ఇదే అదను.. చైనా నుంచి తరలిపోయే కంపెనీలు భారత్‌కే..!

11 Dec, 2023 09:13 IST|Sakshi

న్యూఢిల్లీ: రానున్న రెండు మూడేళ్లలో చైనా నుంచి తరలిపోయే కంపెనీలను భారత్‌ ఆకట్టుకుంటుందని నీతి ఆయోగ్‌ సీఈవో సుబ్రహ్మణ్యం తాజాగా పేర్కొన్నారు. ఈ కాలంలో రిస్కులను తగ్గించుకునే బాటలో చైనాను వీడుతున్న ప్రపంచ కంపెనీల వ్యూహాలను భారత్‌ అందిపుచ్చుకోవలసి ఉన్నట్లు తెలియజేశారు. ఇందుకు ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా వ్యవహరించవలసి ఉంటుందన్నారు.

బిజినెస్‌లు తరలివచ్చేందుకు ఆకట్టుకునే విధానాల రూపకల్పనకు తెరతీయవలసి ఉన్నదని అభిప్రాయపడ్డారు. పరిశ్రమలు సులభంగా తరలివచ్చేందుకు చర్యలు చేపట్టవలసి ఉన్నట్లు తెలియజేశారు. సీఐఐ నిర్వహించిన 2023 ప్రపంచ ఆర్థిక విధాన వేదికలో సుబ్రహ్మణ్యన్‌ ఇంకా పలు అంశాలను ప్రస్తావించారు. రాజకీయ, భౌగోళిక పరిస్థితులు, భారీ యువశక్తి భారత్‌ను ఆకర్షణీయంగా నిలుపుతున్నట్లు పేర్కొన్నారు. వెరసి రానున్న 15–20 ఏళ్ల కాలంలో తయారీలో భారత్‌కు అవకాశాలు వెల్తువెత్తనున్నట్లు అంచనా వేశారు.

అయితే రానున్న రెండు మూడేళ్ల కాలం ఇందుకు అత్యంత అనువైనదని అభిప్రాయపడ్డారు. సప్లై చైన్‌ వ్యవస్థలు మూతపడుతుండటం, కొత్త ప్రాంతాల కోసం చూస్తుండటం తదితర అంశాలు ఇందుకు కారణమని వివరించారు. ఇది చైనాయేతర కంపెనీలకే పరిమితంకాదని, కార్మిక కొరతతో చైనా కంపెనీలు సైతం తరలివెళ్లే ప్రణాళికల్లో ఉన్నట్లు వెల్లడించారు.

>
మరిన్ని వార్తలు