యాసిడ్‌ అటాక్‌ బాధితురాలిగా బాలీవుడ్‌ హీరోయిన్‌

5 Oct, 2018 19:30 IST|Sakshi
యాసిడ్‌ బాధితురాలు లక్ష్మి అగర్వాల్‌

లక్ష్మి అగర్వాల్‌.. ఈ పేరు వినే ఉంటారు. ప్రేమను తిరస్కరించినందుకు ఓ దుర్మార్గుడు జరిపిన యాసిడ్‌ దాడిలో తీవ్రంగా గాయపడి, ఎన్నో ఆపరేషన్ల తర్వాత మామూలు స్థాయికి వచ్చిన అమ్మాయి లక్ష్మి అగర్వాల్‌. తనకు జరిగిన అన్యాయం మరే అమ్మాయికి జరగకుండా ఉండేందుకు, యాసిడ్‌ దాడి బాధితురాలకు అండగా నిలిచేందుకు ఉద్యమిస్తోంది లక్ష్మి అగర్వాల్‌. తాజాగా ఈమె బయోపిక్‌ వెండి తెరపైకి రాబోతుంది. ప్రముఖ దర్శకురాలు మేఘనా గుల్జార్‌, లక్ష్మి అగర్వాల్‌ బయోపిక్‌ను తెరకెక్కించబోతున్నారు. ఈ బయోపిక్‌లో లక్ష్మి అగర్వాల్‌గా, యాసిడ్‌ దాడి బాధితురాలిగా దీపికా పదుకొనే నటించబోతున్నారట.

 ‘పద్మావత్’ తర్వాత చాలా గ్యాప్‌ తీసుకున్న దీపికా పదుకొనే ఈ చిత్రానికి ఓకే చెప్పినట్టు తెలిసింది. దీపికా ఈ చిత్రంలో యాసిడ్‌ దాడి బాధితురాలిగా నటించడమే కాకుండా.. ఈ సినిమాకు సహ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. దీపికా కూడా ఈ ప్రాజెక్ట్‌ను ధృవీకరించింది. ‘ఈ స్టోరీ విన్నప్పుడు, ఇది కేవలం హింస మాత్రమే కాదు. బలం, ధైర్యం, ఆశ, విజయం అని లోతుగా విశ్లేషిస్తే అర్థమైంది. వ్యక్తిగతంగా, సృజనాత్మకంగా ఈ ప్రాజెక్ట్‌ నాపై చాలా ప్రభావం చూపుతుంది. ఈ ప్రాజెక్ట్‌కు ఇంకా ఏదో చేయాలనిపించి, నిర్మాతగా కూడా మారాను’ అని దీపికా అన్నారు. 

ఈ సినిమాతో లక్ష్మి అగర్వాల్‌ తన జీవితంలో ఎదుర్కొన్న సంఘటనలు, యాసిడ్‌ దాడి తర్వాత ఆమె జీవితం ఎలా మారింది. ఏ మాత్రం అధైర్యపడకుండా.. యాసిడ్‌ దాడులకు వ్యతిరేకంగా ఆమె ఉద్యమిస్తున్న తీరు.. అన్నీ వెండితెరపై మెరవనున్నాయి. ప్రేమను తిరస్కరించినందుకు 15 ఏళ్ల వయసులోనే యాసిడ్‌ దాడికి గురై, చిత్రవధకు గురయ్యారు లక్ష్మి అగర్వాల్. గత కొన్నేళ్లుగా ఆమె యాసిడ్‌ దాడులు ఆపాలంటూ ప్రచార కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు.  2014లో మెచెల్లీ ఒబామా చేతుల మీదుగా యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ నుంచి ఇంటర్నేషనల్ ఉమెన్ ఆఫ్ కరేజ్ అవార్డు సైతం అందుకున్నారు. అప్పటి నుంచి పలు టీవీ షోల్లో కూడా పాల్గొంటున్నారు. 2016 లండన్‌ ఫ్యాషన్‌ వీక్‌లో ర్యాంప్‌ వాక్‌ చేసి ప్రపంచమంతా ఆమె ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని మెచ్చుకునేలా చేసుకున్నారు. ప్రస్తుతం బిగ్‌ స్క్రీన్‌పైకి వస్తున్న లక్ష్మి అగర్వాల్‌లో దీపికా కనిపించబోతుండటంతో, చిత్ర పరిశ్రమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది.  

మరిన్ని వార్తలు