చర్చలు విఫలం.. మార్చి 2 నుంచి థియేటర్ల బంద్‌

23 Feb, 2018 18:00 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్ : మార్చి 2 నుంచి థియేట‌ర్లు నిర‌వ‌ధికంగా బంద్ నిర్వ‌హించాల‌ని తెలుగు చల‌న చిత్ర నిర్మాత‌ల మండలితోపాటు దక్షిణాది నిర్మాతల సంఘం తీర్మానించింది. సినిమా డిజిటల్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు క్యూబ్‌, యూఎఫ్‌ఓ సంస్థలకు, నిర్మాత సంఘాలకు జరిగిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో వచ్చే నెల 2నుంచి  సినిమాలను ఆ సర్వీస్‌లకు ఇవ్వకూడదని నిర్మాతల ఐకాస నిర్ణయం తీసుకుంది. ఈకారణంగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలతో పాటు తమిళనాడు, కేరళ, కర్ణాటకల్లో వేలాది సినిమా ధియేటర్లు బంద్‌ కానున్నాయి. తెలుగురాష్ట్రాల్లో సుమారు 2400పైగా ధియేటర్లు ఉన్నాయి. వీటిల్లో సుమారు 2వేల ధియేటర్లు మేర మూత పడనున్నాయి.

వివాదం ఏంటి?
ప్రింట్‌ వ్యవస్థ స్థానంలో డిజిటల్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు వచ్చారు. అంటే ఫిల్మ్‌ను ప్రింట్‌ల రూపంలో కాకుండా డిజిటల్‌ రూపంలో ధియేటర్లలో ప్రదేశిండం. క్యూబ్‌, యుఎఫ్‌ఓ, పిఎక్స్‌డీ వంటి సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. ప్రత్యేక వ్యవస్థ ద్వారా సినిమాను థియేటర్లలో ప్రదర్శించేవారు. వాటికి నిర్మాతలు కొంత మొత్తాన్ని సర్వీస్‌ ప్రొవైడర్లకు చెల్లించాల్సి ఉండేది. కాల క్రమేణా ఈ సర్వీస్‌ చార్జీలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో  అంత మొత్తంలో చార్జీలను నిర్మాతలు చెల్లించలేక రేట్లను తగ్గించమని కోరారు. అయితే వారి విన్నపాన్ని  సర్వీస్‌ ప్రొవైడర్లను పట్టించుకోలేదు. దీనికారణంగా దక్షిణాది రాష్ట్రాల నిర్మాతల మండలి క్యూబ్‌, యూఎఫ్‌ఓ ప్రతినిధులతో చర్చలు జరిపింది. అయితే ఇరువురి మధ్య చర్చలు విఫలం కావడంతో ఆ సంస్థలకు సినిమాలను ఇవ్వరాదని నిర్మాత ఐకాస నిర్ణయం తీసుకుంది.

మరిన్ని వార్తలు