నేనైతే నాగ్ కు అవార్డిస్తా! -దాసరి

14 Apr, 2016 22:43 IST|Sakshi
నేనైతే నాగ్ కు అవార్డిస్తా! -దాసరి

‘‘ ‘సోగ్గాడే చిన్నినాయనా’లో గంతులేసి , ‘ఊపిరి’లో కుర్చీలో కూర్చొని నటించారు. నేనైతే జ్యూరీలో ఉంటే ఉత్తమ నటుడు అవార్డిచ్చేస్తా’’ అని దర్శకరత్న దాసరి నారాయణరావు అన్నారు. నాగార్జున, కార్తీ, తమన్నా ముఖ్యతారలుగా వంశీపైడిపల్లి దర్శకత్వంలో ప్రసాద్ వి.పొట్లూరి, కెవిన్ అన్నే నిర్మించిన చిత్రం ‘ఊపిరి’. ఈ సినిమా థ్యాంక్స్ మీట్ హైదరాబాద్‌లో జరిగింది. ముఖ్యఅతిథిగా విచ్చేసిన దాసరి మాట్లాడుతూ-‘‘మన తెలుగు వాళ్లు హిందీ, తమిళ సినిమాలతో పోటీపడి కొత్తగా సినిమాలు తీయడం లేదని చాలా మంది అంటూంటే మా లాంటి వాళ్లకు బాధగా అనిపించేది.

కానీ ‘ఊపిరి’ చూశాక ఆ బాధ పోయింది. ‘బొమ్మరిల్లు’ తర్వాత నేను చూసిన గొప్ప సినిమా ఇది’’ అన్నారు. గీత రచయిత సీతారామశాస్త్రి మాట్లాడుతూ-‘‘పాటలు కాని పాటలు రాసే అవకాశమిచ్చిన దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు. ఎందుకంటే తెలుగు సినిమా పాటలంటే డ్యాన్స్, స్టెప్ట్స్ ఓ పద్ధతి ఉంది. వాటిని పక్కనబెట్టి ఈ సినిమా కొత్త సంవిధానాన్ని తెచ్చింది. కొత్తదనం, రసజ్ఞత, మనసుపెట్టి సినిమా చేస్తే ప్రేక్షకులు ఆదరించే రసహృదయం ఉందనడానికి ఓ ఉదాహరణ.. ‘ఇన్‌టచ్‌బుల్స్’కి ఇది రీమేకైనా, మన భాషకి, మన ప్రాంతానికీ, మన మధ్య ఉన్న వైయక్తికమైన మానవీయ అనుబంధాలకు తగ్గట్టు మలచడంలో నిజమైన కథను ఆవిష్కరించారు’’ అన్నారు. దర్శకుడు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ ‘‘‘ఊపిరి’ తర్వాత కుటుంబ సభ్యులు కొత్తగా కనిపిస్తున్నారు’’ అన్నారు. ఈ వేడుకలో తమన్నా, పి.వి.పి, కోన వెంకట్, నిర్మాతలు నాగసుశీల, ‘దిల్’ రాజు, భోగవల్లి ప్రసాద్ పాల్గొన్నారు.