ఫేషియల్‌ క్రీమ్‌ ఎఫెక్ట్‌..అపస్మారక స్థితిలోకి మహిళ

12 Sep, 2019 17:00 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

కాలిఫోర్నియా: అతివలు తమ ముఖ సౌందర్యం కోసం పలు రకాల ఫేషియల్‌ క్రీమ్‌లు వాడతారన్న విషయం తెలిసిందే. ఇవి వారి ముఖానికి మరింత నిగారింపు ఇస్తాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. కానీ శాక్రమెంటోలోని ఓ మహిళ  పాలిట ఫేషియల్‌ క్రీమ్‌... శాపంగా మారింది. వివరాల్లోకి వెళితే.. మెక్సికో నుంచి దిగుమతి చేసుకున్న పాండ్స్‌ లేబుల్‌ ఉన్న ఫేస్‌ క్రీమ్‌ను ఓ మహిళ ఉపయోగించడం వల్ల ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది. దీంతో ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలిచంగా... ఆమె వాడిన క్రీములో హాని కలిగించే మిథైల్‌ మెర్క్యూరీ కలిపినట్లు కౌంటీ వైద్య విభాగం నిర్ధారించింది. కాగా ఆ క్రీమ్‌ను తయారుచేసిన సమయంలో అందులో మిథైల్‌ మెర్క్యూరీని కలవలేదని తెలిపింది. థర్డ్‌ పార్టీ వాళ్లు కలిపి వినియోగదారులకు విక్రయించినట్లు వైద్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మిథైల్‌ మెర్క్యూరీ హానికరమైందని.. దీని కారణంగా జ్ఞాపకశక్తి కోల్పోవడం, ఆందోళన, నిరాశ, తలనొప్పి, వణుకు వంటి లక్షణాలు వస్తాయని తెలిపారు.

కాగా ఈ విషయంపై పాండ్స్‌ కంపెనీ స్పందించింది. ఈ క్రీమును స్కిన్ లైట్‌నర్‌గా.. మచ్చలు, ముడతలు తొలగించడానికి మహిళలు ఉపయోగిస్తారని.. తమ ఉత్పత్తుల్లో మెర్కూరీని ఎట్టిపరిస్థితుల్లో ఉపయోగించమని స్పష్టం చేసింది. తమ ఉత్పత్తులు( క్రీమ్‌లు) సురక్షితంగా ఉండేలా రిటైలర్లతో కలిసి పనిచేస్తామని తెలిపింది. ఏదేమైనా తమ లేబుల్‌ ఉన్న క్రీమ్‌ వాడి ఆస్పత్రిపాలైన మహిళ పట్ల ఆందోళన చెందుతున్నామని తెలిపింది. అదేవిధంగా తాము ఈ  విషయంపై దర్యాప్తు చేయడానికి అధికారులను నియమిస్తామని పేర్కొంది. అధికారికంగా లోగో, లేబుల్స్‌ ఉన్న పాండ్స్‌ ఉత్పత్తులను మాత్రమే కొనాలని వినియోగదారులకు విఙ్ఞప్తి చేసింది.
 

>
మరిన్ని వార్తలు