ఫలితాలు, గణాంకాలు నడిపిస్తాయ్‌ !

15 Jan, 2018 00:16 IST|Sakshi

నేడు టోకు ధరల ద్రవ్యోల్బణ డేటా 

దిగ్గజ కంపెనీల క్యూ3 ఫలితాలు  

మార్కెట్‌ ప్రభావిత అంశాలు  

కీలక కంపెనీల మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు, ద్రవ్యోల్బణ గణాంకాలు ఈ వారం మార్కెట్‌ను నడిపిస్తాయని విశ్లేషకులు అంటున్నారు. వీటితో పాటు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల గమనం, డాలర్‌తో రూపాయి మారకం కూడా తగిన ప్రభావాన్ని చూపిస్తాయని వారంటున్నారు.  గత శుక్రవారం వెలువడిన పారిశ్రామికోత్పత్తి, ద్రవ్యోల్బణ గణాంకాలకు సోమవారం మార్కెట్‌ ప్రతిస్పందిస్తుంది. పారిశ్రామికోత్పత్తి 17 నెలల గరిష్ట స్థాయి, 8.4 శాతానికి ఎగియగా, రిటైల్‌ ద్రవ్యోల్బణం కూడా 17 నెలల గరిష్ట స్థాయి, 5.2 శాతానికి ఎగిశాయి.  

మార్కెట్‌ జోరు కొనసాగుతుంది... 
ఇక మంగళవారం టోకు ధరల ద్రవ్యోల్బణ గణాంకాలు వస్తాయి. ఈ వారంలో భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్‌ ఇండస్ట్రీస్,  హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐటీసీ, విప్రో, హిందుస్తాన్‌ యూనిలివర్, యస్‌ బ్యాంక్, కోటక్‌ మహీంద్రా బ్యాంక్, తదితర దిగ్గజ సంస్థల క్యూ3 ఫలితాలు వెలువడుతాయి. ప్రపంచ మార్కెట్ల జోరు, నిధుల ప్రవాహం బాగా ఉండటంతో స్టాక్‌ మార్కెట్లో ప్రస్తుత సానుకూలతలు కొనసాగుతాయని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ చెప్పారు. అయితే కంపెనీల క్యూ3 ఆర్థిక ఫలితాలు, బడ్జెట్‌ సంబంధించిన సంకేతాలు మార్కెట్‌ ట్రెండ్‌ను నిర్దేశిస్తాయని పేర్కొన్నారు. ఇన్ఫోసిస్, టీసీఎస్‌ ఫలితాలు అంచనాలకనుగుణంగానే వచ్చాయని, మార్కెట్‌ జోరు కొనసాగుతుందని అరిహంత్‌ క్యాపిటల్‌ మార్కెట్స్‌ హోల్‌టైమ్‌ డైరెక్టర్‌ అనితా గాంధీ చెప్పారు.  

విదేశీ పెట్టుబడులు ః రూ.5,200 కోట్లు 
భారత క్యాపిటల్‌ మార్కెట్లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) రూ.5,200 కోట్ల మేర పెట్టుబడులు పెట్టారు.  డిపాజిటరీల గణాంకాల ప్రకారం ఈ నెల 1–12 మధ్యన విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్లో రూ.2,172 కోట్లు, డెట్‌ మార్కెట్లో రూ.3,080 కోట్లు చొప్పున ఇన్వెస్ట్‌ చేశారు. ఈల్డ్స్‌ ఆకర్షణీయంగా ఉండడం, కంపెనీల క్యూ3 ఫలితాలు ఆశావహంగా ఉంటాయనే అంచనాలు దీనికి కారణమని నిపుణులంటున్నారు. ఇవే కారణాల వల్ల విదేశీ పెట్టుబడులు మరింతగా పెరిగే అవకాశాలున్నాయని వారంటున్నారు.  గత ఏడాది డెట్, ఈక్విటీల్లో కలిపి విదేశీ ఇన్వెస్టర్లు మొత్తం రూ.2 లక్షల కోట్ల మేర పెట్టుబడులు పెట్టారు.

>
మరిన్ని వార్తలు