గోపిచంద్, చంద్రశేఖర్ ఏలేటిల 'సాహసం' రివ్యూ

13 Jul, 2013 01:23 IST|Sakshi
గోపిచంద్, చంద్రశేఖర్ ఏలేటిల 'సాహసం' రివ్యూ
మాఫియా లీడర్లు.. లేకపోతే ఫ్యాక్షనిస్ట్‌లు.. తెరపై మన హీరోల పోరాటం వీళ్లతోనే. హాలీవుడ్ లెవెల్లో మన హీరోలు సాహసయాత్రలు చేసి ఎన్నాళ్లయ్యిందో.. అప్పుడెప్పుడో ఎన్టీఆర్ ‘లక్ష్మీకటాక్షం’ సినిమా చేశారు. ఓ నిధి కోసం హీరో చేసే సాహస యాత్ర ఆ సినిమా. ఇప్పటికీ ఆ సినిమాను ఎంజాయ్ చేస్తాం మనం. తర్వాత ఆయనే ‘ఆలీబాబా 40 దొంగలు’ చేశారు. టీవీల్లో ఆ సినిమా వస్తే ఇప్పటికీ అతుక్కుపోతాం. ఇక మెగాస్టార్ చిరంజీవి ‘కొదమసింహం’లా చేసిన ట్రెజర్ హంట్‌ని తేలిగ్గా మరిచిపోగలమా? అలాంటి సాహసవీరులు తెలుగు తెరకు కరువయ్యారనే చెప్పాలి. 
 
 ఈ లోటును భర్తీ చేయడానికి, రొడ్డకొట్టుడు సినిమాలతో నలిగిపోతున్న ప్రేక్షకునికి కాస్తంత ఉపశమనాన్ని అందించడానికి ఎట్టకేలకు మళ్లీ ఎన్నాళ్లకో తెరపైకి ఓ సాహసవీరుడొచ్చాడు. ఐతే, అనుకోకుండా ఒకరోజు, ఒక్కడున్నాడు, ప్రయాణం.. చిత్రాలతో కొత్తగా ఆలోచించే దర్శకునిగా పేరుగాంచిన చంద్రశేఖర్ ఏలేటి ఈ సాహసవీరుడిని తెరపైకి తెచ్చే సాహసం చేశారు. మరి ఆయన సాహసం ఎంతవరకూ సఫలం అయ్యిందో తెలుసుకోవాలంటే ముందు కథలోకెళదాం. 
 
 గౌతమ్‌వర్మ ఓ సెక్యూరిటీ గార్డ్. భూమ్మీద పడ్డనుంచీ పేదరికంతోనే అతని సావాసం. ఎప్పటికైనా కోటీశ్వరుడు కావడం అతని యాంబిషన్. అయితే అది నీతిగానే. తనది కానిది కోటి రూపాయలైనా తను ముట్టుకోడు. తనదైన అర్ధరూపాయి కూడా అతను వదలడు. కాలం ఎంత ప్రతికూల ఫలితాలనిస్తున్నా తను మాత్రం గుండె నిబ్బరం వదలడు. అలాంటి తనకు ఓ సందర్భంలో తన తాతలనాటి నిధికి సంబంధించిన విషయం తెలుస్తుంది. ఆ నిధి కోసం హీరో చేసే సాహస యాత్రే ఈ సినిమా. ‘అందరూ వెళ్లే దారిలో వెళ్లి తేలిగ్గా హిట్ కొట్టేద్దాం’ అని అనుకోకుండా... ఓ కొత్త జానర్‌ని ఎంచుకొని అసలు సిసలైన  సాహసం చేశారు దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి. 80ల్లో మెరుపుదాడి, 90ల్లో కొదమసింహం, 2002లో టక్కరి దొంగ ఈ నేపథ్యంలో వచ్చిన సినిమాలు. 
 
 అయితే ఈ మూడూ కౌబాయ్ చిత్రాలు కావడం విశేషం. కానీ కౌబాయ్ నేపథ్యాన్ని తీసుకోకుండా ప్రస్తుతం నేపథ్యంతోనే ట్రెజర్ హంట్ మూవీని తీసి భళా అనిపించుకున్నాడు ఏలేటి. కొంతకాలంగా ఎవరూ టచ్ చేయని ఈ పాయింట్‌ని తీసుకొని, అక్కడక్కడా తడబడ్డా ఎలా గోలా టార్గెట్ చేరుకున్నారు. ప్రథమార్ధం వరకూ సో.. సో..గా సాగిన ఈ సినిమా, ద్వితీయార్ధం మాత్రం ఉత్కంఠను రేకెత్తించింది. కథలో ఎక్కడా టెంపో మిస్ కాకుండా జాగ్రత్త పడ్డాడు ఏలేటి. దీన్ని దృష్టిలో పెట్టుకొని పాటలకు, రొమాంటిక్ సన్నివేశాలకు కూడా ఆయన ప్రాధాన్యత ఇవ్వలేదు. అక్కడడక్కడ నేరేషన్ స్లో అయినా.. క్లైమాక్స్ మాత్రం అదరహో అనిపించాడు. ఎన్టీఆర్, విఠలాచార్య కాంబినేషన్‌లో వచ్చిన జానపదాలను గుర్తు చేసింది ఈ సినిమా క్లైమాక్స్. 
 
 అయితే సినిమాలోని కొన్ని సన్నివేశాలు మాత్రం కన్వెన్సింగ్‌గా లేవు. నిధి అన్వేషణలో హీరో ఏది అనుకుంటే అది జరిగిపోతుంటుంది. ఆఖరుకి పోరాట సన్నివేశాల్లో కూడా రొటీన్ ఫార్ములానే ఫాలో అయ్యాడు దర్శకుడు. అంత పెద్ద నిధి పాకిస్తాన్‌లో ఉంటే అక్కడి ప్రభుత్వం ఏం చేస్తుందో అర్థం కాదు. ఇందులో హీరో తాత వజ్రాల వ్యాపారి అని కథ చెబుతుంది. కానీ హీరో తండ్రి మాత్రం ‘మా నాన్న డొక్కు సైకిల్ ఎక్కి తిరిగేవాడ’ని ఎందుకు చెప్పాడో అర్థంకాదు. అలీ పాత్రను అర్ధాంతరంగా ముగించారేమో అనిపిస్తుంది. ఆయన పాత్ర ఇంకాస్త ఉంటే బావుణ్ణు అనిపించింది. సినిమా ఆద్యంతం గొప్పగా తీసినా ఏదో తెలియని వెలితి. 
 
 ఇక నటీనటుల విషయానికొస్తే గౌతమ్ పాత్రలో గోపీచంద్ ఒదిగిపోయాడు. యాక్షన్, ఎమోషనల్ సన్నివేశాలను అద్భుతంగా రక్తికట్టించాడు. తాప్సీ ఉన్నంతలో బాగానే చేసింది. శక్తికపూర్ ఇందులో ప్రధాన విలన్‌గా తన సహజసిద్ధమైన నటనతో అలరించారు. సాంకేతికంగా సినిమా సూపర్బ్. శ్యామ్‌దత్ కెమెరా పనితనం అద్భుతంగా ఉంది. శ్రీ నేపథ్య సంగీతం ఓకే. తప్పు ఒప్పులను తీసి పక్కన పడితే... ‘సాహసం’ మాత్రం  ఓ మంచి ప్రయత్నం. మూస కథలను చూసి విసిగిపోయిన ప్రేక్షకునికి ఈ సినిమా ఓ రిలీఫ్ అని చెప్పక తప్పదు.
 
Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి