ఊహకు అందని రీతిలో...

30 May, 2014 23:23 IST|Sakshi
ఊహకు అందని రీతిలో...

అందమైన అమ్మాయితో స్నేహం ఏ కుర్రాడికైనా ఆనందమే. అదే ఆ కుర్రాడు సినీ దర్శకుడైతే... కొత్త కొత్త కథలు పుడుతుంటాయి. సినిమా దర్శకునిగా ఎదగాలనుకుంటున్న ఓ కుర్రాడి రూమ్‌కి ఓ అమ్మాయి వచ్చి పోతుంటుంది. ఆ అమ్మాయి రాక, అతని జీవితంపై ఎలాంటి ప్రభావం చూపింది? అనే ఆసక్తికరమైన కథాంశంతో తెరకెక్కుతోన్న థ్రిల్లర్ ‘గీతాంజలి’. అంజలి టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రంలో హాస్యనటుడు శ్రీనివాసరెడ్డి ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. కోన వెంకట్ సమర్పణలో ఎం.వి.వి.సినిమా పతాకంపై ఎం.వి.వి.సత్యనారాయణ ఈ సినిమా నిర్మిస్తున్నారు.

ఈ సినిమా గురించి దర్శకుడు రాజకిరణ్ చెబుతూ -‘‘ఇప్పటివరకూ తెలుగుతెరపై రాని ప్రయత్నమిది. అంజలి పాత్ర చిత్రణ ఊహలకు అందని రీతిలో ఉంటుంది. వినోదంతో పాటు ఉత్కంఠకు లోనుచేసేలా ఈ సినిమా ఉంటుంది. వచ్చే నెల 3, 6, 7 తేదీల్లో బ్రహ్మానందంపై చిత్రీకరించే సన్నివేశాలతో టాకీ పూర్తవుతుంది. అదే నెల 9 నుంచి మూడు రోజుల పాటు అంజలి, హర్షవర్దన్ రాణేలపై చిత్రీకరించే మాంటేజస్ సాంగ్‌తో చిత్రం షూటింగ్ పూర్తవుతుంది. అదే నెలలో పాటలను, జూలైలో సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. రావురమేశ్, మధునందన్, షకలక శంకర్, సత్యం రాజేశ్, తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ప్రవీణ్ లక్కరాజు, స్క్రీన్‌ప్లే-మాటలు: కోన వెంకట్, ఎడిటింగ్: ఉపేంద్ర, కెమెరా: సాయిశ్రీరామ్, సహ నిర్మాత: వి.ఎస్.ఎన్. కుమార్.