ఎదురుచూపులేనా..

9 Jan, 2018 07:26 IST|Sakshi

 

పదోన్నతుల కోసం సీనియర్‌ ఏఎస్సైల నిరీక్షణ

మూణ్ణాళ్ల ముచ్చటగా సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులు

ప్రమోషన్‌ కల్పించి.. మళ్లీ రివర్షన్‌ చేసిన వైనం

సాక్షిప్రతినిధి, ఖమ్మం: పోలీసులకు పదోన్నతులు మూణ్ణాళ్ల ముచ్చటగానే మిగిలాయి. పోలీసు శాఖలో వివిధ హోదాల్లో 30 ఏళ్లుగా సేవలు అందించినప్పటికీ పదోన్నతుల కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. 1984లో కానిస్టేబుళ్లుగా ఎంపికైనా ఇప్పటివరకు వారు పొందింది కేవలం రెండే రెండు ప్రమోషన్లు. మూడో ప్రమోషన్‌ను ఎస్సైలుగా 2015లో వరంగల్‌ జోన్‌లో 31 మంది ఏఎస్సైలకు ప్రభుత్వం కల్పించింది. అయితే వేకెన్సీలు లేవన్న నెపంతో మూడు నెలల్లోనే వీరికి రివర్షన్‌ కల్పిస్తూ యథాస్థానంలో ఏఎస్సైలుగా పోస్టింగ్‌ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో విచిత్రం ఏమిటంటే.. పోస్టులు లేవని చెప్పిన ప్రభుత్వం వీరికి పదోన్నతి కల్పించకుండానే వీరికన్నా జూనియర్లు అయిన ఏఎస్సైలను ఎస్సై శిక్షణకు పంపించి పదోన్నతి సైతం కల్పించింది. దీనిపై వరంగల్‌ జోన్‌లోని 31 మంది ఏఎస్సైలు తమకు జరిగిన అన్యాయంపై ఇటు న్యాయస్థానాన్ని, అటు పోలీస్‌ ఉన్నతాధికారులను ఆశ్రయించారు. మళ్లీ ఎస్సైలుగా పదోన్నతి కల్పిస్తామని హామీ ఇచ్చారే తప్ప ఇప్పటికీ అది ఆచరణకు నోచుకోలేదు.

 ఎస్సైలుగా పదోన్నతి పొంది రివర్షన్‌ పొందిన 31 మందిలో అనేక మంది ఇప్పటికే ఉద్యోగ విరమణ చేశారు. మరికొందరు ఒకటి, రెండు నెలల్లో ఉద్యోగ విరమణ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. తమను సింగిల్‌ స్టార్‌తో సరిపెట్టకుండా సీనియారిటీ ఆధారంగా ఎస్సైలుగా వెంటనే పదోన్నతి కల్పించాలంటూ వరంగల్‌ జోన్‌ పరిధిలోని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, జయశంకర్‌ భూపాలపల్లి, జనగామ, వరంగల్‌ రూరల్, వరంగల్‌ అర్బన్, కరీంనగర్‌ జిల్లాలకు చెందిన సీనియర్‌ ఏఎస్సైలు డీజీపీ మహేందర్‌రెడ్డిని సైతం కలిసి తమ సమస్యను విన్నవించారు. పోలీస్‌ శాఖలో పదోన్నతుల పర్వం వేగం పుంజుకోవడంతో తమకు ఎస్సైలుగా పదోన్నతి కల్పించి.. ఆ తర్వాత మిగిలిన పోస్టుల్లో జూనియర్లను నియమించాలని వారు డీజీపీకి విజ్ఞప్తి చేశారు.

1984లో వరంగల్‌ రేంజ్‌ పరిధిలో పలువురు కానిస్టేబుళ్లుగా నియమితులయ్యారు. వీరికి సీనియారిటీ ప్రకారం హెడ్‌ కానిస్టేబుళ్లు, ఏఎస్సైలుగా పదోన్నతి కల్పించారు. తర్వాత వీరు నిబంధనల ప్రకారం శిక్షణ పూర్తి చేసుకుని ఆయా స్థానాల్లో పనిచేశారు. తమను హెడ్‌ కానిస్టేబుళ్లు, ఏఎస్సైలుగా రెగ్యులర్‌ చేయాలని ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. వీరి వాదనలను విన్న ట్రిబ్యునల్‌ రెగ్యులర్‌ చేసి.. శిక్షణ ఇవ్వాలని ఆదేశించింది. దీంతో శిక్షణ పూర్తి చేసుకున్న అనంతరం సీనియారిటీ ప్రకారం 31 మంది ఎస్సైలుగా పదోన్నతి పొందారు. ఎస్సైలుగా పదోన్నతి పొందిన వారికి 2013 అక్టోబర్‌ నుంచి 2014 మార్చి ఒకటో తేదీ వరకు శిక్షణ ఇచ్చారు. అనంతరం వివిధ పోలీస్‌స్టేషన్లలో సబ్‌ ఇన్‌స్పెక్టర్లుగా నియమించారు.  

పోస్టులు ఖాళీ లేవన్న కారణంతో..
కానిస్టేబుళ్ల సీనియారిటీతో అంచెలంచెలుగా సబ్‌ ఇన్‌స్పెక్టర్లుగా పదోన్నతులు పొందిన వీరు మూడు నెలలపాటు ఆయా పోలీస్‌స్టేషన్లలో పనిచేశారు. ఆ సమయంలో సమర్థవంతంగా పనిచేయడంతోపాటు వీరిపై ఎటువంటి ఆరోపణలు కూడా రాలేదు. అయితే హఠాత్తుగా వారి పదోన్నతులు రద్దు చేస్తూ.. చీఫ్‌ ఆఫీస్‌ నుంచి ఉత్తర్వులు అందాయి. మళ్లీ యథాస్థానంలో ఏఎస్సైలుగా పనిచేయాలని ఆదేశాలు అందాయి. దీంతో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పదోన్నతులు లభించాయన్న ఆనందం కనీసం మూడు నెలలు కూడా మిగలలేదని వారు వాపోతున్నారు. ఈ అంశంపై మళ్లీ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించడంతో పదోన్నతులను రద్దు చేస్తూ ఇచ్చిన ఆర్డర్లను ఉపసంహరించుకోవాలని తీర్పు చెప్పింది. దీనిపై ఉన్నతాధికారులు ఏమాత్రం స్పందించడం లేదని పదోన్నతి పొందిన ఎస్సైలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

సానుకూలంగా ఉన్నా..
ఎంతో కష్టపడి పనిచేస్తూ 1984 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుళ్లు ఎస్సైలుగా పదోన్నతి పొంది.. మళ్లీ రివర్షన్‌ అయ్యారు. అయితే వీరు ఇటు ట్రిబ్యునల్‌తోపాటు ఉన్నతాధికారులు, డీజీపీలను కలుస్తూ తమ ఆవేదనను వెలిబుచ్చారు. అందరూ వారిపై సానుకూలంగానే స్పందించారు. తాము మళ్లీ ఏఎస్సైలుగా పనిచేయాల్సి వస్తోందని, పదోన్నతికి సంబంధించిన ఉత్తర్వులు తమకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్రిబ్యునల్‌ తమకు అనుకూలంగా తీర్పు చెప్పినా.. గతంలో ఉన్న డీజీపీ సానుకూలంగా స్పందించినా.. న్యాయం జరగడం లేదంటున్నారు. తమ తర్వాత రెండు బ్యాచ్‌లకు పదోన్నతి కల్పించారని కానీ.. తమ పరిస్థితి అలాగే ఉందని వారు వాపోతున్నారు.

కొన్నేళ్లుగా..
పదోన్నతుల కోసం 1984 బ్యాచ్‌ కానిస్టేబుళ్లు కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్నారు. ఎలాగోలా పదోన్నతులు దక్కినా.. రివర్షన్‌ కావడంతో మళ్లీ యథాస్థానంలో పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ బ్యాచ్‌కు చెందిన వారిలో ఇప్పటికే చాలా మంది ఉద్యోగ విరమణ పొందారు. మరికొందరు రెండు, మూడు నెలల్లో ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఉద్యోగ విరమణకు దగ్గరలో ఉన్న తమకు పదోన్నతి వస్తే ఎంతో కొంత లాభం చేకూరుతుందని ఆశతో ఉన్నారు. అయితే వీరికి మాత్రం ఎదురుచూపులు తప్పడం లేదు.

మరిన్ని వార్తలు