బర్మన్ మరణానికి కారణం అదే!

2 Jul, 2014 01:05 IST|Sakshi
బర్మన్ మరణానికి కారణం అదే!

సక్సెస్‌లో ఉన్నవాళ్ళనే తప్ప, ఫ్లాపుల్లో ఉన్నవారిని సినిమా పరిశ్రమ నిర్దాక్షిణ్యంగా విస్మరిస్తుంది. చిత్రసీమకు ఉన్న విచిత్ర లక్షణం ఇది. మహామహులకు సైతం ఈ అనుభవం తప్పదు.. తప్పలేదు. హిందీ సినీ సంగీత దిగ్గజం ఆర్.డి. బర్మన్‌కు కూడా ఇదే అనుభవమైందట! ఆ బాధతోనే ఆయన ఏమంత వయసు మీద పడకుండానే కన్నుమూశారు. సంగీత దర్శకుడు రాహుల్ దేవ్ బర్మన్‌తో దీర్ఘకాలం అనుబంధమున్న గాయనీమణి లతా మంగేష్కర్ ఈ సంగతి వెల్లడించారు.
 
  పంచమ్ దా అని అందరూ ఆప్యాయంగా పిలుచుకొనే ఆర్.డి. బర్మన్ 75వ జయంతి సందర్భంగా, ఆమె మాట్లాడుతూ, ‘‘పిన్న వయసులోనే, ఎంతో అసంతృప్తితో, బాధతో మరణించారాయన’’ అని చెప్పారు. ‘‘ఆర్.డి. బర్మన్ లాంటి ప్రతిభావంతుడైన సంగీత దర్శకుడు కూడా చేతిలో అవకాశాలు లేకుండా గడపాల్సి రావడమంటే, బతికుండీ చచ్చిపోవడం కింద లెక్క. ఆయన జీవితంలో అదే జరిగింది.
 
  అది ఆయనను ఎంతో అసంతృప్తికి గురి చేసింది. ఒక్కోసారి ఆయన తన బాధను నాతో చెప్పుకునేవారు. కొన్ని సినిమాల్లో ఆయన బాణీలు ఆశించినంతగా ఆదరణకు నోచుకోలేదు. అంత మాత్రానికే సినీ రంగం ఆయనకు అవకాశాలివ్వకుండా క్రూరంగా వ్యవహరించింది. ఆ సంగతులు తలచుకొంటే, నాకు ఇప్పటికీ దుఃఖం పొంగుకొస్తుంది’’ అని బర్మన్ చివరి రోజుల గురించి ఆమె చెప్పుకొచ్చారు. సక్సెస్‌నే తప్ప సామర్థ్యాన్ని గుర్తించని విచిత్ర పరిస్థితికి ఇంతకన్నా ఉదాహరణ ఇంకేం కావాలి!