కోలీవుడ్‌కు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు

15 Aug, 2018 09:08 IST|Sakshi

తమిళసినిమా: చాలా కాలం తరువాత టాలీవుడ్‌లో మల్టీస్టారర్‌ చిత్రాలకు ట్రెండ్‌ సెట్టర్‌ అయిన చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. నటుడు వెంకటేశ్, మహేశ్‌బాబు కలిసి నటించిన ఇందులో సమంత, అంజలి హీరోయిన్లుగా నటించారు. ప్రకాశ్‌రాజ్, జయసుధ, అభినయ, రావురమేశ్‌ తదితరులు ముఖ్య పాత్రలను పోషించిన ఈ చిత్రానికి అడ్డాల శ్రీకాంత్‌ దర్శకుడు. మిక్కీ జే.మేయర్‌ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు మంచి ఆదరణ పొందాయి. చక్కని కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఇప్పుడు మోయిన్‌ బేగ్‌ సమర్పణలో రోల్స్‌ బ్రైట్‌ మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ పతాకంపై మెహబూబ్‌బాషా నెంజమెల్లాం పల వణ్ణం పేరుతో తమిళంలోకి అనువదిస్తున్నారు.

దీనికి ఏఆర్‌కే.రాజరాజా అనువాదం రచయితగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దీని వివరాలను ఆయన తెలుపుతూ తెలుగు చిత్రం అనగానే ఫైట్స్, యాక్షన్, ఫాస్ట్‌ బీట్‌తో కూడిన పాటలు అనుకుంటారన్నారు. అయితే నెంజమెల్లాం పల వణ్ణం చిత్రం చక్కని కుటుంబ కథా చిత్రంగా ఉంటుందన్నారు. ముఖ్యంగా కుటుంబ అనుబంధాలను ఆవిష్కరించే చిత్రంగా ఉంటుందన్నారు. మహేశ్‌బాబు, వెంకటేశ్‌ అన్నదమ్ములుగా నటించారని చెప్పారు. కడైకుట్టి సింగం తరహాలో ఈ చిత్రంలో మహేశ్‌బాబు కడైకుట్టి సింగం పాత్రలో నటించారని తెలిపారు. ఈయన ఇంతకు ముందు నటించిన శ్రీమంతుడు చిత్రం తమిళంలో సెల్వందన్‌ పేరుతో అనువాదం అయ్యి మంచి సక్సెస్‌ అయ్యిందన్నారు. అదే మాదిరిగా ఈ చిత్రం ఆయనకు మంచి పేరు తెచ్చి పెడుతుందని అన్నారు. చిత్రాన్ని త్వరలోనే విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు ఏఆర్‌కే.రాజరాజా తెలిపారు.

మరిన్ని వార్తలు