పాఠశాల చదువు పూర్తి కాకుండానే..!

3 May, 2018 10:49 IST|Sakshi

తమిళసినిమా: దక్షిణాదిలో అగ్ర కథానాయికల్లో నటి తమన్నా ఒకరని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చాలా మంది హీరోయిన్లు ముందు గ్లామర్‌ పాత్రల్లో నటించి ఆ తరువాత నటనకు ప్రాముఖ్యత ఉన్న పాత్రల్లో నటించి పేరు తెచ్చుకుంటారు. అయితే తమన్నాకు లక్కీగా ఆదిలోనూ కోలీవుడ్‌లో కల్లూరి, టాలీవుడ్‌లో శ్రీ, హ్యాపిడేస్‌ చిత్రాల్లో నటనకు అవకాశం ఉన్న పాత్రలే లభించాయి. ఆ తరువాత ఈ మిల్కీబ్యూటీ చాలా చిత్రాల్లో అందాలాబోరతలో రెచ్చిపోయి నటించారనుకోండి. అలాంటి సమయంలోనే బాహుబలి చిత్రం తమన్నా సినీ కెరీర్‌లోనే మైలురాయిగా నిలిచిపోయింది. అందులో అవంతిక పాత్రకు ప్రాణం పోశారనే చెప్పాలి.

బాలీవుడ్‌లోనూ తన సత్తాచాటాలని ప్రయత్నించినా అక్కడ పెద్దగా లక్కు కలిసి రాలేదు. నటిగా దశాబ్దపు మైలురాయిని అధిగమించిన తమన్నా తన సినీ జీవితంలో అనుభవాలను పంచుకున్నారు. అవేంటో చూద్దాం. సినిమా పాఠశాల లాంటిది. నిత్యం పలు విషయాలను నేర్పుతుంది. నేను పాఠశాల చదువు పూర్తి కాకుండానే సినీరంగప్రవేశం చేశాను. అందువల్ల కళాశాల్లో చదువుకోలేదన్నది లోటే. అయితే సినిమాలో ఆ అనుభవాలను నేను చవిచూశాను. పాఠాలు చదవడం, పరీక్షలకు సిద్ధం కావడం, రిజల్ట్‌ కోసం ఆతృతగా ఎదురుచూడడం వంటి అనుభవాలను సినిమా ద్వారా పొందాను.

సైరా నరసింహారెడ్డి చిత్రంలో చిరంజీవి సరసన నటిస్తున్నాను. అది చారిత్రక కథా చిత్రం. అందుకోసం పలు చరిత్ర కథలను చదివి నాటి సంస్కృతి, సంప్రదాయాల గురించి తెలుసుకుంటున్నాను. బాహుబలి చిత్రం కోసం కత్తి యుద్ధం, గుర్రపు స్వారీ నేర్చుకున్నాను. మరో చిత్రం కోసం నాట్యంలో శిక్షణ పొందాను అని తమన్నా పేర్కొన్నారు. తమిళంలో ఉదయనిధిస్టాలిన్‌కు జంటగా కన్నే కలైమానే చిత్రంలో నటిస్తున్నారు. ఇవి కాక మరో మూడు కొత్త చిత్రాలను సంతకం చేశారట. ప్రస్తుతం సైరా నరసింహారెడ్డి చిత్ర షూటింగ్‌లో పాల్గొంటున్నారు.

మరిన్ని వార్తలు