ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌పై పోలీసులకు‌ ఫిర్యాదు 

3 Jun, 2020 13:15 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టాలీవుడ్‌ యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ అభిమానులపై హీరోయిన్‌ మీరా చోప్రా సిటీ పోలీసులతో పాటు సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొందరు అసభ్య పదజాలంతో దూషిస్తుండటంతో పాటు మరికొందరు బెదిరింపులకు పాల్పడుతున్నారని, తనను దూషించిన వారందరూ ఎన్టీఆర్‌ అభిమానులు కావడం దురదృష్టకరమని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా కొందరు పచ్చిగా తిడుతూ చేసిన ట్వీట్లను స్క్రీన్‌ షాట్‌ తీసి పోలీసులకు పంపించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. మీరా చోప్రా ఫిర్యాదుతో అసభ్య ట్వీట్లను పోలీసులు తొలగించారు. (హీరోయిన్‌కు ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ వేధింపులు!)

ఇంతకీ ఏం జరిగిందంటే..
సోషల్‌ మీడియాలో చాలా ఆక్టీవ్‌గా ఉండే మీరా చోప్రా ఇటీవల ట్విటర్‌ వేదికగా అభిమానులతో ముచ్చటించారు. ఈ క్రమంలో ఓ నెటిజన్‌ ఎన్టీఆర్‌ గురించి ఏమైనా చెప్పండి అని కోరారు. అయితే ఆయన ఎవరో తనకు తెలియదని చెప్పడంతో మీరా చోప్రాపై ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తూ అసభ్యకర ట్వీట్లు చేశారు. అంతేకాకుండా సోషల్‌ మీడియా వేదికగా బెదిరింపులకు దిగారు. దీంతో అసహనానికి లోనైన ఈ నటి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, ఆమెకు సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున మద్దతు వస్తోంది. సింగర్‌ చిన్మయి శ్రీపాద మీరా చోప్రాకు అండగా నిలిచారు. (నటుడి తమ్ముడిపై లైంగిక వేధింపుల కేసు)

అంతకుముందు ఎన్టీఆర్‌కు మీరా ట్వీట్‌ చేస్తూ దీనిపై స్పందించాలని కోరారు. ‘తారక్...  నీ అభిమానులు నన్ను వేశ్య, పోర్న్‌ స్టార్‌​ వంటి పదాలతో పిలుస్తారని అనుకోలేదు. కేవలం నీ కంటే మహేశ్ బాబునే ఎక్కువగా ఇష్టపడతానని నేను చెప్పడంతో ఇది జరిగింది. నీ అభిమానులు నా తల్లిదండ్రులకు కూడా ఇలాంటి అసభ్యకరమైన సందేశాలు పంపుతున్నారు. ఇటువంటి అభిమానులతో మీరు సక్సెస్ సాధించినట్టు భావిస్తున్నారా?. మీరు తప్పకుండా నా ట్వీట్ పట్ల స్పందిస్తారని ఆశిస్తున్నాను’ అని మీరా పేర్కొన్నారు. కాగా, తెలుగులో బంగారం, వాన, మారో, గ్రీకువీరుడు వంటి చిత్రాల్లో మీరా చోప్రా నటించిన విషయం తెలిసిందే. (65 ఏళ్ల వారికి షూటింగ్‌కి అనుమతి లేదు!)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా