నిబంధనలకు పొగ

20 Feb, 2018 15:58 IST|Sakshi
కాలుష్యం వెదజల్లుతున్నవాహనం

కాలుష్యాన్ని వెదజల్లుతున్న వాహనాలు

తూతూ మంత్రంగా అధికారుల తనిఖీలు

పర్యావరణంలో పెరుగుతున్న కాలుష్యం

ఇబ్బందులు పడుతున్న ప్రజలు

తూప్రాన్‌ : శ్రీనివాస్‌ అనే వ్యక్తి ఆరు నెలల క్రితం కొనుగోలు చేసిన బైక్‌పై వెళ్తున్నాడు. దారిలో పోలీసులు ఆయన వాహన పత్రాలను పరిశీలించారు. ఆయన వద్ద అన్ని ధ్రువీకరణ పత్రాలున్నాయి.. కానీ కాలుష్య స్థాయిని తెలిపేది మాత్రం లేదు. దీంతో కొత్త వాహనం అని చెప్పినా  పోలీసులు రూ. 300 జరిమానా విధించారు. అదే శ్రీనివాస్‌ మరోసారి 2000 మోడల్‌ పాత ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా జరిగిన తనిఖీలో కాలుష్య నిర్ధారణ ధ్రువీకరణ పత్రాన్ని చూపించాడు. అంతే ఆ వాహనానికి ఎలాంటి జరిమానా విధించకుండానే వదిలేశారు. కళ్ల ముందే వాహనం నుంచి పొగలు వస్తున్నా వారు మాత్రం పట్టించుకోకపోవడం గమనార్హం.  ఇలాంటి సంఘటనలు జిల్లాలో నిత్యం ఏదో ఒక చోట జరుగుతున్నాయి.  వాహనాలు వెదజల్లుతున్న కాలుష్యం.. అధికారులు తీసుకుంటున్న చర్యలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.

వాహనాల కాలుష్య నియంత్రణ చర్యలు శూన్యం
వాహన కాలుష్య నియంత్రణ కోసం కఠిన నిబంధనలు ఉన్నాయి. కానీ వాటిని అమలు పరచడంలో అధికారులు విఫలమవుతున్నారు.  కాలుష్య ధ్రువీకరణ పత్రం ఉందా? లేదా? అనే విషయాన్ని పరిగణలోకి తీసుకుంటున్నారు. కానీ వాటిలో ఎంత మోతాదు కాలుష్య కారకాలున్నాయనే అంశాన్ని విస్మరిస్తున్నారు. దీంతో కాలుష్యానికి అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ఈ క్రమంలో వాహనాలు కాలుష్యాన్ని  చిమ్ముతూ ప్రజల ఆరోగ్యాన్ని హరించేస్తున్నాయి.  కఠినమైన కాలుష్య నియంత్రణ నిబంధనలు కొందరికి దోపిడీకి ఉపయోగపడుతున్నాయి.   వాహనాల  కాలుష్యాన్ని నిర్ధారించేందుకు ప్రభుత్వం సంచార తనిఖీ కేంద్రాలను అనుమతించింది. కానీ వారు వాహనాలకు ఎటువంటి పరీక్షలు జరపకుండానే కాలుష్య శాతాలను ముద్రించి వాహనదారులకు అంటగట్టి సొమ్ము చేసుకుంటున్నారు. అధికారులు మాత్రం అవేమీ పట్టించుకోవడం లేదు.

మరమ్మతులు చేయించుకోవాలి..
2010 ఏప్రిల్‌ తర్వాత వచ్చిన భారీ వాహనాల్లో మాల్‌ ఫంక్షన్‌ ఇండికేషన్‌ ల్యాంప్‌ ఉండాలనే నిబంధన ఉంది. శబ్ధ కాలుష్య నియంత్రణ విషయంలో ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది. వీటి అమలు మాత్రం ఎక్కడా జరగడం లేదు. తనిఖీ కేంద్రాల్లో ఈ విషయాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు. ల్యాంప్‌ ఆగినపుడు తనిఖీ చేసిన కాలుష్య విలువలు కచ్చితంగా రావనేది దీని అర్థం. తనిఖీ సమయంలో ల్యాంప్‌ పనిచేయకుంటే తప్పనిసరిగా వాహనాన్ని మరమ్మతులు చేసుకోవాల్సి ఉంటుంది. లేనిపక్షంలో వాహనదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని  కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. దీన్ని పరిశీలిస్తున్న దాఖలాలు ఎక్కడా కనిపించడం లేదు. జిల్లాలో ఉన్న వాహనాల వివరాలిలా ఉన్నాయి. నాన్‌ ట్రాన్స్‌ఫోర్టు వాహనాలు కార్లు 4834,   మోటార్‌ సైకిళ్లు 44,257, ఇతర వాహనాలు 426, టీటీ 6003, ట్రాన్స్‌పోర్టు వాహనాలు ఆటోలు 5,688, గూడ్స్‌ 3,292, మ్యాక్సీ క్యాబ్స్‌ 237, మోటార్‌ క్యాబ్‌ 699 ఇతర వాహనాలు 35, స్టేజీ క్యారియర్లు 102, టీటీ 3,711 ఉన్నాయి. ఇప్పటి వరకు 2016 అక్టోబర్‌ నుంచి జిల్లాలో 352 కేసులు చేశామని జిల్లా ఆర్టీఏ అధికారి గణేశ్‌ తెలిపారు. అలాగే జరిమానాలు రూ. 2లక్షల 24వేల 395  వరకు విధించినట్లు తెలిపారు.

కాలుష్య స్థాయి ఏమేరకు ఉండాలంటే..
1989 మోటారు వాహన చట్టం 115(2) నిబంధనల ప్రకారం వాహన కాలుష్యాల స్థాయి ఏ మేరకు ఉండాలనేది నిర్ణయించారు. కార్బన్‌ మోనాక్సైడ్, హెచ్‌సీ నిల్వలు ఎంత ఉండాలో సూచించారు. ఈ చట్టాన్ని మళ్లీ 2001లో సవరించారు. ఈ రెండింటి ప్రకారం పెట్రోల్, గ్యాస్, ద్విచక్ర వాహనాల్లో కార్బన్‌ మోనాక్సైడ్‌ 3.0 శాతం నుంచి 4.5 శాతానికి మించి ఉండకూడదు. డీజిల్‌తో నడిచే భారీ వాహనాలకు 4.5 శాతం లోపు ఉండాలి. నాలుగు చక్రాల డీజిల్‌ వాహనాలకు పురాతన వాహనాలకైతే 0.5 నుంచి 3.0 శాతంలోపే కార్బన్‌ మోనాక్సైడ్‌ శాతం ఉండాలి. ప్రస్తుతం తనిఖీలు నిర్వహిస్తున్న వాహనాల్లో ఎక్కడా వీటి స్థాయిలను పరిశీలించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.

మోతాదుకు మించితే కేసులు 
మోటారు వాహనాల చట్టం ప్రకారం.. వాహనాల నుంచి కాలుష్యం అధిక మోతాదులో వెదజల్లితే కేసులు నమోదు చేస్తాం. వాహనాలకు తప్పనిసరిగా కాలుష్య నియంత్రణ ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉండాలి. లేనట్లయితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. 
–గణేష్, ఆర్టీఏ అధికారి 

మరిన్ని వార్తలు