అడ్వాన్స్‌ చెల్లించకుంటే ఆస్తులు జప్తు

11 Oct, 2018 10:58 IST|Sakshi

సాక్షి, చెన్నై: తీసుకున్న అడ్వాన్స్‌ను వడ్డీ సహా తిరిగి చెల్లించకుంటే ఆస్తులను జప్తు చేయనున్నట్లు నటుడు శింబును మద్రాసు హైకోర్టు మరోసారి హెచ్చరించింది. వివరాల్లోకెళితే.. సంచలన నటుడు శింబు చాలా కాలం తరువాత మణిరత్నం చిత్రం సెక్క సివంద వారం చిత్రంతో సక్సెస్‌ను అందుకున్నారు. ప్రస్తుతం ఈయన సుందర్‌.సీ దర్శకత్వంలో తెలుగు చిత్రం అత్తారింటికి దారేది రీమేక్‌లో నటిస్తున్నారు.

ఈయన 2013లో అరసన్‌ అనే చిత్రంలో నటించడానికి ష్యాషన్‌ మూవీ మేకర్స్‌ చిత్ర నిర్మాత నుంచి రూ.50 లక్షలు అడ్వాన్స్‌ కూడా తీసుకున్నారట. అయితే ఆ చిత్రానికి ఇంత వరకూ కాల్‌షీట్స్‌ కేటాయించకపోవడంతో ఆ నిర్మాతలు మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును గత నెలలో విచారించిన న్యాయస్థానం నటుడు శింబు ఫ్యాషన్‌ మూవీ మేకర్స్‌ సంస్థ నుంచి తీసుకున్న అడ్వాన్స్‌ను వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని, ఆ మొత్తాన్ని ఎప్పుడు చెల్లించేది తెలియజేయడానికి నాలుగువారాలు గడువు ఇస్తున్నట్లు పేర్కొంటూ, ఆ గడువు లోగా తెలియజేయకుంటే నటుడు శింబుకు చెందిన కారు, ఫోన్‌ వంటి వస్తువులను జప్తు చేయనున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.

అయితే న్యాయస్ధానం హెచ్చరికలకు శింబు తరఫు నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. ఈ కేసు బుధవారం మరోసారి విచారణకు వచ్చింది. విచారణ అనంతరం న్యాయమూర్తి నటుడు శింబు అరసన్‌ చిత్ర నిర్మాతల నుంచి తీసుకున్న అడ్వాన్స్‌ను వడ్డీ సహా రూ. 85 లక్షలు తిరిగి చెల్లించాల్సిందేనని ఆ మొత్తాన్ని ఎప్పుడు చెల్లించేది ఈ నెల 31లోగా వెల్లడించాలని ఆదేశించారు. లేని పక్షంలో నటుడు శింబు ఆస్తులను జప్తు చేయనున్నట్లు హెచ్చరించారు. గత ఉత్తర్వుల్లో శింబుకు సంబంధించిన వస్తువులను జప్తు చేస్తామని హెచ్చరించిన న్యాయస్థానం, తాజాగా ఆయన ఆస్తులను జప్తు చేయనున్నట్లు హెచ్చరించడం గమనార్హం.

మరిన్ని వార్తలు