పద్మావత్‌కు వ్యతిరేకంగా పిల్‌

19 Jan, 2018 11:52 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పద్మావత్‌ చిత్రంపై సుప్రీం కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ చిత్ర విడుదలను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని న్యాయవాది ఒకరు శుక్రవారం న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. అయితే కోర్టు మాత్రం పిల్‌ను తోసిపుచ్చింది. 

‘‘మాది రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ. సినిమాలను అడ్డుకోవటం మా పని కాదు. శాంతి భద్రతల పని ప్రభుత్వాలు చూసుకుంటాయని’’ అని బెంచ్‌ ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. 

సినిమా విడుదలైతే అల్లర్లతో హింస చెలరేగే పరిస్థితి ఉందని.. ఈ నేపథ్యంలో పద్మావత్‌ సినిమాను విడుదల కానివ్వకుండా ఉత్తర్వులు జారీ చేయటమే ఉత్తమమని ఎంఎల్‌ శర్మ అనే న్యాయవాది సుప్రీంలో పిల్‌ దాఖలు చేశారు.  అయితే ఇది(పిల్‌ను ఉద్దేశించి) ప్రజలకు ఏ రకంగా మేలు కలిగించేదో అర్థం కావట్లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. చిత్ర విడుదలను అడ్డుకునే ప్రయత్నాలు మానేయటం ఉత్తమమని.. ఈ కేసులో మరోసారి వాదనలు వినేందుకు సిద్ధంగా లేమని అని పిటిషనర్‌తో న్యాయమూర్తి తేల్చి చెప్పారు. 

సెన్సార్‌ బోర్డు చీఫ్‌కు వార్నింగ్‌...
ఇదిలా ఉంటే పద్మావత్‌ చిత్ర విడుదలకు క్లియరెన్స్‌ ఇచ్చిన సీబీఎఫ్‌సీపై రాజ్‌పుత్‌ కర్ణిసేన ఆగ్రహంతో ఊగిపోతోంది. బోర్డు చీఫ్‌ ప్రసూన్‌ జోషిని ఇక ముందు రాజస్థాన్‌లో అడుగుపెట్టనివ్వబోమని హెచ్చరించింది. పెద్ద ఎత్తున్న వ్యతిరేకత వ్యక్తమవుతున్నా సెన్సార్‌ బోర్డు పట్టించుకోకపోవటం దారుణమని.. మున్ముందు మరిన్ని పరిణామాలు సెన్సార్‌ బోర్డు ఎదుర్కోవాల్సి ఉంటుందని కర్ణిసేన ఓ ప్రకటన విడుదల చేసింది.

మరిన్ని వార్తలు