కుక్కల్లో వ్యాధి నిర్ధారణతో వైద్యం సులువు

9 Feb, 2018 10:19 IST|Sakshi
గుండె జబ్బుల గురించి వివరిస్తున్న డాక్టర్‌ భార్గవి

పశువైద్య యువ శాస్త్రవేత్త భార్గవి

ఆత్కూరు(గన్నవరం): పెంపుడు కుక్కల్లో వచ్చే గుండె సంబంధిత వ్యాధులను సకాలంలో నిర్ధారించడం ద్వారానే నివారణ సాధ్యమని అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన యువ పశువైద్య శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ భార్గవి గడియారం స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం ఆత్కూరులోని స్వర్ణభారత్‌ ట్రస్టులో పెంపుడు కుక్కల యాజమాన్యంపై నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో గురువారం వ్యాధుల నిర్ధారణ, నివారణ చర్యలపై పరిశోధన ప్రజెంటేషన్‌ చేశారు. ఈ సందర్భంగా భార్గవి కుక్కల్లో వచ్చే హర్ట్‌ఓర్మ్‌ వ్యాధి ప్రాణంతకరమైనదని చెప్పారు. దోమకాటు వల్ల సంభవించే ఈ వ్యాధి వల్ల పరాన్నజీవులు వ్యాప్తి చెంది ఊపిరితిత్తులు, గుండె సంబంధిత వ్యాధులకు దారితీస్తుందని తెలిపారు. డయాగ్నసిస్‌ విధానంలో ఎక్సరే, రక్తం, యూరిన్‌ పరీక్షల ద్వారా వ్యాధి నిర్ధారించవచ్చని చెప్పారు. ఈ వ్యాధి దోమల ద్వారా కుక్కల నుంచి మనుషులకు కూడా సంక్రమిస్తుందని వెల్లడించారు.

బేరియాట్రిక్‌ సర్జరీ నిపుణులు ప్రొఫెసర్‌ ఎల్‌.రంగనాథ్‌ మాట్లాడుతూ... మనుషుల మాదిరిగానే ఆహార అలవాట్లలో వస్తున్న మార్పులు కారణంగా పెంపుడు కుక్కలో గుండె సంబంధిత వ్యాధులు ఉత్పన్నమవుతున్నాయని వివరించారు. ముఖ్యంగా ఎక్కువ కొవ్వు శాతం ఉన్న పదార్థాలను పెట్టడం కారణంగా కుక్కల్లో వయసు పెరిగిన కొద్దీ జీవ క్రీములు పెరిగి, రోగ నిరోధక శక్తి మందగిస్తుందని పేర్కొన్నారు. ఈ తరహా కుక్కలకు బేరియాట్రిక్‌ సర్జరీ ద్వారా వ్యాధి నివారణ చర్యలు తీసుకోవచ్చని చెప్పారు.   కాలేయ వ్యాధి నిపుణులు ప్రొఫెసర్‌ డాక్టర్‌ పీఎన్‌ ద్వివేది మాట్లాడుతూ కుక్కల్లో ఎక్కువగా వైరస్‌ కారణంగా కాలేయ సంబంధమైన వ్యాధులు వస్తున్నాయని చెప్పారు. ఆహారం సరిగ్గా తీసుకోకపోవడం, నీరసించడం వంటివి వ్యాధి లక్షణాలుగా ఉంటాయన్నారు. కుక్కలకు ముందస్తు టీకాలు వేయించడం ద్వారా ఈ వ్యాధి నుంచి కాపాడవచ్చని సూచించారు. ప్రొఫెసర్‌ డాక్టర్‌ నంది రేబిస్‌ వ్యాధి నిర్ధారణ, నివారణ పద్ధతుల గురించి వివరించారు. ప్రొఫెసర్‌ సయ్యద్‌ సాజిద్‌ హుస్సెన్‌ స్టెమ్‌సెల్‌ థెరపీ ద్వారా కుక్కల్లో నాడీ వ్యవస్థ సమస్యలను, కీళ్ళ సమస్యల పరిష్కార మార్గాలు గురించి తెలియజేశారు. కళాశాల అసోసియేట్‌ డీన్‌ డాక్టర్‌ జి.శ్రీనివాసరావు, సదస్సు నిర్వాహకులు వై. వైకుంఠరావు, దేశ, విదేశాలకు చెందిన 300 మంది  పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు