నేలరాలిన దర్శకతార..

19 Jan, 2018 00:17 IST|Sakshi

ప్రముఖ కన్నడ నటుడు, దర్శక–నిర్మాత కాశీనాథ్‌ (67) ఇకలేరు. కేన్సర్‌ వ్యాధితో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో గురువారం ఉదయం తుది శ్వాస విడిచారు. 1976లో ‘అపురూపద అతిథిగళు’ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయమైన కాశీనాథ్‌ ఆ తర్వాత తెరకెక్కించిన ‘అపరిచిత’ ఘనవిజయం సాధించింది. సస్పెన్స్‌ థ్రిల్లర్స్‌  జానర్‌లో ట్రెండ్‌సెట్‌ చేసిన చిత్రమిది. ఇంకా పలు విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించారు.

‘అపరిచిత’ సినిమా తెలుగులోనూ విడుదలై, విమర్శకుల ప్రశంసలనూ పొందింది. వినోద ప్రధానంగా ఉండే సినిమాలను రూపొందించిన కాశీనాథ్‌ వైవిధ్యమైన పాత్రల్ని పోషించి కన్నడ సినీరంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కాశీనాథ్‌ పలు చిత్రాలకు సంగీతం అందించడం విశేషం. ఎందరో ప్రతిభ ఉన్న నటులను ఆయన ఇండస్ట్రీకి పరిచయం చేశారు. వారిలో కన్నడ సూపర్‌స్టార్‌ ఉపేంద్ర కూడా ఒకరు. దర్శకుడు కావాలనుకున్నప్పుడు కాశీనాథ్‌ దగ్గరే సహాయ దర్శకునిగా చేరారు ఉపేంద్ర.

ఆ తర్వాత ఆయన దర్శకుడిగా మారాక తీసిన ‘ష్‌’ చిత్రంలో కాశీనాథ్‌ నటించడం విశేషం. కాశీనాథ్‌ నటించిన చివరి కన్నడ సినిమా ‘చౌక’ 2017లో విడుదలైంది.  కాశీనాథ్‌ తనయుడు అభిమన్యు నటుడిగా కొనసాగుతున్నారు. ‘‘దర్శకులు కాశీనాథ్‌ మరణం కన్నడ చిత్ర పరిశ్రమకు తీరని లోటు’ అని నటులు ఉపేంద్ర, పునీత్‌ రాజ్‌కుమార్‌ పేర్కొన్నారు. పలువురు కన్నడ సినీ ప్రముఖులు కాశీనాథ్‌ మృతికి సంతాపం ప్రకటించారు.

మరిన్ని వార్తలు