దీపికాపదుకొనే తరహాలో..

18 Jul, 2018 08:49 IST|Sakshi

తమిళసినిమా: కోలీవుడ్‌లో సాయేషా సైగల్‌ ఖాతాలో విజయాలకు బీజం పడింది. అవును కడైకుట్టి సింగం చిత్రంతో తొలిసారిగా విజయానందాన్ని అనుభవిస్తోంది ముంబై బ్యూటీ. ఓటమి నుంచే విజయం పుడుతుందంటారు. అది సాయేషా విషయంలోనూ నిజమైంది. ఈ అమ్మడు నటించిన తొలి చిత్రం వనమగన్‌ ఆశించిన విజయాన్ని అందుకోలేదు. అయితే సాయేషాసైగల్‌ నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. అవే ఈ సుందరిని ఇక్కడ నిలదొక్కుకునేలా చేశాయి. కార్తీతో జతకట్టిన కడైకుట్టి సింగం ఇటీవల తెరపైకి వచ్చి ప్రేక్షకాదరణతో విజయం దిశగా పరుగులు పెడుతోంది. తదుపరి విజయ్‌సేతుపతికి జంటగా నటించిన జుంగా, ఆర్యతో రొమాన్స్‌ చేస్తున్న గజనీకాంత్‌ చిత్రాలు వరుసగా విడుదలకు ముస్తాబవుతున్నాయి. తదుపరి చిత్రం ఏమిటాని ఎదురుచూస్తున్న తరుణంలో దీపికాపదుకొనే తరహాలో యానిమేషన్‌ చిత్రంలో నటించే అవకాశం సాయేషా తలుపుతట్టింది.

ఐసరి గణేశ్‌ వేల్స్‌ ఫిలింస్, ప్రభుదేవా స్టూడియోస్‌ సంస్థలు కలిసి నిర్మిస్తున్న కిళక్కు ఆఫ్రికావిల్‌ రాజు చిత్రంలో సాయేషా కొత్తగా వచ్చి చేరిందన్నది తాజా సమాచారం. ఎంజీఆర్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మించి నటించిన ఉలగం చుట్రు వాలిబన్‌ చిత్రం తరువాత ఆయన దానికి సీక్వెల్‌ చేయాలని ఆశించారు. అయితే అందుకు సమయం అనుకూలించకపోవడంతో చేయలేకపోయారు. దాన్నిప్పుడు ఐసరి గణేశ్, ప్రభుదేవ యానిమేషన్‌ చిత్రంగా నిర్మిస్తున్నారు. అదే కిళక్కు ఆఫ్రికావిల్‌ రాజు. ఇందులో ఎంజీఆర్, జయలలిత పాత్రలను యానిమేషన్‌లో రూపొందిస్తున్నారు దర్శకుడు అరుళ్‌మూర్తి. అయితే కొన్ని నటీనటులు కూడా ఇందులో నటిస్తుండడం విశేషం. అలా నటి సాయేషాసైగల్‌ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తోంది. ఆమె పాత్రను రజనీకాంత్‌ నటించిన కోచ్చడైయాన్‌ చిత్రంలో దీపికాపదుకొనే పాత్రలా యానిమేషన్‌లో రూపొందిస్తున్నారని తెలిసింది. ఈ చిత్రానికి వైరముత్తు పాటలను, డి.ఇమాన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఇటీవలే నిర్వహించిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు