లబ్‌ డబ్‌... లవ్‌ డబ్‌!!

13 Feb, 2017 23:17 IST|Sakshi

లబ్‌ డబ్‌.. లబ్‌ డబ్‌..  గుండె చప్పుడు ఇది! మరి, ఆ గుండెకి ప్రేమ తోడైతే... లవ్‌ డబ్‌.. లవ్‌ డబ్‌... లవ్‌ డబ్‌... అంటుంది! తెలుగు అయినా.. హిందీ అయినా... తమిళ్‌ అయినా.. ప్రేమ.. ఇష్క్‌.. కాదల్‌... పిలుపు మారుతుందేమో కానీ గుండె చప్పుడు మారదు! లవ్‌ మీటర్‌ ఎక్కడైనా ఒక్కటే తెలుగు ప్రేక్షకుల హృదయాలను మీటిన డబ్బింగ్‌ లవ్వులు ఎన్నో... లబ్‌ డబ్‌.. లవ్‌ డబ్‌.. డబ్‌ డబ్‌ డబ్‌...

చక్కనైన ఓ చిరుగాలి... ఒక్క మాట వినిపోవాలి!
తెలుగు చిత్రాలే కాదు... ప్రేమ నేపథ్యంలో వచ్చిన అనువాదాలూ అదరగొట్టాయి. అందులో ముఖ్యమైనది ‘ప్రేమ సాగరం’. యువ తమిళ హీరో శింబు తండ్రి టి. రాజేందర్‌ ముఖ్య పాత్రలో నటించి, దర్శకత్వం వహించిన తమిళ చిత్రం ‘ఉయిరుళ్ల వరై ఉష’. ఈ చిత్రమే ‘ప్రేమ సాగరం’ పేరుతో తెలుగులో విడుదలైంది. కాలేజీలో చదువుకుంటూ హీరో, హీరోయిన్‌ లవ్‌లో పడతారు. హీరోయిన్‌ అన్నయ్య వీళ్ల ప్రేమకు విలన్‌. చివరికి ప్రేమికులిద్దరూ ఎలా కలిశారు? అనే పాయింట్‌తో తీసిన సినిమా ఇది. ‘అందాలొలికే సుందరి రాత్రి..’, ‘హృదయమనే కోవెలలో...’, ‘చక్కనైన ఓ చిరుగాలి..’ వంటి సూపర్‌ హిట్‌ సాంగ్స్‌తో సినిమా మంచి మ్యూజికల్‌ హిట్‌గా నిలిచింది. అప్పటి ప్రేక్షకులకు ప్రేమ మత్తు ఎక్కించింది. కథానాయిక నళినిని స్టార్‌ని చేసిన సినిమా ఈ ‘ప్రేమ సాగరం’.

‘అల్లరి వెన్నెల జల్లులు...’
ఎనభైలలో వచ్చిన ఘాటు ప్రేమకథల్లో ‘డార్లింగ్‌ డార్లింగ్‌’ ఒకటి. ఇందులో కె. భాగ్యరాజా హీరో. మామూలుగా భాగ్యరాజా చేసే సినిమాలన్నీ కామెడీ టచ్‌తోనే ఉంటాయి. ఈ సినిమాలో ఆ డోస్‌ తక్కువ ఉంటుంది. భాగ్యరాజాలో మరో యాంగిల్‌ చూపించిన సినిమా ఇది. చిన్నప్పుడే స్నేహంగా మెలిగిన ఓ అమ్మాయితో ్రపేమలో పడతాడు అబ్బాయి. ఆ అమ్మాయి కుటుంబం ఎక్కడికో వెళ్లిపోతుంది. కానీ, చిన్ని హృదయంలో నాటుకుపోయిన అమ్మాయి బొమ్మ అలా ఉండిపోతుంది. తాను పెరుగుతూ ఆ అమ్మాయి మీద ప్రేమను పెంచేసుకుంటాడు. అమ్మాయి పెద్దింటి పిల్ల. అబ్బాయి పేదవాడు.

పెద్దయ్యాక ఊరు తిరిగొచ్చే ఆ అమ్మాయితో తన ప్రేమను చెప్పాలనుకుంటాడు. అమ్మాయి మాత్రం పనివాడిలానే చూస్తుంది. అక్కణ్ణుంచి అతను పడే నరక యాతన చూసేవాళ్ల హృదయాలను మెలిపెడుతుంది. భాగ్యరాజానే డైరెక్ట్‌ చేసిన ఈ సినిమాలో సుమన్‌ నెగటివ్‌ టచ్‌ ఉన్న పాత్ర చేశారు. ఎంత పెద్ద విలన్‌ అయినా ప్రేమ ముందు ఓడిపోవాల్సిందే. చివరికి ప్రేమ గెలుస్తుంది. అందరి మనసులకూ దగ్గరై ‘డార్లింగ్‌’ అనిపించుకుందీ సినిమా. ఇందులో ఉన్న ‘ఓ చెలీ ఈ నా భావగీతాలే.. కదలాడే నీటిపై తేలు దీపాలే...’, ‘అల్లరి వెన్నెల జల్లులు..’ అనే హిట్‌ సాంగ్స్‌ని  మరచిపోవడం అంత సులువు కాదు.

‘హృదయమా.. హృదయమా..నీ మౌనమెంత వేదన...
ఓ మెడికో తన జీవితాంతం ప్రేమను చెప్పలేక సతమతమయ్యి, చివరకు గుండెపోటుతో చచ్చిపోయే వినూత్నమైన కథతో వచ్చిన సినిమా ‘ఇదయం’. ఈ సినిమా ‘హృదయం’ పేరుతో తెలుగులో విడుదలైంది. ప్రేమకథా చిత్రాల్లో ‘హృదయం’ది ప్రత్యేకమైన స్థానం. సినిమా చూస్తున్నంతసేపూ ప్రేక్షకుల మనసులలో హీరో తన ప్రేమను హీరోయిన్‌ దగ్గర త్వరగా చెబితే బాగుండు అనే భావన కలుగుతుంది. హీరో మురళి అద్భుతంగా నటించారు. హీరోయిన్‌ హీరా రూపం మనసులో అలా నిలిచిపోతుంది. ‘ఊసులాడే ఒక జాబిలమ్మ... సిరిమువ్వలుగా నన్ను తాకెనా..’, ‘హృదయమా.. హృదయమా.. నీ మౌనమెంత వేదన...’ పాటలు ఎవర్‌గ్రీన్‌. ఈ ‘హృదయం’ ప్రేమ హృదయాలను మీటింది.

ఓ చెలియా.. నా ప్రియ సఖియా
‘పేటా ర్యాప్‌..’, ‘ముక్కాలా.. ముక్కాబులా.. లైలా..’, ‘ఓ చెలియా.. నా ప్రియ సఖియా..’ 1990లలో విడుదలైన ‘కాదలన్‌’లోని ఈ పాటలు ఇప్పటికీ కొత్తగా ఉంటాయి. అదే సినిమాలో ‘ఊర్వశీ.. ఊర్వశీ..’ కూడా సూపర్‌ హిట్‌. సినిమా సూపర్‌ డూపర్‌ హిట్‌. ప్రేమ మహిమ అలాంటిది మరి. హీరోది మధ్యతరగతి కుటుంబం. హీరోయిన్‌ గవర్నర్‌ కూతురు. అందనంత ఎత్తు. ప్రేమకు తేడా తెలియదు కదా. కుర్రాడు చిన్నదాని మీద మనసు పారేసుకుంటాడు. పంజరంలో చిలకలా బతుకున్న చిన్నదానికి కుర్రాడు స్వేచ్ఛాప్రపంచాన్ని చూపిస్తాడు. తనూ ప్రేమలో పడుతుంది. గవర్నర్‌ మనసు ఊరుకుంటుందా? అబ్బాయిని జైల్లో పెట్టించి, చిత్రహింసలు పెట్టిస్తాడు. అయినా ప్రేమికుడు గెలుస్తాడు. ప్రేయసిని తనదాన్ని చేసుకుంటాడు. ఈ సినిమాలో ప్రభుదేవా, నగ్మా కెమిస్ట్రీ బాగుంటుంది. దర్శకుడు శంకర్‌ తీసిన ఈ లవ్‌స్టోరీ చాలా సై్టలిష్‌గా ఉంటుంది, ‘ప్రేమికుడు’ పేరుతో విడుదలై, ఇక్కడ కూడా ఘనవిజయం సాధించింది.

ఉరికే చిలకా...
ఆమె ముస్లిమ్‌.. అతను హిందు. ప్రేమకు కులమతాలతో పని లేదు. ఇద్దరూ ప్రేమలో పడతారు. పెద్దలను ఒప్పించడం కష్టమని తెలుసు.. అందుకే ఇద్దరూ వెళ్లిపోయి, పెళ్లి చేసుకుంటారు. బొంబాయి వెళ్లిపోతారు. కాపురం హాయిగా సాగుతుంది. ఇద్దరు బిడ్డలకు తల్లిదండ్రులవుతారు. ఉన్నట్టుండి మత ఘర్షణలు మొదలువతాయి. హిందువులు–ముస్లిమ్‌ల మధ్య చంపుకునేంత ద్వేషం. పెద్ద పెద్ద అల్లర్లు. ఈ అల్లర్లో పిల్లలు గల్లంతు. పిచ్చి పట్టినట్లు పిల్లల కోసం వెతుకుతారు. చివరికి దొరుకుతారు. కాపాడింది వేరే మతం వాళ్లు. అదే సమయంలో ఇద్దరి కుటుంబాలకు సంబంధించిన పెద్దవాళ్లు వీళ్లను వెతుక్కుంటూ బొంబాయి వస్తారు. వాళ్లకూ కనువిప్పు అవుతుంది.

ఒక లవ్‌స్టోరీకి సామాజిక అంశాన్ని ముడిపెట్టి తీయడం మణిరత్నంలాంటి కొంతమంది దర్శకులకు మాత్రమే కుదురుతుందేమో. ఈ సినిమాలో ‘ఉరికే చిలకా వేచి ఉన్నాను నీ కొరకు...’, ‘కన్నానులే...’, ‘అది అరబిక్‌ కడలందం...’ వంటి ఎ.ఆర్‌. రహమాన్‌ పాటలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఇక, అరవింద్‌ స్వామి, మనీషా కొయిరాలా జంట పండించిన కెమిస్ట్రీని కూడా మరచిపోలేం.

పిచ్చి ప్రేమ!
పెళ్లికి ముందు భార్య ఒక వ్యక్తిని ప్రేమించిందని తెలిస్తే చాలామంది భర్తలు విడాకులు ఇచ్చేస్తారు. కానీ, తన భార్య మాజీ ప్రియుడికి పిచ్చి పట్టిందని తెలిసి, అతన్ని తీసుకొచ్చి చికిత్స చేయించే భర్త ఉంటాడా? తమిళనాడులో ఉన్నాడు. ఆ సంఘటన తెలిసి, దర్శకుడు బాలాజీ శక్తివేల్‌ సినిమాగా తీశారు. అదే ‘కాదల్‌’. భరత్, సంధ్య జంటగా నటించిన ఈ సినిమా తెలుగులో ‘ప్రేమిస్తే’గా విడుదలైంది. ఈ టీనేజ్‌ లవ్‌స్టోరీ యూత్‌కి బాగా పట్టేసింది. పెద్దవాళ్లకు తెలియకుండా ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకునే టీనేజ్‌ జంటను ఆ తర్వాత పెద్దవాళ్లే విడదీస్తారు. ఆ తర్వాత అమ్మాయికి పెళ్లి చేసేస్తారు. అబ్బాయి పిచ్చివాడైపోతాడు. ఈ ట్రాజెడీ లవ్‌స్టోరీకి బోల్డన్ని అభినందనలు అందాయి. అప్పటికే భరత్‌ ‘బాయ్స్‌’తో పాటు ఓ మూడు సినిమాల్లో నటించాడు. సంధ్యకి ఇది మొదటి సినిమా. ఈ ఒక్క సినిమాతో ఇద్దరికీ ఫుల్‌ పాపులార్టీ వచ్చేసింది.

ప్రేమ పరీక్షలో... ఓ రోజు
ఓ నిరుపేద విద్యార్థికి గొప్ప కాలేజీలో సీటొస్తుంది. గొప్పింటి అమ్మాయి మనసులో చోటూ దక్కింది. ఆ తర్వాతే జీవితంలో అసలైన సంఘర్షణ మొదలైంది. ఎక్కువశాతం ప్రేమకథలు చివరికి సుఖాంతం అవుతాయి. ‘ప్రేమికుల రోజు’లోనూ అంతే. కానీ, కథలో ట్విస్ట్‌ ఏంటంటే.. కాలేజీలో ఆ కుర్రాడికి సీటిచ్చిన ప్రిన్సిపాలే అమ్మాయి తండ్రి. ప్రేమ సంగతి గురువుకి చెప్పలేక నిరుపేద విద్యార్థి సంఘర్షణకు లోనయ్యే తీరు ప్రతి ఒక్కరి మనసులనూ మీటింది. చెప్పుకోవాలంటే ఇది మామూలు కథే. కానీ, దర్శకుడు ఖదీర్‌ కథకు అద్దిన మోడరన్‌ మెరుగులు ప్రేక్షకులను అబ్బురపరిచాయి.

ఇప్పుడంటే ఈ–మెయిల్స్, చాటింగ్‌ అందరికీ తెలుసు. పదిహేనేళ్ల క్రితం ఎవరికి తెలుసు? అప్పుడే ఇవన్నీ ఊహించి ఖదీర్‌ సినిమాలో చూపించారు. మెయిల్‌లో అమ్మాయి ఫొటో చూసి ప్రేమలో పడడం.. రైల్వే స్టేషన్‌లో కలుసుకోవడం... సినిమాలో ప్రతిదీ ప్రేక్షకులకు కొత్తగా అనిపించింది. ఈ సినిమాతో ప్రేమలో పడడానికి మరో ముఖ్య కారణం ఏఆర్‌ రెహమాన్‌ పాటలు. ‘వాలు కనులదానా..’, ‘దాండియా ఆటలు ఆడ..’, ‘రోజా రోజా..’ పాటలు సూపర్‌హిట్‌. ఇక, ‘ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్థిని..’ పాట వన్‌సైడ్‌ లవర్స్‌ నోట ఇప్పటికీ మార్మోగుతోంది.

మనిషికి ఆక్సిజన్‌ లేకపోతే ఊపిరాడదు. సినిమాకి ప్రేమ కథ లేకపోతే ఊపిరాడదు. ఇది సత్యం. ఇప్పుడైనా. అప్పుడైనా. ఎప్పటికి అయినా.

>