సీఏఏ: శరత్‌కుమార్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

26 Dec, 2019 09:56 IST|Sakshi

నటుడుగా, రాజకీయ నాయకుడిగా తనకంటూ ప్రత్యేక ముద్రను వేసుకున్న వ్యక్తి శరత్‌కుమార్‌. ఒక్క తమిళంలోనే కాకుండా, తెలుగు, మలయాళం అంటూ బహుభాషా నటుడిగా గుర్తింపు పొందిన శరత్‌కుమార్‌ గత ఏడాది తమిళంలో కంటే తెలుగులోనే ఎక్కువ చిత్రాలను చేశారు. కాగా తాజాగా కోలీవుడ్‌లో నటుడిగా వేగం పెంచారు. తెలుగులోనూ అవకాశాలు వస్తున్నాయని, త్వరలోనే వాటికి సంబంధించిన వివరాలను వెల్లడిస్తానని చెప్పారు.అన్నట్లు ఇప్పుడు వెబ్‌ సిరీస్‌ ట్రెండ్‌ నడుస్తున్న విషయం తెలిసిందే. తనూ వెబ్‌ సిరీస్‌కు ఎంటర్‌ అయ్యానని శరత్‌కుమార్‌ తెలిపారు. 

తమిళం, తెలుగు భాషల్లో రూపొందుతున్న ఒక వెబ్‌ సిరీస్‌లో నటిస్తున్నట్లు ఆయన చెప్పారు. క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ పాత్రకు మారిన శరత్‌కుమార్‌ తనకే సొంతమైన శక్తివంతమైన పాత్రల్లో నటిస్తున్నారు. అలా ప్రస్తుతం నాలుగైదు చిత్రాల్లో నటిస్తున్నారు. అందులో ఒకటి దర్శకుడు మణిరత్నం తన మెడ్రాస్‌ టాకీస్‌ పతాకంపై నిర్మిస్తున్న వానం కొట్టటుం ఒకటి. విక్రమ్‌ప్రభు, నటి ఐశ్వర్యరాజేశ్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో ముఖ్య పాత్రల్లో శరత్‌కుమార్, రాధికాశరత్‌కుమార్‌ కలిసి నటిస్తున్నారు.ఈ సందర్బంగా శరత్‌కుమార్‌ మంగళవారం మీడియాతో ముచ్చటించారు. సినిమాలు, నడిగర్‌సంఘం, రాజకీయాలు వంటి పలు విషయాలను శరత్‌కుమార్‌ ఈ సందర్భంగా ప్రస్తావించారు. 

ముస్లింలకు వ్యతిరేకంగా లేదు 
ఇక ప్రస్తుత రాజకీయాల విషయానికి వస్తే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన  పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై పలు ప్రాంతాల్లో ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. నిజానికి ఈ బిల్లు గురించి యువతకు సరైన అవగాహన లేదన్నారు. ఈ పౌరచట్ట బిల్లులో ముస్లింలకు వ్యతిరేకంగా ఏమీ లేదని అన్నారు. అలాంటిదేదైనా ఉంటే తానే రంగంలోకి దిగి పోరాడతానని అన్నారు. కరుణానిధి తరువాత ఆ స్థానంలో స్టాలిన్‌ను తను అంగీకరించలేకపోతున్నానన్నారు. ఇకపోతే తమిళనాడులో నాయకత్వం సరిలేదన్న ఆరోపణలు తగ్గిపోయాయన్నారు. ఊగుతున్న స్తంభాన్ని ఎత్తి నిలబెట్టినట్లు ఎడపాటి చాలా బాగా పరిపాలిస్తున్నారని పేర్కొన్నారు. కాగా  రాబోయే ఎన్నికల్లో  తన అఖిల భారత సమత్తువ పార్టీ శక్తి వంతంగా పని చేస్తుందని శరత్‌కుమార్‌ పేర్కొన్నారు. 

తండ్రిగా సహాయం చేయలేకపోతున్నాను..
ప్రస్తుతం తాను నటిస్తున్న వానం కొట్టటుం చిత్రం గురించి తెలుపుతూ గతంలో తాను నటించిన అయ్యా, సూర్యవంశం చిత్రాల తరహాలో ఈ చిత్రం ఉంటుందని తెలిపారు. ఇక దక్షిణ భారత నటీనటుల సంఘంకు ఇంతకు ముందు ఈయన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఆ సంఘ భవన నిర్మాణం నలిచిపోవడం సంకటకరమైన పరిస్థితిగా శరత్‌కుమార్‌ పేర్కొన్నారు. దానికి తాను కూడా సహాయం చేయలేని పరిస్థితి అని పేర్కొన్నారు. 

నటీనటుల సంఘానికి ప్రత్యేక అధికారిని నియమించే వరకూ పరిస్థితి రావడం చింతించవలసిన పరిస్థితి అన్నారు. ప్రస్తుతం సినిమా పరిశ్రమలో పరిస్థితులు బాగాలేవన్నారు. ఇంతకు ముందు పోడా పోడి చిత్రానికి సంబంధించిన సమస్య వ్యవహారంలో ఆ చిత్ర కథానాయకి వరలక్ష్మీకి ఒక తండ్రిగా తాను సహాయం చేయకపోవడం ఇప్పుడు బాధ అనిపిస్తోందని శరత్‌కుమార్‌ అన్నారు.  

చదవండి:
సీఏఏ : అమెరికా యువతి వీడియో వైరల్‌
వారు వెళ్లేందుకు 150 దేశాలున్నాయ్‌..

మరిన్ని వార్తలు