గుండు నవ్వులు ఇక లేవు

20 Feb, 2018 01:55 IST|Sakshi
గుండు హనుమంతరావు

‘‘పైన ఏముంది.. ఆకాశం. కింద ఏముంది.. భూమి.. ఎలా చెప్పగలిగావ్‌.. తాయత్తు మహిమ’ అంటూ ‘మాయలోడు’లో నవ్వులు పంచాడు. ‘యావన్మంది భక్తులకు విజ్ఞప్తి. మా గురువుగారయినటువంటి శ్రీ డీవీఎస్‌ పండుశాస్త్రిగారు తప్పిపోయారు. ఆయనకి ఏకాదశి చంద్రుడిలాంటి బట్టతల.. భద్రాచలం దేవస్థానం వారు ఉచితంగా ఇచ్చిన ధోవతి.. అన్నవరం దేవస్థానం వారు ఫ్రీగా ఇచ్చిన శాలువా.. ఆయన్ని చూస్తే ఒక మహా పండితుడు, బ్రహ్మజ్ఞాని అని ఎవ్వరూ అనుకోరు’ అంటూ ‘ఆట’ చిత్రంలో బ్రాహ్మణుడిగా హాస్యం పండించాడు. ‘నాలుగు రోజుల నుంచి స్నానం చేయకపోవడంతో పిచ్చెక్కిపోయిందనుకో. ట్యాంకులో నీళ్లు అడుగున ఉన్నాయి. మా కుళాయికి ఎక్కడం లేదు. అందుకే ట్యాంకులో దిగి స్నానం చేస్తున్నా’ అంటూ ‘అమృతం’ సీరియల్‌లో కడుపుబ్బా నవ్వించాడు. సుమారు 400 సినిమాల్లో హాస్యనటుడిగా ఇలా నవ్వులు పంచిన గుండు హనుమంతరావు (61) ఇకలేరు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న గుండు హనుమంతరావు సోమవారం ఉదయం 3.30 గంటల సమయంలో అస్వస్థతకు గురవడంతో కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు. ఆయన్ని పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.  

నాటకాల నుంచి సినిమాలకు.. 
గుండు హనుమంతరావు 1956, అక్టోబర్‌ 10న కాంతారావు, సరోజిని దంపతులకు విజయవాడలో జన్మించారు. తండ్రి చేసిన మిఠాయి వ్యాపారం చూసుకుంటూనే నాటక రంగం మీద ఆసక్తితో 18ఏళ్లకే నాటకాల్లో నటించడం మొదలుపెట్టారు. ఆయన వేసిన మొదటి వేషం ‘రావణబ్రహ్మ’. స్టేజ్‌ షోలతో పాపులర్‌ అయిన ఆయన జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన ‘అహ నా పెళ్లంట’ చిత్రం ద్వారా సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. ‘అహ నా పెళ్లంట, మాయలోడు, రాజేంద్రుడు గజేంద్రుడు, యమలీల, టాప్‌ హీరో, కొబ్బరి బోండాం, బాబాయ్‌ హోటల్, శుభలగ్నం, క్రిమినల్, పెళ్లాం ఊరెళితే, భద్ర’ వంటి చిత్రాల ద్వారా హాస్యనటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. బుల్లితెరపై ఆయనకు బాగా పేరు తెచ్చిన సీరియల్‌ ‘అమృతం’. ఆ సీరియల్‌లో అంజి పాత్రలో ప్రతి ఇంటిలో ఆయన నవ్వుల జల్లులు కురిపించారనడం అతిశయోక్తి కాదేమో. తన నటనకు గాను ఆయన మూడు సార్లు టీవీ నంది అవార్డులు అందుకున్నారు.   గుండు హనుమంతరావు మృతి చెందారని తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు ఎస్‌.ఆర్‌. నగర్‌లోని ఆయన స్వగృహానికి తరలివచ్చి నివాళులర్పించారు. తెలంగాణ సినిమాటోగ్రఫీశాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, నటులు మురళీమోహన్, బ్రహ్మానందం, రాజేంద్రప్రసాద్, శివాజీరాజా, దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తదితరులు గుండు హనుమంతరావు భౌతికకాయానికి నివాళి అర్పించారు.  

మరిన్ని వార్తలు