నేటి నుంచి కర్నూలులో ‘బాహుబలి’ చిత్రం షూటింగ్

6 Jul, 2013 01:44 IST|Sakshi
నేటి నుంచి కర్నూలులో ‘బాహుబలి’ చిత్రం షూటింగ్

 ‘స్టూడెంట్ నంబర్ 1’ ప్రేమకథాచిత్రం. సింహాద్రి, ఛత్రపతి, విక్రమార్కుడు.. యాక్షన్ చిత్రాలు. ‘సై’ యువతరం చిత్రం. యమదొంగ, మగధీర సొషియో ఫాంటసీ చిత్రాలు. ‘మర్యాదరామన్న’ కామెడీ ఫ్యాక్షన్ చిత్రం. ‘ఈగ’ సైంటిఫిక్ థ్రిల్లర్. ప్రస్తుతం ‘బాహుబలి’... గత చిత్రాలకు పూర్తి భిన్నంగా జానపదం. రాజమౌళి గొప్ప దర్శకుడు అనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? భిన్నమైన జానర్లను అలవోకగా హ్యాండిల్ చేస్తూ... దర్శకునిగా తనకుతానే సాటి అనిపించుకున్నారాయన.
 
  నేటి నుంచి కర్నూలులో ‘బాహుబలి’ చిత్రం షూటింగ్ మొదలుకానుంది. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ దశ నుంచే అటు పరిశ్రమలోనూ, ప్రేక్షకుల్లోనూ విపరీతమైన ఆసక్తి. అందుకు తగ్గట్టుగానే రాజమౌళి ఓ యజ్ఞంలా ఈ సినిమా కోసం పనిచేస్తున్నారు. ప్రభాస్, రానా, అనుష్కల శారీరక  భాషలు మార్చడంలో కానీ, ప్రధాన పాత్రధారులందరినీ యుద్ధ విద్యల్లో నిష్ణాతుల్ని చేయడంలో కానీ, ఆయుధాల నుంచి భారీ రాజ ప్రాసాదాల నిర్మాణంలో కానీ రాజమౌళీ కనబరుస్తున్న శ్రద్ద అంతా ఇంతా కాదు.
 
 తెలుగు సినీజానపద స్వర్ణయుగ చరిత్రను పునరావృతం చేసేలా ‘బాహుబలి’ చిత్రాన్ని ఆయన తెరకెక్కిస్తున్నారు. కర్నూలులో నాలుగు రోజుల పాటు ఈ షెడ్యూల్ జరగనుంది. తొలుత ఈ షెడ్యూల్‌ని ఆయన హైదరాబాద్‌లోనే చేయాలనుకున్నారు. అయితే... దానికి చారిత్రాత్మక ప్రదేశం అయితే కరెక్ట్‌గా ఉంటుందని ఈ షెడ్యూల్‌ని కర్నూలుకి షిఫ్ట్ చేశారు రాజమౌళి.
 
 ఈ నెల 14 వరకూ ఈ షెడ్యూల్ జరుగుతుంది. తర్వాత ఆయన వ్యక్తిగత పర్యటన నిమిత్తం యూఎస్ వెళతారు. యూఎస్ నుంచి తిరిగి వచ్చాక మలి షెడ్యూల్ హైదరాబాద్‌లో మొదలవుతుంది. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
 
  కె.రాఘవేంద్రరావు సమర్పణలో యార్లగడ్డ శోభు, ప్రసాద్ దేవినేని కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్, సుదీప్, అడవి శేషు తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: కె.కె.సెంథిల్ కుమార్, సంగీతం: ఎం.ఎం.కీరవాణి, నిర్మాణం: అర్కా మీడియా వర్క్స్.