రిటైర్డ్‌ ఉపాధ్యాయుడిపై దాడి.. చివరికి రక్షణగా ఇద్దరు కానిస్టేబుల్స్‌

3 Dec, 2023 11:32 IST|Sakshi
జిల్లా కేంద్రంలో నిలిచిపోయిన వాహనాలు. ధర్నా చేస్తున్న కాంగ్రెస్‌ నాయకులతో మాట్లాడుతున్న అదనపు ఎస్పీ రాములు

మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్‌ నాయకుల ధర్నా

భారీగా ట్రాఫిక్‌ జాం

మహబూబ్‌నగర్‌ క్రైం: కిరాణ సామాన్లు తీసుకుంటున్న రిటైర్డ్‌ ఉపాధ్యాయుడిపై దాడి చేయడం పట్టణంలో కలకలం రేపింది. ఈ ఘటనపై కాంగ్రెస్‌ నేతలు ఆందోళన నిర్వహించారు. రిటైర్డ్‌ ఉపాధ్యాయుడు గవినోళ్ల వెంకట్‌రెడ్డిపై దాడి చేసిన వ్యక్తులపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ నాయకులు శనివారం రాత్రి రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎదుట జడ్చర్ల–మహబూబ్‌నగర్‌ రోడ్డుపై ధర్నా చేశారు.

వివరాల్లోకి వెళితే.. శ్రీనివాస కాలనీకి చెందిన గవినోళ్ల వెంకట్‌రెడ్డి శనివారం సాయంత్రం 5:40గంటల ప్రాంతంలో ఎస్‌వీ మార్ట్‌ దగ్గర కిరాణా సామాన్లు తీసుకుంటున్న క్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకుడు శ్రీకాంత్‌గౌడ్‌ కొంతమందితో అక్కడికి వచ్చి కాంగ్రెస్‌కు ప్రచారం చేశావని తనపై దాడి చేస్తూ సూపర్‌మార్కెట్‌లో నుంచి బయటకు తెచ్చారని వెంకట్‌రెడ్డి ఫిర్యాదు చేశాడు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు శ్రీకాంత్‌గౌడ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ మహేష్‌ వెల్లడించారు.

రెండు గంటల పాటు ధర్నా
దాడిఘటనపై కాంగ్రెస్‌ నేతలు రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. నిందితులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దాదాపు రెండు గంటల పాటు రోడ్డుపై బైఠాయించడంతో ఇటూ జడ్చర్ల వైపు అటూ బస్టాండ్‌ వైపు రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ జాం అయ్యింది.

ఈ సమయంలో ఒకరిద్దరూ రోగులు ఆస్పత్రికి వెళ్లే వారు ఇబ్బంది పడ్డారు. ఆందోళన చేస్తున్న వారితో జిల్లా అదనపు ఎస్పీ రాములు చర్చలు జరిపి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అదేవిధంగా వెంకట్‌రెడ్డి ఇంటికి ఇద్దరూ కానిస్టేబుల్స్‌ను రక్షణగా ఇచ్చారు.

ఇది చదవండి: రిటైర్డ్‌ ఉపాధ్యాయుడిపై దాడి.. చివరికి రక్షణగా ఇద్దరు కానిస్టేబుల్స్‌

మరిన్ని వార్తలు