రజనీ ఫారిన్‌ కారు: ఇంత పెద్ద స్టోరీనా!

24 Jun, 2020 11:45 IST|Sakshi

హైదరాబాద్‌: సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌.. ఇది ఒక పేరు కాదు ఒక బ్రాండ్‌. దేశవిదేశాల్లో అభిమానులు, నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం. రజనీ సినిమా వస్తుందంటే బాక్సాఫీస్‌ బద్దలవ్వాల్సిందే. బెంగళూరులోని ఓ ట్రాన్స్‌ పోర్ట్‌ సర్వీసులో కండక్టర్‌గా ప్రారంభమైన ఆయన ప్రయాణం సూపర్‌స్టార్‌గా ఎదగడం వెనక ఎంతో శ్రమ, కష్టం ఉన్నాయి. అయితే తన సినిమా ప్రయాణంలో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నానని, అవమానపడిన ప్రతీసారి కసితో పనిచేశానని ‘దర్బార్‌’ ఆడియో ఫంక్షన్‌లో పేర్కొన్న విషయం తెలిసిందే. ఆ ఆడియో ఫంక్షన్‌లో రజనీ ఇచ్చిన స్పూర్తిదాయక స్పీచ్ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. (‘పెదరాయుడు’ స్పెషల్‌ వీడియో)

‘భారతీరాజా దర్శకత్వంలో వచ్చిన ‘16 వయతినిలే’ చిత్రంలోని పరట్టయి పాత్రతో నాకు తమిళనాడులో మంచి గుర్తింపు లభించింది. అప్పటికే పలు చిత్రాలు చేసినప్పటికీ పరట్టయి క్యారెక్టర్‌ ప్రేక్షకులకు బాగా కనెక్ట్‌ అయింది. అయితే ఈ చిత్రం విడుదలైన రెండు వారాల తర్వాత ఓ నిర్మాత (పేరు చెప్పడం ఇష్టం లేదు) నుంచి కబురు వచ్చింది. ఓ పెద్ద హీరో చిత్రం అందులో నా పాత్ర చాలా విభిన్నంగా ఉండటంతో ఓకే చెప్పాను. పారితోషికం మాట్లాడుకొని డేట్స్‌ కూడా ఇచ్చాను. అయితే ఈ సినిమాలో నా పాత్ర కన్ఫర్మేషన్‌ కోసం అడ్వాన్స్‌ ఇవ్వమని అడిగాను. అయితే షూటింగ్‌కు వచ్చాక ఇస్తామని చెప్పారు. (రాయని డైరీ : రజనీకాంత్‌ (సూపర్‌ స్టార్‌))

షూటింగ్‌కు వెళ్లాక హీరో వచ్చే సమయం అయింది మేకప్‌ వేసుకొమ్మని అన్నారు. కానీ అడ్వాన్స్‌ ఇవ్వందే మేకప్‌ వేసుకోనని చెప్పా. అప్పుడే అంబాసిడర్‌ కారులో ఏవీఎమ్‌ స్టూడియో(షూటింగ్‌ జరిగే ప్రదేశం)కు వచ్చిన నిర్మాతకు ఈ విషయం తెలిశాక ఆగ్రహంతో ఊగిపోయారు. నువ్వేమైన పెద్ద స్టార్‌ అనుకుంటున్నావా? ఎన్ని చిత్రాలు చేశావు? నీకంటూ ఏం గుర్తింపు ఉంది? అంటూ శివాలెత్తారు. అంతేకాకుండా ఈ సినిమాలో నీకు అవకాశం లేదని చెప్పి వెళ్లిపొమ్మన్నారు. అయితే ప్రస్తుతం తన దగ్గర డబ్బులు లేవని కనీసం మీ కారులోనైనా ఇంటి దగ్గర దిగబెట్టాలని కోరా. అందుకు ఆయన అస్సలు ఒప్పుకోలేదు. డబ్బులు లేకుంటే నడుచుకుంటూ వెళ్లమని వెకిలిగా మాట్లాడారు. (నా బ్రాండ్‌ రెడ్‌ట్రీ)

అప్పుడే అనుకున్నా ఏవీఎం స్టూడియోలో మరోసారి అడుగుపెడితే అది విదేశీ కారుతోనే అనుకున్నా. రెండున్నరేళ్ల తర్వాత ఓ పెద్ద చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. భారీ పారితోషికం ఇచ్చారు. వెంటనే ఫియట్‌ కారు కొని, ఓ విదేశీ వ్యక్తిని డ్రైవర్‌గా నియమించా. అంతేకాకుండా  అతనికి ప్రత్యేకమైన సూట్‌ కుట్టించా. ఏవీఎం స్టూడియోలో ఫారిన్‌ కారు, డ్రైవర్‌, చేతిలో రెండు సిగరెట్లతో స్టైల్‌గా దిగి నా కల నెరవేర్చుకున్నా. అయితే సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే తెలివితేటలు, కష్టపడేతత్వం ఉంటేనే సరిపోదు. మనం ఉండే స్థానం, సమయం, ప్రజల ఆశీ​ర్వాదం కూడా ముఖ్యం’ అని రజనీకాంత్‌ తన స్టైల్లో ఉపన్యాసాన్ని ముగించారు. (రోబో: హీరోయిన్‌ ఐశ్వర్య.. మరి హీరో ఎవరు?)
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా