దెయ్యంగా సూర్య!

6 Jun, 2014 23:30 IST|Sakshi
దెయ్యంగా సూర్య!

 కమల్‌హాసన్ తర్వాత కోలీవుడ్‌లో ప్రయోగాలపై అమితంగా ఆసక్తి కనబరిచే నటుడు సూర్య. గజనీ, సూర్య సన్నాఫ్ కృష్ణన్, సెవెన్త్ సెన్స్, మాట్రాన్... ఇలా పలు చిత్రాల్లో భిన్నమైన పాత్రలు పోషించి.. దక్షిణాది ప్రేక్షకులందరి అభిమానం చూరగొన్నారాయన. తమిళ కథానాయకుడైన సూర్యను, తెలుగు హీరోలతో సమానంగా ఇక్కడి ప్రేక్షకులు అభిమానిస్తున్నారంటే కారణం అదే. త్వరలో సూర్య మరోసారి విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నట్లు కోలీవుడ్ టాక్. వెంకటప్రభు దర్శకత్వంలో నటించడానికి ఆయన పచ్చజెండా ఊపిన విషయం తెలిసిందే.
 
ఈ సినిమాలో సూర్య ద్విపాత్రాభినయం చేస్తున్నారని వినికిడి. ఇందులో ఒక పాత్ర నేటి యువతరానికి ప్రతీక కాగా, మరో పాత్ర ‘దెయ్యం’. మీరు చదివింది నిజమే... సూర్య భూతంలా కనిపించనున్నారట. సూర్య స్థాయి హీరోలు ఇలా దెయ్యంలా నటించడం దక్షిణాదిన ఇదే ప్రథమం కావొచ్చు. ఆయన తరం కథానాయకుల్లో ఎక్కువ  ద్విపాత్రాభినయాలు చేసింది కూడా సూర్యనే. దీనికి తోడు ఇప్పుడు దెయ్యంలా కూడా నటించనుండటం కోలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. మరి దెయ్యంగా సూర్య ఏ మేరకు ప్రేక్షకులను భయపెడతారో చూడాలి.