ఆస్కార్ ఎంట్రీకి దక్షిణాది సినిమా

22 Sep, 2016 17:06 IST|Sakshi
ఆస్కార్ ఎంట్రీకి తమిళ సినిమా

జాతీయ అవార్డును గెలుచుకున్న తమిళ చిత్రం ’విరసణై’ ఆస్కార్ ఎంట్రీకి అవకాశం దక్కించుకుంది. భారతదేశం నుంచి 'ఉత్తమ విదేశీ భాషా చిత్రం' కేటగిరీలో ఈ సినిమా అధికారికంగా ఎంట్రీ ఇచ్చింది.  మొత్తం 29 చిత్రాలు పోటీ పడగా, చివరకు విసరణై బరిలో నిలిచింది. ఈ మేరకు ఎఫ్ఎఫ్ఐ చైర్మన్ కేతన్ మెహతా ధ్రువీకరించారు.

రియాలిటీకి దగ్గరగా ఉండే కథలను భావోద్వేగాలతో తెరకెక్కిస్తాడనే పేరున్న తమిళ దర్శకుడు వెట్రిమాన్ రూపొందించిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలతోపాటు జాతీయ అవార్డులను అందుకుంది. ఖాకీల కర్కశత్వాన్ని ప్రధానంగా చూపించిన 'విసరణై'.. ఎం.చంద్రకుమార్ నవల 'లాకప్' ఆధారంగా తెరకెక్కింది.

థియేటర్లలో విడుదల కాకాముందే 72వ వెనీస్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. ధనుష్ సొంత నిర్మాణ సంస్థ వండర్బార్ ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మించడం విశేషం. కాగా 89 వ ఆస్కార్ అవార్డు వేడుకలు 2017 ఫిబ్రవరిలో లాస్ ఏంజెలెస్లో జరుగనున్నాయి.