ఢిల్లీ: వాయు కాలుష్యం ఎఫెక్ట్‌.. స్కూల్స్‌ బంద్‌

5 Nov, 2023 11:20 IST|Sakshi

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం తీవ్రస్థాయికి చేరుకుంది. వరుసగా మూడోరోజు వాయు కాలుష్యం అతి తీవ్రస్థాయిలోనే ఉంది. ఆదివారం ఉదయం వాయు నాణ్యత సూచీ (ఏక్యూఐ) 401కి చేరింది. మరోవైపు.. శనివారం జహంగీర్‌పురి ప్రాంతంలో ఈ సూచీ 702, సోనియా విహార్‌లో 618కి పడిపోవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. 

దీంతో, అప్రమత్తమైన ఢిల్లీ ప్రభుత్వం పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. వాయు కాలుష్యం నేపథ్యంలో ఢిల్లీలోని అన్ని ప్రైమరీ స్కూల్స్‌ను నవంబర్‌ 10వ తేదీ మూసివేస్తున్నట్టు ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత, విద్యాశాఖ మంత్రి అతిషి తెలిపారు. అలాగే, 6-12వ తరగతి విద్యార్థులకు ఆన్‌లైన్‌ క్లాస్‌లు నిర్వహించనున్నట్టు ఆమె స్పష్టం చేశారు. 

మరోవైపు.. ఢిల్లీలో గాలిలో విషవాయువుల గాఢత (పీఎం) 2.5 స్థాయిలో ఉండటం.. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) జారీ చేసిన ప్రమాణాల కంటే 80 రెట్లు అధికం. ఈ గాలిని పీల్చడంతో ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో పాటు కంటి దురద, శ్వాసకోశ సంబంధిత రోగాల బారిన పడే అవకాశం ఉందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ ప్రాంతాన్ని అతి తీవ్ర కాలుష్య జోన్‌గా గుర్తించారు. రెండు వారాలపాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశముందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. చుట్టుపక్కల రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగులబెట్టడం, అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఈ కాలుష్యానికి కారణమయ్యాయి.

మరిన్ని వార్తలు