దాసరి మృతిపట్ల చిరంజీవి దిగ్భ్రాంతి

30 May, 2017 21:53 IST|Sakshi
(ఫైల్) ఫోటో

హైదరాబాద్‌: దర్శక రత్న దాసరి నారాయణ రావు చనిపోవడంపట్ల ప్రముఖ నటుడు మెగాస్టార్‌ చిరంజీవి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన అకాల మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని అన్నారు. ప్రస్తుతం చైనాలో ఉన్న ఆయన సంతాప సందేశాన్ని, దాసరితో తనకున్న అనుభవాన్ని పంచుకున్నారు. ‘దర్శకరత్న దాసరిగారి అకాల మరణం వార్తను నేను జీర్ణించుకోలేకపోతున్నాను. ఇటీవలే ఆయన అనారోగ్యం కారణంగా అల్లు రామలింగయ్యగారి అవార్డును స్వయంగా ఆయన ఇంటికి వెళ్ళి నా చేతుల మీదుగా అందజేశాను. ఆ సమయంలో ఆయనతో చాలా సేపు మాట్లాడాను. చాలా ఆరోగ్యంగా నాతో మాట్లాడారు. ప్రస్తుతం నేను చైనాలో ఉన్నాను. ఇంతలో ఇలాంటి చేదు వార్తను వినాల్సి వచ్చింది. ఆయన మరణం యావత్తు చిత్ర పరిశ్రమకు తీరనిలోటు.

దర్శక నిర్మాతగా తెలుగు సినీ పరిశ్రమకు ఆయన అందించిన సేవ అనీర్వచనీయం. ఇప్పటి వరకూ తెలుగు సినిమాకు పెద్ద దిక్కులా ఉన్న ఆయన ఇప్పుడు మన మధ్య లేకపోవడం భాదాకరం. భౌతికంగా ఆయన మన మధ్యన లేకపోయినా ఆయన సేవను ఎప్పుడూ స్మరించుకుంటూనే ఉంటాను’  అని చిరంజీవి అన్నారు. అలాగే, దాసరితో తాను పనిచేసిన రోజులు అత్యుత్తమమైనవని ప్రముఖ నటుడు కమల్‌హాసన్‌ అన్నారు. కే బాలచందర్‌కు దాసరి గొప్ప అభిమాని అని చెప్పారు. అంతటి సినీ కుటుంబంతో తనకు సాన్నిహిత్యం దొరకడం తన అదృష్టం అని చెప్పారు.