నటిస్తూ..నవ్విస్తా!

3 Feb, 2020 12:28 IST|Sakshi
బ్రహ్మానందానికి స్వర్ణ కంకణం తొడుగుతున్న వైఎస్సార్‌సీపీ నేత దాడి వీరభద్రరావు

ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం

అట్టహాసంగా జీవన సాఫల్యపురస్కార ప్రదానం

పెదవాల్తేరు (విశాఖ తూర్పు): తనను ఎంతగానో ఆదరించి సత్కరించిన విశాఖపట్నం ప్రజలకు పాదాభివందనం చేస్తున్నాను... తాను ఆంధ్రా యూనివర్సిటీలోనే మొదటి నాటకం వేశాను... నేను నమ్మిన వెంకటేశ్వరస్వామి విశాఖవాసులతో ఈ సత్కారం చేయించినట్టు ఉంది... ఇదీ సిరిపురం వీఎంఆర్‌డీఏ గురజాడ కళాక్షేత్రంలో రైటర్స్‌ అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి పౌరసత్కారం అందుకున్న ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం స్పందన. తనకు జరిగిన సత్కారం అనంతరం ఆయన మాట్లాడుతూ, బీచ్‌రోడ్డులో ఊరేగింపు సమయంలో ప్రజల చిరునవ్వు చూస్తే తనకెంతో ఆనందం కలిగిందన్నారు. నేను నటిస్తూ మిమ్మల్ని నవ్విస్తూ నా జీవితం కొనసాగాలని కోరుకుంటున్నానని తెలిపారు. రైటర్స్‌ అకాడమీ చైర్మన్, సీనియర్‌ పాత్రికేయుడు వీవీ రమణమూర్తి స్వాగతోపన్యాసం పలుకుతూ  సినిమా  రంగంలో ఎవరి సపోర్ట్‌ లేకుండా బ్రహ్మానందం తన నటననే ప్రతిభగా తీర్చిదిద్దుకుని 35 వసంతాల సినీ ప్రస్థానంలో 1154 చిత్రాల్లో నటించారని గుర్తు చేశారు. సినీ కళారంగానికి ఆయన అందించిన సేవలను గుర్తిస్తూ పౌరసత్కారం చేస్తున్నామన్నారు.  

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు మాట్లాడుతూ సాంస్కతిక, సాహిత్య, సేవా రంగాల్లో విశేషంగా కృషి చేస్తున్న ఎంతో మంది ప్రముఖులను రైటర్స్‌ అకాడమీ జీవన సాఫల్య పురస్కారాలతో సత్కరించడం అభినందనీయమన్నారు. తెలుగువారి గొప్పదనాన్ని చాటిచెప్పిన సినీ హాస్య నటుడు, వక్త, సాహితీవేత్త, రచయిత కన్నెగంటి బ్రహ్మానందం సత్కార కార్యక్రమంలో ఎందరో ప్రముఖులు సైతం భాగస్వాములు కావడం ఆనందదాయకంగా ఉందన్నారు. మంచి సంగీతం, హాస్యం జీవితంలో ఒత్తిడిని తగ్గించి ఆరోగ్యాన్ని పెంచుతాయని పేర్కొన్నారు. అటువంటి హాస్యాన్ని అందరికి పంచి పెట్టే విధంగా బ్రహ్మానందం కృషి మరువలేనదన్నారు. చరిత్రలో కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు, భమిడిపాటి రాధాకృష్ణ, ఆదివిష్ణు తరం తర్వాత కూడా హాస్యానికి ప్రాముఖ్యత పెరిగిందన్నారు. మైసూరులోని గణపతి ఆశ్రమంలో మ్యూజిక్‌ థెరపీ ద్వారా పలు రోగాలను తగ్గిస్తున్నారని, హాస్యానికి అంత ప్రాధాన్యం ఉందన్నారు.

ఆ సంస్థలో ఒక్క రోజైనా తమ కార్యక్రమం నిర్వహించాలని ఎంతో మంది కళాకారులు కలలు కంటారని పేర్కొన్నారు. క్యాన్సర్‌ వంటి దీర్ఘకాలిక రోగాలకు అక్కడ హాస్యథెరపీ ద్వారా చికిత్స అందిస్తున్న విషయాన్ని స్వయంగా చూశానన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో హాస్య నటుడు రేలంగి, అల్లు రామలింగయ్యల తరువాత అంతటి ఖ్యాతి గడించిన బ్రహ్మానందం 1154 చిత్రాల్లో నటించి గిన్నిస్‌ బుక్‌ రికార్డు నెలకొల్పారని వివరించారు. రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌ టి.సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ సినిమా రంగంలో హాస్యనటుడు బ్రహ్మానందం తనకంటూ ఒక ప్రత్యేకత సృష్టించుకున్నారన్నారు.     ఆంధ్రాయూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ ప్రసాదరెడ్డి మాట్లాడుతూ విశాఖలో సినిమా పరిశ్రమ అభివృద్ధికి అందరూ కృషి చేయాలని కోరారు. విశాఖలో ఎన్నెన్నో అందమైన లొకేషన్లు ఉన్నాయని తెలిపారు. హాస్యనటుడు బ్రహ్మానందం విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి ముందుకొస్తే ఏయూలో ఓ భవనం సిద్ధం చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ,  వీఎంఆర్‌డీఏ చైర్మన్‌ ద్రోణంరాజు శ్రీనివాసరావు, జీవీఎంసీ కమిషనర్‌ డాక్టర్‌ జి.సృజన, జాయింట్‌ కలెక్టర్‌ శివశంకర్‌ తదితరులుపాల్గొన్నారు.

తెలుగు ప్రముఖులు రాసిన వ్యాసాల సంపుటిని ఆవిష్కరిస్తున్న ప్రముఖులు
ఘనంగా పౌర సత్కారం...
ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందానికి ఘనంగా పౌరసత్కారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రముఖులు, అతిథుల చేతులమీదుగా రైటర్స్‌ అకాడమీ తరఫున జీవిత సాఫల్య పురస్కారం అందజేశారు. వెండికిరీటం, బంగారు పుష్పాలతో సత్కరించారు. ఈ సందర్భంగా 35 మంది తెలుగు ప్రముఖులు రాసిన వ్యాసాల సంపుటిని విడుదల చేశారు.

సాగర తీరంలోప్రత్యేకంగా అలంకరించినగుర్రపుబగ్గిపై అభివాదంచేస్తున్న హాస్యనటుడు బ్రహ్మానందం
అట్టహాసంగా ఊరేగింపు...
అంతకుముందు ఆర్కేబీచ్‌రోడ్డులోని నేవీ స్మారక స్థూపం నుంచి గురజాడ కళాక్షేత్రం వరకూ ‘బ్రహ్మరథం’ పేరిట ఉత్తరాంధ్ర సాంస్కృతిక కళారూపాలతో ఊరేగింపు నిర్వహించారు.
ఈ ఊరేగింపులో ఉత్తరాంధ్రకు చెందిన తప్పెటగుళ్లు, కోలాటం, పులివేషాలు, డప్పు విన్యాసాలు, చెక్కభజన, బొమ్మల డ్యాన్సులు, మత్స్యకార నృత్యాలు మొదలైన కార్యక్రమాలు హైలెట్‌గా నిలిచాయి. దారి పొడుగునా బ్రహ్మానందం ప్రజలకు అభివాదం చేశారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు