సమ్మర్... దీపావళి... హాలీవుడ్ రిలీజ్

28 Apr, 2016 23:22 IST|Sakshi

 ఒకప్పుడు హాలీవుడ్ సినిమాలు ఇండియాలో ఇప్పటిలా డబ్బులు తెచ్చేవి కావు. కానీ, ఇప్పుడు పాశ్చాత్య సినిమాకు ఇండియాలో ప్రేక్షకులు పెరిగారు. పెరుగుతున్న మధ్యతరగతి వర్గం, ఇంగ్లీష్ మీడియమ్ చదువులు, మల్టీప్లెక్స్‌లు, ఇంటర్నెట్ సౌకర్యం కూడా హాలీవుడ్ చిత్రాల పట్ల ఆసక్తి పెరగడానికి కారణాలు. అలాగే ప్రాంతీయ భాషల్లో ఈ ఇంగ్లీష్ సినిమాల అనువాదాల విడుదల వల్ల కూడా మార్కెట్ సమూలంగా మారిపోయింది.
 
 2014లో భారత్‌లో ‘టాప్ 10 హాలీవుడ్ రిలీజ్‌లు’ 6.47 కోట్ల డాలర్లు (సుమారు రూ. 430 కోట్లు)వసూలు చేస్తే, గత ఏడాది ఆ వసూళ్ళు దాదాపు 9.8 కోట్ల డాలర్లకు (రూ. 651 కోట్లు) పెరిగాయి. అంటే, మునుపటి వసూళ్ళ కన్నా దాదాపు 34 శాతం ఎక్కువ. ఇది ఇంతకు మునుపెన్నడూ లేనంత అత్యధిక పెరుగుదల. ప్రపంచం మొత్తం మీద చూస్తే, హాలీవుడ్ సినిమాల భారతీయ మార్కెట్ వాటా 6 శాతం నుంచి 8-9 శాతానికి పెరిగిందని కన్సల్టింగ్ సంస్థ ‘కె.పి.ఎం.జి. ఇండియా’ తేల్చింది.
 
 ఇండియాలో ఇలా తమ సినిమాల మార్కెట్ పెరగడంతో హాలీవుడ్ స్టూడియోల చూపంతా ఇప్పుడు ఇటు వైపు పడింది. ఇలా భారత్‌లో ఆదరణ రోజురోజుకూ పెరుగుతుండడంతో, హాలీవుడ్ సంస్థలు తమ రిలీజ్ వ్యూహాన్ని మార్చుకుంటున్నాయి. ప్రపంచవ్యాప్త విడుదల కోసం పెట్టుకున్న తేదీ కన్నా ముందుగానే భారతీయుల స్థానిక పరిస్థితులకు తగ్గట్లుగా తమ సినిమాను ఇండియాలో రిలీజ్ చేసేస్తున్నాయి.