ట్రాన్స్‌జెండర్‌ పాత్రలో నటించాలని ఉంది

17 Dec, 2019 14:44 IST|Sakshi

‘ట్రాన్స్‌జెండర్‌ పాత్రలో నటించాలని ఉంది’ అని సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ అన్నారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘దర్బార్‌’ ట్రైలర్‌ను ముంబైలో సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయనను మీరు ఇంకా చేయాల్సిన పాత్రలు ఏమైనా ఉన్నాయా అని అడగ్గా.. ‘నేను ఇప్పటి వరకు 160 సినిమాల్లో నటించాను. సినీ ఇండస్ట్రీకి వచ్చి 45 ఏళ్లు గడిచిపోయాయి. నాకు ట్రాన్స్‌జెండర్‌ పాత్ర చేయాలని ఉంది’ అని చెప్పుకొచ్చారు. అయితే దర్శకులు ఎవరైనా.. ట్రాన్స్‌జెండర్‌ పాత్ర చేయాలని మిమ్మల్ని సంప్రదించారా అని విలేకరులు ప్రశ్నించగా.. ‘అలాంటిదేం లేదు. ఇప్పటి వరకు ఎవరు నన్ను సంప్రదించలేదు.  మొదటిసారిగా నా కోరికను వ్యక్తపరిచాను’ అని చెప్పారు. (అదిరిపోయిన ‘దర్బార్‌’ ట్రైలర్‌)

అలాగే గత 45 సంవత్సరాల నుంచి తనకు మరాఠి సినిమాలలో నటించాలనే కోరిక ఉందని, నటించే అవకాశం వచ్చినా కొన్ని కారణాల వల్ల అది కుదరలేదని చెప్పారు. ఆ సమయం వచ్చినప్పుడు తప్పక మరాఠి సినిమాలు చేస్తానని పేర్కొన్నారు. ఇక దర్బార్‌ సినిమాలో.. బెంగుళూరు మరాఠి కుటుంబం నుంచి వచ్చి ముంబై పోలీసు కమిషనర్‌గా ఎదిగిన వ్యక్తి పాత్రలో రజనీ కనిపించనున్నారు. ఈ సినిమాలో ఆయన పాత్ర గురించి చెబుతూ.. నిజానికి నాకు సీరియస్‌ పోలీస్‌ అధికారిగా విధులు నిర్వహించే పాత్రల కంటే వినోదభరితమైన పాత్రలు చేయడం అంటేనే ఇష్టం అని చెప్పారు. కాగా ‘దర్బార్‌’ దర్శకుడు మురుగదాస్‌ ఈ సినిమాలో తనను భిన్నమైన పోలీసు అధికారి పాత్రలో చూపిస్తానని చెప్పడంతో.. ఈ సినిమాకు ఓకే చెప్పానని రజనీ చెప్పుకొచ్చారు. ఇక దర్బార్‌ షూటింగ్‌లో భాగంగా ముంబైలో 90 రోజులు ఉండాల్సి వచ్చిందని, ఈ క్రమంలో తనకు ముంబై, ఇక్కడి ప్రజలు బాగా నచ్చారని పేర్కొన్నారు.


 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా