ఏజెన్సీలో ఆఫ్‌లైన్‌

29 Dec, 2017 13:41 IST|Sakshi

ఉమ్మడి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో నిలిచిన ఇంటర్నెట్‌ సేవలు

మైదాన ప్రాంతాల్లోని గ్రామాల్లో సైతం అదే తీరు

మీ సేవ కేంద్రాలు పనిచేయక జనం ఇబ్బందులు

ప్రభుత్వ కార్యాలయాల్లో మినహా కానరాని ఇంటర్నెట్‌

16వ తేదీ నుంచి ఆగిన అన్ని మొబైల్‌ కంపెనీల డేటా సర్వీస్‌లు

ఆసిఫాబాద్‌ జిల్లా కలెక్టరేట్‌లో నిలిచిన సేవలు

టీఆర్‌టీ దరఖాస్తుల గడువు సమీపిస్తుండటంతో ఆందోళనలో నిరుద్యోగులు

ఆదిలాబాద్, బోథ్, ఖానాపూర్, ఆసిఫాబాద్, సిర్పూర్‌ నియోజకవర్గాల్లో ఇబ్బందులు

సేవలను పునరుద్ధరించాలి..
గత 12 రోజుల నుంచి జిల్లాలో ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేశారు. ఘర్షణ నేపథ్యంలో డేటా సేవలను జిల్లా స్థాయిలో నిలిపివేయడంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోంది. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోలేపోతున్నాం. కరెంట్‌ అఫైర్స్, ఉద్యోగ నోఫికేషన్లు గురించి తెలుసుకోలేకపోతున్నాం. ఘర్షణలకు కారణమైన సోషల్‌ నెటవర్క్‌లను బ్లాక్‌ చేసి, ఇంటర్నెట్‌ పునరుద్ధరిస్తే సామాన్య ప్రజలకు, నిరుద్యోగులకు, విద్యార్థులకు, ఆన్‌లైన్‌ సెంటర్ల వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. వెంటనే ప్రభుత్వం, సంబంధిత అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. – ఎల్చల్‌వార్‌ లక్ష్మణ్, ఆదిలాబాద్‌

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: సామాజిక మాధ్యమాల్లో వదంతులు వ్యాపించకుండా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని ప్రజానీకాన్ని ఇబ్బందులకు గురిచేస్తోంది. ఆదివాసీలు, లంబాడా తెగల మధ్య రిజర్వేషన్ల విషయంలో తలెత్తిన వివాదం ముదిరి ఈనెల 15న ఉట్నూర్‌లో విధ్వంసానికి కారణమైంది. ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు చనిపోగా, సామాజిక మాధ్యమాల్లో హత్యలుగా ప్రచారం జరిగి, విధ్వంసానికి కారణమైందని భావించిన ప్రభుత్వం 15వ తేదీ అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్‌ సేవలపై ఆంక్షలు విధించింది. ఏజెన్సీ ప్రాంతాల్లో బీఎస్‌ఎన్‌ఎల్‌ బ్రాడ్‌బాండ్‌ సర్వీస్‌లతో పాటు అన్ని ప్రైవేటు మొబైల్‌ కంపెనీల ఇంటర్నెట్‌ డేటా సర్వీస్‌లను నిలిపివేసింది.

దీంతో ఆదిలాబాద్, ఆసిఫాబాద్‌ , మంచిర్యాల జిల్లాల పరిధిలోని ఏజెన్సీ మండలాల్లో 16వ తేదీ నుంచి నెట్‌ సర్వీస్‌ పూర్తిగా నిలిచిపోయింది. ఈనెల 23వ తేదీ వరకు ఆదిలాబాద్, మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్, మందమర్రి, బైంసా వంటి పట్టణాల్లో కూడా ఇబ్బంది ఎదురైనప్పటికీ, ప్రస్తుతం ఇంటర్నెట్‌ సేవలను పునరుద్ధరించారు. కానీ ఆసిఫాబాద్, ఆదిలాబాద్‌ జిల్లాల్లోని ఉట్నూర్,  నార్నూర్, లింగాపూర్, సిర్పూర్‌(యు), ఇంద్రవెల్లి మండలాల్లో 13 రోజులుగా ఎలాంటి ఇంటర్నెట్‌ సేవలు ప్రజలకు అందడం లేదు. మంచిర్యాల జిల్లా జన్నారంలో ఈనెల 26న మరోసారి అల్లర్లు చెలరేగడంతో జన్నారం, కడెం, దండేపల్లి, లక్సెట్టిపేట మండలాల పరిధిలో మళ్లీ ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు. దీంతో విద్యార్థులు, నిరుద్యోగులతో పాటు సాధారణ ప్రజానీకం కూడా ఈ పరిణామాలతో ఇబ్బంది పడుతున్నారు.

కుమురం భీం జిల్లాలో సమస్య తీవ్రం
ఈనెల 16 నుంచి ఏజెన్సీలో ఇంటర్నెట్‌ అందుబాటులో లేకపోవడంతో కుమురం భీం జిల్లాలో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. మీ సేవ, ఈ సేవ, విద్య, వైద్యంతో పాటు ప్రభుత్వ కార్యాలయాలన్నింటా ఆన్‌లైన్‌తోనే ముడిపడి ఉండటంతో అనేక పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. రవాణా కోసం బస్సు, రైల్వే, విమాన టికెట్ల బుకింగ్‌ నిలిచిపోయాయి. మీ సేవ కేంద్రాల్లో ఆధార్, కుల, ఆదాయ, భూ సంబంధ తదితర మార్పులు చేర్పులకు సంబందించి సేవలు అందడం లేదు. రవాణా కార్యాలయానికి నిత్యం వందలాది మంది లైసెన్స్, రెన్యూవల్, ఫిట్‌నెస్, పర్మిట్‌ ఇతర అనుమతుల కోసం వాహనదారులు వస్తుంటారు. ఆర్టీఏ కార్యాయలంలో నెట్‌ అందుబాటులో ఉన్నా... జిల్లా వ్యాప్తంగా నెట్‌ లేకపోవడంతో ఆన్‌లైన్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకోవడం కుదరడం లేదు. దీంతో దరఖాస్తుదారుల సంఖ్య తగ్గిపోయింది. ఇంటర్నెట్‌ అందుబాటులో ఉన్న సమీప ప్రాంతాలకు వెళ్లి స్లాట్‌ బుక్‌ చేసుకుని వస్తున్నారు. జిల్లాలోని ఆసిఫాబాద్, బెజ్జూర్, సిర్పూర్‌(యు), కెరిమెరి, తిర్యాణి, దహేగాం, చింతలమానెపల్లి, కౌటాల, రెబ్బెన, వాంకిడి తదితర మండలాల్లో ప్రజలు ఇంటర్నెట్‌ సదుపాయం లేక ఇబ్బందులు పడుతున్నారు. కాగజ్‌నగర్‌ పట్టణంలో కూడా బీఎస్‌ఎన్‌ఎల్‌ మినహా ఇతర నెట్‌వర్క్‌ల బ్రాడ్‌బాండ్‌ రావడం లేదు.

ప్రభుత్వ కార్యాలయాల్లోనూ తప్పని తిప్పలు
జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయాల్లోనూ ఇంటర్నెట్‌ సేవలు నిలిచిపోవడంతో ఫైళ్లన్ని పేరుకుపోతున్నాయి. కల్యాణలక్ష్మి బిల్లులు అప్‌లోడ్‌ చేయడం, ప్రభుత్వ ఉద్యోగుల, కింది స్థాయి సిబ్బంది జీతాలు, రెవెన్యూ శాఖలో భూ ప్రక్షాళనలో ఆన్‌లైన్‌లో మార్పులు చేర్పులు అన్ని స్తంభించిపోయాయి. ఇక ఉపాధిహామీ పథకంలో దినసరి కూలీల వేతాలు, పెన్షన్లు, ప్రతి రోజు ఇచ్చే నివేదికలు తదితరవన్ని ఆన్‌లైన్‌లో జరగాల్సి ఉన్నందున అన్నింటా జాప్యం జరుగుతోంది. మరోవైపు కేసీఆర్‌ కిట్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నమోదయ్యే గర్భిణుల వివరాలు, ప్రసూతి వివరాలు, ఆశ వర్కర్ల ఇన్సెంటివ్‌లు, సిబ్బంది జీతాలు నమోదు ప్రక్రియ ఆగిపోయిందని డీఎంహెచ్‌వో కార్యాలయ సిబ్బంది చెబుతున్నారు.

ముంచుకొస్తున్న టీఆర్టీ గడువు..
మరో పక్క తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహిస్తున్న టీఆర్‌టీ (టీచర్‌ రిక్రూమెంట్‌ టెస్టు)కు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 30 వరకే గడువు ఉంది. ఇంకా ఉమ్మడి ఆదిలాబాద్‌లో అనేకమంది దరఖాస్తు చేసుకోనివారు ఉన్నారు. అంతేకాక పాత టీఆర్టీ నోటిఫికేషన్‌ ప్రకారం దరఖాస్తు చేసుకున్నవారు కొత్త నోటిఫికేషన్‌ (పాతజిల్లా ప్రతిపాదికన జరిగే) ప్రకారం ఎడిట్‌ చేసుకోవల్సిన అభ్యర్థులు ఉన్నారు. కొందరు నెట్‌ వచ్చే ప్రాంతాలకు వెళ్లి దరఖాస్తు చేసుకంటున్నారు. వీరికోసం జిల్లా కేంద్రంలోని ఎమ్మార్వో ఆఫీసులో ప్రత్యేకంగా కంప్యూటర్‌ ఆపరేటర్‌ను నియమించినప్పటకీ బెజ్జూర్, పెంచికల్‌పేట్, దహేగం వంటి సుదూర ప్రాంతాల వారు ఇక్కడికి రావాలంటే ఎంతో కష్టం.

బీఎస్‌ఎన్‌ఎల్‌ బ్రాడ్‌బాండ్‌తో ప్రభుత్వ కార్యాలయాల్లో...
ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లా ఏజెన్సీ మండల కేంద్రాల్లోని బ్యాంకులు, తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాల్లో బీఎస్‌ఎన్‌ఎల్‌ బ్రాడ్‌బాండ్‌ కనెక్షన్‌తో సేవలు నడుస్తున్నాయి. ఆదిలాబాద్‌లో మీ సేవ సెంటర్లు అన్ని మండలాల్లో నడుస్తున్నట్లు సంబంధిత అధికారులు చెపుతున్నప్పటికీ, ఏజెన్సీల్లో సెంటర్లను తెరవడం కూడా లేదు. ప్రైవేటు మొబైల్‌ కంపెనీల బ్రాడ్‌బాండ్‌తో పనిచేసే కంప్యూటర్లు గానీ, మొబైల్‌ డేటాతో రూటర్‌తో నడిచే కంప్యూటర్లు పనిచేయడం లేదని పలు ప్రాంతాల్లో ఆందోళన చెందుతున్నారు.

గిరాకే లేకుండా పోయింది
జిల్లాలో రెండు వర్గాల మద్య ఏర్పడిన ఘర్షణల మూలంగా నెట్‌ను తొలగించటంతో షాపులో గిరాకే లేకుండా పోయింది. రోజంతా షాపులో ఉంటే రూ.100 కూడా రావటం లేదు. టీఆర్‌టీతో పాటు ఇతర ఉద్యోగాల కోసం ఆన్‌లైన్‌ లోనే దరఖాస్తు చేయాలి. నెట్‌ ఉంటేనే ఆన్‌లైన్‌ పనులు సాగుతాయి. అధికారులు ఎలాంటి సమాచారం లేకుండా గత 15 రోజులుగా నెట్‌ సేవలు తొలగించటంతో అనేక ఇబ్బందులకు గురవుతున్నాం. కనీసం ఎప్పటి వరకు పునరుద్ధరిస్తారనే విషయం కూడా తెలియటం లేదు.   – మియ్యపురం రమేశ్‌ (నెట్‌సెంటర్‌ యజమాని)

మరిన్ని వార్తలు