‘సంజు’ మూవీ రివ్యూ

29 Jun, 2018 13:58 IST|Sakshi

టైటిల్ : సంజు
జానర్ : బయోపిక్‌
తారాగణం : రణ్‌బీర్‌ కపూర్‌, పరేష్‌ రావెల్‌, మనీషా కోయిరాలా, దియా మీర్జా, విక్కీ కౌశల్, అనుష్క శర్మ తదితరులు
సంగీతం : ఏఆర్‌ రెహమాన్‌
దర్శకత్వం : రాజ్‌కుమార్‌ హిరాణీ
నిర్మాత : విదూ వినోద్‌ చోప్రా, రాజ్‌కుమార్‌ హిరాణీ

Sanju Telugu Movie Review: బయోపిక్‌ల ట్రెండ్‌ నడుస్తున్న తరుణంలో సీనియర్‌ నటుడు సంజయ్‌ దత్‌ జీవితగాథ సంజును ప్రకటించి ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించాడు దర్శకుడు రాజ్‌కుమార్‌ హిరాణీ. పైగా సక్సెస్‌ లేక సతమతమవుతున్న యువ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ను సంజు రోల్‌కు తీసుకోవటం ఆశ్చర్యం కలిగించింది. అయితే ట్రైలర్‌-ప్రొమోల్లో అచ్చం సంజు బాబాల కనిపించిన రణ్‌బీర్‌.. ఆ అంచనాలను తారాస్థాయికి చేర్చాడు. భారీ అంచనాల మధ్య సంజు ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సంజుగా రణ్‌బీర్‌ ఏమేర అలరించాడో చూద్దాం...

కథ.. 
స్టార్‌ వారసుడిగా బాలీవుడ్‌లో అడుగుపెట్టి డెబ్యూ చిత్రం(రాకీ)తోనే స్టార్‌డమ్‌ సంపాదిస్తాడు సంజు(రణ్‌బీర్‌ కపూర్‌). సినీ ప్రస్థానం కొనసాగుతున్న సమయంలోనే డ్రగ్స్‌ అలవాటు, అక్రమాయుధాల కేసు సంజు(రణ్‌బీర్‌ కపూర్‌) జీవితాన్ని కుదిపేస్తాయి. ఆయుధాల కేసులో సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో తనకు తానుగా లొంగిపోవాలని సంజు భావిస్తాడు. కానీ, అంతకు ముందే తన జీవిత కథగా మలిచేందుకు ప్రయత్నిస్తాడు. రచయిత కోసం ఎదురుచూస్తున్న తరుణంలో విన్నె(అనుష్క శర్మ) ముందుకు వస్తుంది. తన జీవితంలోని ముఖ్య ఘట్టాలను సంజు.. విన్నెకు వివరిస్తూ కథ సాగుతుంది.

విశ్లేషణ.. 
మనకు బాగా తెలిసిన వ్యక్తి జీవితంలోని ఆసక్తికర అంశాలను కూలంకుశంగా తెలుసుకోవాలనే ఆసక్తి సహజం. ‘ఒక్క మనిషి.. పలు కోణాలు’ అంటూ ట్యాగ్‌ లైన్‌తోనే సంజు జీవితంలోని దశలను దర్శకుడు రాజ్‌కుమార్‌ హిరాణీ వివరించే యత్నం చేశాడు. అయితే వివాదాల నటుడు సంజయ్‌ దత్‌ లైఫ్‌ను తెరపై హిరాణీ డీల్‌ చేసిన విధానం అద్భుతం. వివాదాలను కూడా ఎమోషనల్‌గా మలిచిన తీరుకు హ్యాట్సాఫ్‌ చెప్పకుండా ఉండలేం. తన జీవితంలో ఎత్తుపల్లాలను పూసగూచ్చినట్లు వివరిస్తూ సంజు కథ ముందుకు సాగుతుంది. తల్లి మరణం, హీరోగా ఎదిగే క్రమంలో డ్రగ్స్‌ అలవాటుతో సంజు సతమతమయ్యే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఆ వ్యసనం నుంచి బయటపడేందుకు చేసే స్ట్రగుల్‌, విమర్శలు వెల్లువెత్తినా తండ్రి‌(పరేష్‌ రావెల్‌) కొడుక్కి అండగా నిలవటం, ముఖ్యంగా వాళ్లిద్దరి మధ్య వచ్చే సెంటిమెంట్‌ సీన్లు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. అయితే ఫస్టాఫ్‌ను గ్రిప్పింగ్‌గా నడిపిన దర్శకుడు.. సెకండాఫ్‌ను మొత్తం జైలు జీవితం, కేసు, కోర్టు ప్రధానాంశాలుగా నడిపించాడు. తాను టెర్రరిస్ట్‌ను కాదంటూ సంజు పడే మానసిక సంఘర్షణ, భావోద్వేగపూరిత సన్నివేశాలతోనే ద్వితీయార్థాన్ని కానిచ్చేశాడు. అయితే ఈ క్రమంలో సంజు కెరీర్‌ను చూపించినా.. వ్యక్తిగత విషయాల జోలికి పోలేదు. హీరోయిన్లతో రిలేషన్‌షిప్స్‌, వైవాహిక జీవితంలోని లోతైన అంశాలను(మొదటి భార్య రిచా శర్మ, కూతురు త్రిశల గురించి) చూపించకుండా సంజు కథ సాగటం గమనార్హం. ఈ విషయంలో ప్రేక్షకులు కొంత అసంతృప్తికి గురికావొచ్చు.  

నటీనటుల విషయానికొస్తే..
సంజయ్‌ దత్‌ పాత్రలోకి రణ్‌బీర్‌ కపూర్‌ జీవించేశాడు. సంజు అంటే రణబీర్ అనేలా కెరీర్‌ బెస్ట్‌ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కొన్ని సన్నివేశాల్లో రణ్‌బీర్‌ తనను తాను అద్భుతంగా ఆవిష్కరించుకున్నాడు. డ్రగ్స్‌ బాధితుడిగా చేసే సన్నివేశాలు అయితేనేం, వీధుల్లో అడుక్కునే సీన్‌ అయితేనేం, పోలీస్‌ విచారణలో, ఆస్పత్రిలో స్నేహితుడితో... ఒక్కటి కాదు చెప్పుకుంటూ పోతే బోలెడు సీన్లు. ఎమోషనల్‌ సీన్లలోనే కాదు.. కామెడీతో కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్‌ను కూడా పండించాడు. తండ్రి సునీల్‌ దత్‌ పాత్రలో పరేష్‌ రావల్‌ను తప్ప వేరే ఎవరినీ ఊహించుకోలేం అనిపించింది. సాధారణంగా ఎంటర్‌టైన్‌మెంట్‌ పాత్రలకు పేరుగాంచిన ఈ సీనియర్‌ నటుడు.. సీరియస్‌ నటనతో సంజుకు బలంగా నిలిచాడు. ఇక సంజు బెస్ట్‌ ఫ్రెండ్‌ కమలేష్‌(విక్కీ కౌశల్‌) పాత్ర సినిమాకు మరో ఆకర్షణ. కష్టాల్లో ఉన్న స్నేహితుడికి అండగా ఉండటం, సంజు-కమలేష్‌ కాంబినేషన్‌లో వచ్చే సన్నివేశాలు మంచి అనుభూతిని కలిగిస్తాయి. నర్గీస్‌ దత్‌ పాత్రలో సీనియర్‌ నటి మనీషా కోయిరాలాకు పెద్దగా సీన్లు లేవు. అయినా ఉన్నంతలో ఆమె పాత్ర అలరిస్తుంది. భార్య మాన్యతా పాత్రలో దియా మీర్జా మెప్పించారు. సోనమ్‌ కపూర్‌, అనుష్క శర్మ, మిగతా పాత్రలు ఓకే. పలువురు సెలబ్రిటీలు, చివర్లో కాసేపు స్వయంగా  సంజయ్‌ దత్‌ కనిపించటం ఆకట్టుకుంది.

ఏఆర్‌ రెహమాన్‌, రోహన్‌ రోహన్‌-విక్రమ్‌ మాంట్రెసె సంగీతం సినిమాకు తగ్గ మూడ్‌ను అందించింది. కర్‌ హర్‌ మైదాన్‌ ఫతే సాంగ్‌, రుబీ రుబీ పాటలు అలరిస్తాయి. బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌తోపాటు విజువల్‌గా కూడా సంజు మెప్పిస్తుంది.  రాజ్‌కుమార్‌ హిరాణీ అద్భుతమైన స్టోరీ టెల్లర్‌. అందులో ఏ మాత్రం సందేహం లేదు. దత్‌ ఫ్యామిలీతో ఉన్న స్నేహాన్ని పక్కనపెట్టి మరీ కథానుగుణంగా కొన్ని సన్నివేశాలను స్వేచ్ఛగా తెరకెక్కించారు. చిత్రం నవ్విస్తుంది, ఏడిపిస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది. ఓవరాల్‌గా హిరాణీ సినిమాల్లో లభించే హ్యూమన్‌ ఎమోషన్స్‌, హ్యూమర్‌ ఎలిమెంట్స్‌ ‘సంజు’లో పుష్కలంగా లభిస్తాయి.

ఫ్లస్‌ పాయింట్లు
కథా-కథనం
రణ్‌బీర్‌ కపూర్‌
మిగతా పాత్రలు
సంగీతం

మైనస్‌ పాయింట్లు
కొన్ని ఆసక్తికరమైన అంశాలను చూపించకపోవటం
అక్కడక్కడ సాగదీత సన్నివేశాలు

- సతీష్‌ రెడ్డి జడ్డా, ఇంటర్‌నెట్‌ డెస్క్‌.

మరిన్ని వార్తలు