటం, పక్కాగా రెక్కీ వేయటం.. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించటమే.. కాదు సింపుల్‌గా రవాణా వాహనాలతోనూ ఉగ్రవాదులు దాడులకు తెగబడుతున్నారు. నీస్ ఘటన కూడా ఇలా లో-టెక్ ఉగ్రవాద దాడికి నిదర్శనం. జాతీయ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్న వారిపైకి వేగంగా టక్కును ఎక్కించాడు. అతన్ని పోలీసులు కాల్చిచంపేలోపే.. చేయగలిగినంత నష్టాన్ని మిగిల్చాడు. మొన్నటికి మొన్న ఇరాక్‌లో ఈద్ షాపింగ్ సందర్భంగా ఉగ్రవాదులు ఓ ట్రక్కులో పేలుడు సామాగ్రిని ఉంచి భారీ విధ్వంసానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 200 మందికి పైగా మరణించారు.  దైనందిన జీవితంలోనూ.. వాహనాలు భాగమైపోయాయి. అలాం టిది.. అవి కూడా ఉగ్రదాడులకు వాహకాలైతే.. ప్రజలేం చేయాలి? తమను తాము ఎలా కాపాడుకోవాలి?

మరిన్ని వార్తలు