ఎన్నికలలో... ఎన్ని కలలో!

11 Mar, 2014 22:53 IST|Sakshi
ఎన్నికలలో... ఎన్ని కలలో!

ువేసవి వచ్చేస్తోంది. ‘వేసవి’ అంటే సినిమా టైటిల్ కాదు. సినిమా వాళ్లకు అతి పెద్ద సీజన్ ఇది. స్టార్ హీరోలతో పాటు చిన్నా పెద్దా అంతా ఈ సీజన్‌లో తమ సినిమాలు విడుదల చేసి బాక్సాఫీస్‌ని కొల్లగొడదామని ప్రయత్నిస్తుంటారు. ఇది ప్రతి ఏటా జరిగేదే. అయితే... ఈ సమ్మర్ సీజన్ మాత్రం తెలుగు సినిమాకు చాలా కీలకం కాబోతోంది. ఎందుకంటే.. 2014 ఎంటరై ఇప్పటికి 71 రోజులైంది. బాక్సాఫీస్ దాహార్తిని తీర్చే సరైన బ్లాక్‌బస్టర్ రాలేదు. సంక్రాంతి సీజన్ కూడా మునుపటి స్థాయిలో పెద్ద ఊపు తేలేదు.
 
  అందుకే అందరూ ఆశలన్నీ సమ్మర్ సీజన్‌పైనే పెట్టుకున్నారు.     ఈ సమ్మర్‌లో వచ్చే సినిమాల ఫలితాలు ఈ ఏడాది మొత్తం మీద ప్రభావం చూపిస్తాయనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అయితే పరిస్థితులు చాలా క్లిష్టంగా ఉన్నాయి. ఓ వైపు టెన్త్, ఇంటర్ పరీక్షలు మొదలవుతున్నాయి. మరో వైపు క్రికెట్ హంగామా. ఈ నెల 16 నుంచి టి-20 వరల్డ్ కప్ మొదలవుతోంది. ఈ హడావిడి సద్దుమణిగేలోపే ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌ల రూపంలో ఏప్రిల్‌లో మరో హంగామా. ఇది నెల పై చిలుకే సాగుతుంది. అసలు ఈ రెండూ కాకుండా అసలైన పెద్ద ఉపద్రవం ఏంటంటే... ఎలక్షన్ హడావిడి. ఈ రెండు నెలలూ రాష్ట్రమంతటా ఎన్నికలే ఎన్నికలు. తొలుత మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు. వీటి పుణ్యమా అని పల్లెటూళ్లు బిజీ బిజీ.
 ఆ వెంటనే... ‘మునిసిపల్ ఎలక్షన్స్’. ఇక మునిసిపాలిటీల కోలాహలం అలాఇలా ఉండదు. చివరాఖరుగా అసెంబ్లీ, పార్లమెంట్ ఎలక్షన్స్. వీటి గురించి సరేసరి. ఇవన్నీ అయ్యాక... ఇక కౌంటింగ్. సినిమాలను మించిన ఉత్కంఠ. ఇక థియేటర్లకు జనాలు ఎప్పుడొచ్చేట్లు? ఈ ఉపద్రవాలన్నింటినీ తెలుగు సినిమా ఎలా తట్టుకునేట్లు? ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి. బాలకృష్ణ, మోహన్‌బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, నాగచైతన్య వంటి స్టార్ హీరోలు ఈ సమ్మర్‌లోనే అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
 
 సమ్మర్ హడావిడికి ‘లెజెండ్’తో శ్రీకారం చుట్టనున్నారు బాలకృష్ణ. ‘సింహా’ తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఈ చిత్రంపై అంచనాలు అమితంగా ఉన్నాయి. ఈ నెల 28న ఈ చిత్రం విడుదల కానుంది.
 ఇక ‘లెజెండ్’తో పాటే రాబోతున్న మరో స్టార్ హీరో సినిమా ‘రౌడీ’. మోహన్‌బాబు, రామ్‌గోపాల్‌వర్మ తొలిసారి కలిసి పనిచేసిన సినిమా ఇది. ఇటీవల విడుదల చేసిన ‘రౌడీ’ ఫస్ట్ లుక్‌కి విపరీతమైన అప్లాజ్ వచ్చింది. ఈ సినిమాపై అంచనాలు కూడా ఆకాశమంత ఎత్తులో ఉన్నాయి.
 
 అల్లు అర్జున్ ‘రేసుగుర్రం’ కూడా ఈ సమ్మర్‌లోనే దుమ్మురేపనుంది. ఏప్రిల్ ప్రథమార్ధంలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాతలు నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి) కె.వెంకటేశ్వరరావు సన్నాహాలు చేస్తున్నారు. సురేందర్‌రెడ్డి హాలీవుడ్ సినిమాలను తలపించేలా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారట.
 
 విజయవాడ నేపథ్యంలో, నాగచైతన్య హీరోగా దేవ కట్టా తెరకెక్కించిన ‘ఆటోనగర్ సూర్య’ సమ్మర్‌లో విడుదల కావడం ఖాయం అని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. అక్కినేని కుటుంబ చిత్రం ‘మనం’ కూడా తెరపైకొచ్చేది సమ్మర్‌లోనే. స్వర్గీయ మహానటుడు అక్కినేని నటించిన చివరి సినిమా ఇదే కావడంతో... అన్ని వర్గాలవారూ, అన్నీ వయసులవారూ ఆ సినిమాకోసం ఎదురుచూస్తున్నారు. ‘ఇష్క్’ఫేం విక్రమ్‌కుమార్ ఫీల్‌గుడ్ మూవీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు సమాచారం.
 
 సమ్మర్‌లో రాబోతున్న మరో ప్రతిష్ఠాత్మక చిత్రం ‘రభస’. ‘ఆది’ తర్వాత ఎన్టీఆర్ హీరోగా బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న చిత్రం ఇది. ‘కందిరీగ’ ఫేం సంతోష్ శ్రీనివాస్ దర్శకుడు. ఎన్టీఆర్ ఇమేజ్‌కి తగ్గట్టు పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ఉండబోతోందని సమాచారం.
 ఇక స్ట్రయిట్ చిత్రాలకు సవాల్ విసురుతూ... సూపర్‌స్టార్ రజనీకాంత్ రూపం ‘విక్రమసింహ’గా ఈ సమ్మర్‌లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. హాలీవుడ్ ‘అవతార్’ చిత్రాన్ని తెరకెక్కిన త్రీడీ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో రూపొందిన ఈ చిత్రంలో రజనీ వీరుడుగా కనిపించబోతున్నారు. ఆయనకు జోడీ దీపికా పదుకొనే. ఏఆర్ రెహమాన్ సంగీతం. రజనీ తనయ ఐశ్వర్య దర్శకురాలు. ఏప్రిల్‌లో సినిమా ఉంటుందని వినికిడి.
 
 ఈ సినిమాలు కాక, నాని ‘జెండాపై కపిరాజు’, శేఖర్‌కమ్ముల ‘అనామిక’, మారుతీ ‘కొత్తజంట’, అల్లరి నరేష్ ‘జంప్ జిలాని’, ప్రకాశ్‌రాజ్ ‘ఉలవచారు బిర్యాని’, సాయి ధరమ్‌తేజ్ తొలి సినిమా ‘రేయ్’, మలి సినిమా ‘పిల్లా నువ్వులేని జీవితం’, ఎమ్మెస్ రాజు ‘జపం’తో పాటు మరికొన్ని చిత్రాలు కూడా సమ్మర్ బరిలో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి.