‘ఆర్టికల్‌–15’ మూవీ ప్రదర్శన వివాదం

1 Jul, 2019 16:40 IST|Sakshi

ముంబై : ప్రముఖ బాలీవుడ్‌ దర్శకనిర్మాత అనుభవ్‌ సిన్హా.. ఆయుష్మాన్‌ ఖురానా హీరోగా నిర్మించిన ‘ఆర్టికల్‌–15’ మూవీపై వివాదం రేగుతోంది. ఈ సినిమాను థియేటర్లలో ప్రదర్శించవద్దని, ఈ సినిమా ప్రదర్శనను అడ్డుకోవాలని బ్రాహ్మణ సంఘలు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ మేరకు బ్రాహ్మణ సంఘాలు ఆదివారం ఉత్తరప్రదేశ్‌ కాన్పూర్‌లోని పలు థియేటర్ల ఎదుట నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. సినిమా ప్రదర్శనను వెంటనే ఆపాలంటూ చిత్రయూనిట్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సినిమాలో బ్రాహ్మణ కులాన్ని కిరాతకంగా చూపించారని, దళితుల పట్ల బ్రాహ్మణులు వివక్ష చూపినట్లు ఈ సినిమాను తెరకెక్కించారని, ఇది సరికాదని అఖిల భారత బ్రాహ్మణ ఏక్తా పరిషత్‌ జనరల్‌ సెక్రటరీ హరి త్రిపాఠీ ఆరోపించారు. మరోవైపు ఈ సినిమా ప్రదర్శనకు ఇబ్బంది కలుగకుండా ప్రతి థియేటర్‌కు భద్రత కల్పిస్తామని, థియేటర్‌కు ఒక పోలీసు చొప్పున కేటాయిస్తామని స్థానిక పోలీసు అధికారి మనోజ్‌ గుప్తా తెలిపారు. ఈ సినిమా ప్రదర్శనను ఎవరైనా అడ్డుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా పోలీసు ఉన్నతాధికారి అనంత్ డియో పేర్కొన్నారు.

ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్ గ్రామంలో 2014లో దళితులైన ఇద్దరు అక్కా చెల్లెళ్లు చెట్టుకు ఉరివేసుకొని మరణించిన యథార్థ సంఘటన  ఆధారంగా.. దళితులపై సమాజంలో నెలకొన్న వివక్ష నేపథ్యంతో ‘ఆర్టికల్‌–15’ తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఇద్దరు దళిత అక్కా చెల్లెళ్లు చెట్టుకు ఉరివేసుకుని చనిపోగా మరో సోదరి అదృశ్యమైన సంఘటనను దర్యాప్తు చేసే పోలీసు అధికారిగా ఆయుష్మాన్‌ ఖురానా నటించారు.

మరిన్ని వార్తలు