వాళ్లకో న్యాయం...మాకో న్యాయమా..?

11 May, 2015 23:07 IST|Sakshi
వాళ్లకో న్యాయం...మాకో న్యాయమా..?

  - జెన్నిఫర్ లారెన్స్
 
 ‘‘ఏం మాకేం తక్కువ? మేమూ మనుషులమే కదా. మగవాళ్లకో న్యాయం ఆడవాళ్లకో న్యాయమా?’’ అని హాలీవుడ్ హాట్‌గాళ్ జెన్నిఫర్ లారెన్స్ విరుచుకుపడుతున్నారు. ఈవిడగారి ఆగ్రహానికి కారణం కథానాయకులు తీసుకుంటున్న పారితోషికం. వాళ్లతో పోల్చితే కథానాయికలకు తక్కువ ఇస్తున్నారని జెన్నిఫర్ వాపోతున్నారు. ఈ విషయాన్ని మరో తార అమీ ఆడమ్స్‌తో చెప్పుకుని వాపోయారు. అమీకి కూడా సేమ్ ఫీలింగ్ ఉంది. దాంతో ఇద్దరూ ఈ మెయిల్స్ ద్వారా సోనీ సంస్థ ప్రతినిధులపై కారాలు మిరియాలూ నూరారు. సోనీ సంస్థ ఈ మెయిల్‌ని ఎవరో హ్యాక్ చేయడంతో ఈ తతంగం మొత్తం బయటవాళ్లకు తెలిసిపోయింది. ఇంతకీ ఈ ముద్దుగుమ్మలు సోనీ సంస్థపై ఎందుకు విరుచుకుపడ్డారో తెలుసా? ఆ సంస్థ నిర్మించిన ‘అమెరికన్ హసల్’ చిత్రంలో నటించినందుకు జెన్నిఫర్‌కి 7 శాతం ఇచ్చారట. అమీకి కూడా దాదాపు అంతే ఇచ్చారని వినికిడి.
 
 కానీ, ఇందులో నటించిన సహనటులకు ఏకంగా 9 శాతం వాటాను ముట్టజెప్పారని సమాచారం. ఈ విషయంలోనే కథానాయికలిద్దరూ ఫీలైపోయారు. జెన్నిఫర్ అయితే దీన్నో ఉద్యమంలా తీసుకున్నారట. నటులకు దీటుగా నటీమణులకు కూడా పారితోషికం ఇవ్వాలని డిమాండ్ చేశారట. మొత్తానికి సాధించారామె. ప్రస్తుతం నటిస్తున్న ‘వాటర్ టైట్’ చిత్రానికిగాను ఆ చిత్ర నిర్మాతలు జెన్నిఫర్‌కి 20 మిలియన్ డాలర్లు (సుమారు 124 కోట్లు) చెల్లించడానికి సిద్ధపడ్డారట. అలాగే, ‘పాసింజర్స్’ అనే చిత్రం కోసం ఆమె తన తోటి నటుడు క్రిస్ పాట్ కన్నా రెండింతలు ఎక్కువ తీసుకుంటున్నారట. దీంతో లియోనార్డో డికాప్రియో, బ్రాడ్లీ కూపర్ వంటి అత్యధిక పారితోషికం తీసుకునే తారల జాబితాలో జెన్నిఫర్ లారెన్స్ కూడా చేరిపోయారు.