మోసం చేసిన వ్యక్తి ఎవరన్నది పుస్తకంలో..

12 Nov, 2019 07:29 IST|Sakshi

సినిమా: టాలెంట్‌కు కేరాఫ్‌ ఆండ్రియా అని చెప్పవచ్చు. ఏ తరహా పాత్రనైనా మెప్పించగల సత్తా ఉన్న నటి. వ్యక్తిగతంగానూ ఈ అమ్మడి రూటు సపరేటు. తన ఇష్టమైన రీతిలో స్వేచ్ఛాజీవి ఆండ్రియా. తమిళంతో పాటు తెలుగు, ఇతర భాషల్లోనూ నటిగా పేరున్న ఆండ్రియాలో మంచి గాయని ఉంది. అంతే కాదు రచయిత కూడా ఉంది. ఈ అమ్మడిని చివరిగా వడచెన్నై చిత్రంలో చూశాం. ఆ తరువాత తెరపైకి కనిపించలేదు. అలాంటి ఆండ్రియా ఆ మధ్య ఒక కార్యక్రమంలో పాల్గొని సంచలన వ్యాఖ్యలు చేసింది. తాను ఒక వివాహితుడితో సంబంధం పెట్టుకుని శారీరకంగానూ, మానసికంగా బాధపడినట్లు పేర్కొంది. అతని నుంచి బయట పడి ఆయుర్వేద చికిత్స పొంది ఉపశమనం పొందుతున్నట్లు పేర్కొంది.

తనను మోసం చేసిన వ్యక్తి ఎవరన్నది తాను రాసుకున్న పుస్తకంలో బయట పెడతానని బాంబ్‌ పేల్చింది. అయితే పుస్తకాన్ని విడుదల చేయలేదు. మానసికంగా క్షోభకు గురి చేసిన ఆ వ్యక్తి బెదిరించడం వల్లే ఆండ్రియా తన పుస్తకాన్ని విడుదల చేయలేదనే ప్రచారం జరిగింది. ఆ వ్యక్తికి రాజకీయాలతో సంబంధాలు ఉన్నాయని, సినిమా రంగంలోనూ ఉన్నాడని సమాచారం. పుస్తకం విషయం తెలిసిన ఆ వ్యక్తి ఆండ్రియాను బెదిరించినట్లు తాజాగా సామాజిక మాధ్యమాల్లో టాక్‌ వైరల్‌ అవుతోంది. దీంతో ఆండ్రియా పుస్తకం బయటకు వచ్చే అవకాశం లేదనే భావించాలి. మళ్లీ నటనపై దృష్టి సారించిన ఈ సంచలన నటికి అవకాశాలు బాగానే తలుపు తడుతున్నాయి. ప్రస్తుతం కావట్టం, మాళిగై చిత్రాల్లో నటిస్తోంది. తాజాగా విజయ్‌తో ఆయన 64వ చిత్రంలో నటించే అవకాశాన్ని కొట్టేసింది. ఇందులో ఆండ్రియా హీరోయిన్‌ కాదట. ఒక ముఖ్య పాత్రలో మెరవనుందని సమాచారం. ఈ చిత్ర షూటింగ్‌ ఇప్పటికే ప్రారంభమయ్యి చిత్రీకరణ జరుపుకుంటోంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు