మాటల్లేవ్‌.. మాట్లాడుకోవడాల్లేవ్‌

11 Apr, 2019 05:54 IST|Sakshi

పురాతన కట్టడాలు, కోటలు, కొండలు... అడవులు, కొండ కోనలు, మంచు కొండల మధ్య ప్రయాణాలు...  బాంబులు ఉన్నాయి.. బాణాలతో వేటాడే మనుషులు, ప్రాణాల కోసం పరుగులు తీసే మనుషులు ఉన్నారు.. గ్రామ పెద్దలు, గుమిగూడిన మనుషులున్నారు.. నీటిలో గుట్టలుగా పడిన శవాలు ఉన్నాయి. ఇటువంటి విపత్కర పరిస్థితుల నడుమ, వివిధ వర్గాల ప్రజల మధ్య ‘కల్కి’ కదిలాడు.. కదనరంగంలోకి గొడ్డలి పట్టి దిగాడు. అతడి కథేంటో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

రాజశేఖర్‌ హీరోగా ‘అ!’ ఫేమ్‌ ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘కల్కి’. శివాని–శివాత్మిక సమర్పణలో హ్యాపీ మూవీస్‌ పతాకంపై సి.కళ్యాణ్‌ నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్‌ని బుధవారం విడుదల చేశారు. పైన చెప్పినందంతా టీజర్‌లో వచ్చిన సన్నివేశాలే. అయితే ఈ టీజర్‌లో ఒక్క డైలాగ్‌ లేకపోవడం విశేషం. ప్రశాంత్‌ వర్మ మాట్లాడుతూ– ‘‘1980 నేపథ్యంలో సాగే ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌ ఇది. రాజశేఖర్‌గారు పోలీస్‌ అధికారి పాత్రలో నటిస్తున్నారు. ఆయనతో పని చేయడం చాలా సంతోషంగా ఉంది. నేను ఇప్పటివరకూ పని చేసిన యాక్టర్స్‌లో మోస్ట్‌ కంఫర్టబుల్‌ యాక్టర్‌ రాజశేఖర్‌గారు.

అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి టీజర్‌కు మంచి స్పందన వస్తోంది’’ అన్నారు. ‘‘టీజర్‌కు వస్తున్న స్పందన వింటుంటే సంతోషంగా ఉంది. రెండు మూడు రోజుల ప్యాచ్‌ వర్క్‌ మినహా షూటింగ్‌ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలతో బిజీగా ఉన్నాం. త్వరలో రిలీజ్‌ డేట్‌ ప్రకటిస్తాం’’ అన్నారు సి.కళ్యాణ్‌. అదా శర్మ, నందితా శ్వేత, పూజిత పొన్నాడ, స్కార్లెట్‌ విల్సన్, రాహుల్‌ రామకృష్ణ, నాజర్, సిద్ధూ జొన్నలగడ్డ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: దాశరథి శివేంద్ర, సంగీతం: శ్రవణ్‌ భరద్వాజ్, లైన్‌ ప్రొడ్యూసర్‌: వెంకట్‌ కుమార్‌ జెట్టి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు