బిగ్‌బాస్‌ యాంకర్‌గా నయన్‌!

30 Apr, 2019 09:58 IST|Sakshi

హీరో హీరోయిన్లు తమ క్రేజ్‌ను పారితోషికం పెంచుకోవడానికి వాడుకుంటుంటారు. అయితే వారి మార్కెట్‌ను ఇతరులు మరో విధంగా ఉపయోగించుకుంటారు. అలా ఓ టీవీ ఛానల్‌ అగ్రనటి నయనతార క్రేజ్‌ను భలే తెలివిగా వాడేసుకున్నారు. లేడీ సూపర్‌స్టార్‌గా వెలిగిపోతున్న దక్షిణాది టాప్‌ కథానాయకి నయనతార అన్న విషయం తెలిసిందే. సూపర్‌స్టార్‌ రజనీకాంత్, ఇళయదళపతి విజయ్‌ వంటి వారితో నటిస్తూనే, శివకార్తీకేయన్‌ వంటి యువ హీరోలతోనూ జత కట్టడానికి సై అంటోంది.

మరో పక్క హీరోయిన్‌ ఓరింయంటెడ్‌ పాత్రల్లోనూ నటిస్తూ అన్ని రకాల పాత్రల్లోనూ తనదైన ముద్ర వేసుకుంటోంది. అంతే కాకుండా తెలుగులోనూ అగ్ర హీరోలతో జత కడుతూ విరామం లేకుండా నటిస్తోంది. ఇలాంటి బిజీ షెడ్యూల్‌లో ఈ ముద్దుగుమ్మ బుల్లితెరపై మెరబోతోందనే ప్రచారం సామాజిక మాద్యమాల్లో వైరల్‌ అయ్యింది. నయనతార బిగ్‌బాస్‌ రియాలిటీ షోలో వ్యాఖ్యాతగా పాల్గొనబోతోందనీ, మరో కార్యక్రమానికి న్యాయ నిర్ణేతగా వ్యవహరించబోతోందనీ, తన చిత్రాల ప్రమోషన్‌ కార్యమాల్లోనే పాల్గొనడానికి సమ్మతించని నయనతార బుల్లితెరపైకి రాబోవడం నిజంగా విశేషమే లాంటి రకరకాల ప్రచారం హోరెత్తింది.

కానీ నిజమేంటంటే నయనతార ఎలాంటి టీవీ కార్యక్రమాల్లోనూ పాల్గొనడం లేదట. ఇదంతా ఒక టీవీ ప్రచారానికి వాడుకున్న పనేనని తెలిసింది. ఆ మధ్య ఆర్యకు వధువు కావాలంటూ ఒక కార్యక్రమాన్ని నిర్వహించి పెద్ద ఎత్తున ప్రచారం పొందే ప్రయత్నం చేసిన ఆ ఛానల్, చివరికి ఆర్య ఏ అమ్మాయిని ఎంచుకోకపోవడంతో అదంతా ప్రబ్లిసిటీ స్టంటేనని తేలిపోయింది. తాజాగా నటి నయనతారను అదే ఛానల్‌ తన ప్రచారానికి వాడేసుకుంటోంది.

నిజం ఏమిటంటే కలర్స్‌ టీవీ ఛానల్‌ త్వరలో నయనతార బుల్లితెరపైకి రానుందనే ప్రచారం చేసింది. దీంతో సామాజిక మాధ్యమాలు దీన్ని పెద్దగా ప్రచారం చేసేశాయి. అసలు విషయం ఏమిటంటే నయనతార నటించిన ఇమైకా నోడిగళ్‌ చిత్రం మే 12న ఆ ఛానల్‌లో ప్రసారం కానుందట. దానికి కలర్స్‌ ఛానల్‌ అంత బిల్డప్‌ ఇచ్చిందన్నమాట.

అంత బిజీగా ఉన్న నయనతార ఏమిటీ బుల్లితెర కార్యక్రమంలో పాల్గొనడమేమిటీ? అన్న విషయాన్ని సామాజిక మాద్యమాలు కొంచెం కూడా ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్లు ప్రచారం చేసేశారు. కాగా ఇదే విధంగా ఇప్పుడు మరో అగ్రనటి అనుష్క బుల్లితెరపైకా రానుందనీ, తెలుగులో బిగ్‌బాస్‌ రియాలిటీ షో 3కి వ్యాఖ్యాతగా వ్యవహరించబోతోందనే ప్రచారం జోరందుకుంది. ఇందులోనైనా నిజం ఉందా? లేక ఇదీ పబ్లిసిటీ స్టంటేనా? అని సినీ అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు