‘రుద్రమ దేవి’ నగలపై కదులుతున్న డొంక

26 Jul, 2014 08:15 IST|Sakshi
‘రుద్రమ దేవి’ నగలపై కదులుతున్న డొంక
  • ఎగ్జిక్యూటివ్ రవి తీరుపైనే అనుమానం
  •  విచారిస్తున్న పోలీసులు
  • గచ్చిబౌలి: రుద్రమదేవి సినిమా షూటింగ్‌లో మాయమైన నగల కేసులో ఆ కంపెనీ ఎగ్జిక్యూటివ్ తీరుపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 19న షూ టింగ్‌కు ముందు రెండు డబ్బాల నగలు మాయమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘నాదేళ్ల ఆంజనేయులు శెట్టి నగల కంపెనీ’కి చెందిన ఎగ్జిక్యూటివ్ రవి సుబ్రహ్మణ్యంను గచ్చిబౌలి పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

    పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయాన్ని తెలుసుకున్న రవి భార్య మరుసటి రోజే ‘నాదేళ్ల ఆంజనేయులు శెట్టి కంపెనీ’ ప్రతినిధులకు తమ ఇంట్లో నగలున్నట్టుగా సమాచారం అందించారు. కంపెనీ ప్రతినిధులు గచ్చిబౌలి పోలీసులకు సమాచా రం ఇవ్వగా చెన్నై పోలీసుల సహకారం తీసుకున్నారు. చెన్నైలోని రవి ఇంట్లో దాదాపు పది కేజీల గిల్డ్ నగలను చెన్నై పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అప్పటివరకు షూటింగ్ వద్దకు నగలు తీసుకొచ్చానని చెప్పిన రవి మాట మార్చారు.

    కొన్ని ఇంట్లోనే ఉన్నాయని తమ కంపెనీ యాజమన్యానికి తెలియదని చెప్పారు. యాజ మాన్యానికి తెలియకుండా నగలు ఇంట్లో పెట్టుకోవడంతో రవి తీరుపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రవి మాత్రం ఎన్ని నగలు తీసుకొచ్చావనే దానిపై పోలీసులకు రోజుకో తీరుగా చెబుతున్నట్టు సమాచారం. ఇదిలావుంటే రాణి రుద్రమ దేవి విగ్రహలపై ఉన్న నగలను ఫొటోల ఆధారంగా ప్రముఖ డిజైనర్ నీతా లుల్లా నగలను ప్రత్యేకంగా డిజైన్ చేసినట్టు తెలిసింది.

    రుద్రమదేవి సంప్రదాయ నగలను ప్రత్యేకంగా డిజైన్ చేసి ఇస్తామని ఆంజనేయులు శెట్టి కంపెనీ అంగీకరించింది. కళాకారులు, యంత్రాల ద్వారా గిల్డ్, బంగారు నగలు తయారు చేశారు. ఈ క్రమంలో  భారీగా ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. రవి సుబ్రహ్మణ్యం ద్వారా గిల్డ్ నగలతోపాటు ఏడు బంగారు నగలు షూటింగ్ కోసం పంపించినట్టు పోలీసులతో కంపెనీ ప్రతినిధులు తెలిపినట్లు సమాచారం.