65 వేల దిగువకు సెన్సెక్స్‌

14 Nov, 2023 06:19 IST|Sakshi

ద్రవ్యోల్బణ డేటా వెల్లడి నేపథ్యంలో అప్రమత్తత

19,400 స్థాయిని కోల్పోయిన నిఫ్టీ

బలిప్రతిపద సందర్భంగా నేడు ఎక్సే్చంజీలకు సెలవు  

ముంబై: ద్రవ్యోల్బణ డేటా వెల్లడి నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తూ బ్యాంకింగ్, ఫైనాన్స్, ఐటీ షేర్లలో అమ్మకాలకు పాల్పడ్డారు. విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు, రూపాయి బలహీనతలు సెంటిమెంట్‌పై మరింత పెంచాయి. ఫలితంగా సోమవారం సెన్సెక్స్‌ 326 పాయింట్లు నష్టపోయి 64,934 వద్ద ముగిసింది. నిఫ్టీ 82 పాయింట్లు పతనమై 19,444 వద్ద నిలిచింది. దీంతో సూచీలకు ముహూరత్‌ ట్రేడింగ్‌ లాభాలన్నీ మాయమ య్యాయి.

ఉదయం స్వల్ప నష్టాలతో మొదలైన సూచీలు రోజంతా బలహీనంగా ట్రేడయ్యాయి. ఒక దశలో సెన్సెక్స్‌ 406 పాయింట్లు నష్టపోయి 64,853 వద్ద, నిఫ్టీ 111 పాయింట్లు క్షీణించి 19,415 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకాయి. నష్టాల మార్కెట్లోనూ ఇంధన, యుటిలిటీ, విద్యుత్, ఆటో షేర్ల రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. బీఎస్‌ఈ మిడ్, స్మాల్‌ క్యాప్‌ సూచీలు వరుసగా 0.85%, 0.32% చొప్పున నష్టపోయాయి.

విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,244  కోట్ల ఈక్విటీ షేర్లను అమ్మేశారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.830 కోట్ల షేర్లను కొన్నారు. ఆసియా, యూరప్‌ మార్కెట్లు అరశాతం నుంచి ఒకశాతం నష్టపోయాయి. కాగా అమెరికా మార్కెట్లు అరశాతానికి పైగా నష్టాల్లో ట్రేడవుతున్నాయి. బలిప్రతిపద సందర్భంగా నేడు ఎక్సే్చంజీలకు సెలవు. ట్రేడింగ్‌ తిరిగి యథావిధిగా బుధవారం ప్రారంభవుతుంది.  
 
     ప్రొటీయన్‌ ఈగవ్‌ టెక్నాలజీస్‌ షేరు లిస్టింగ్‌ రోజు 11% లాభాలు పంచింది. బీఎస్‌ఈలో ఇష్యూ ధర(రూ.792) వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో క్రమంగా కొనుగోళ్ల మద్దతు పెరగడంతో ఈ షేరు పుంజుకుంది. ట్రేడింగ్‌లో 12% ర్యాలీ చేసి రూ.891 వద్ద గరిష్టాన్ని తాకింది. చివరికి 11% లాభంతో రూ.883 వద్ద ముగిసింది. కంపెనీ విలువ రూ.3,571 కోట్లుగా నమోదైంది.   

‘‘అంతర్జాతీయ అనిశి్చతితో దీపావళి మరుసటి రోజూ భారత ఈక్విటీ మార్కెట్లలో దిద్దుబాటు కొనసాగింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల పెంపు ప్రభావాలతో ఐఐపీ వృద్ధి, తయారీ రంగ పీఐఎం భారీగా క్షీణించాయి. అయితే మెరుగైన కార్పొరేట్‌ ఆదాయాలు, స్థిరమైన ఆర్థిక వ్యవస్థ, సంస్థాగత కొనుగోళ్లు తదితర అంశాలు దిగువ స్థాయిలో దేశీయ మార్కెట్‌కు దన్నుగా నిలిచే వీలుంది’.
– దీపక్‌ జెసానీ, హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ రిటైల్‌ రీసెర్చ్‌ హెడ్‌

మరిన్ని వార్తలు