గూగుల్ 'అల్లో'వాడారో.. అంతేనట! | Sakshi
Sakshi News home page

గూగుల్ 'అల్లో'వాడారో.. అంతేనట!

Published Thu, Sep 22 2016 5:00 PM

గూగుల్ 'అల్లో'వాడారో.. అంతేనట!

ఫేస్బుక్ మెసెంజర్, వాట్సాప్ మెసేజింగ్ యాప్లకు భారీ షాకిస్తూ.. సెర్చి ఇంజిన్ దిగ్గజం గూగుల్ తీసుకొచ్చిన అల్లో యాప్ అంత శ్రేయస్సుకరం కాదంట. ప్రస్తుత చాటింగ్ యాప్స్కు దీటుగా ఈ యాప్ను తీసుకొచ్చినట్టు గూగుల్ చెప్పుకుంది. కానీ ఈ యాప్ వాడితే వ్యక్తిగత ప్రైవసీ దెబ్బతింటుందట. ఈ విషయాన్ని స్వయానా గ్లోబల్ ఐకాన్గా పేరున్న ఎడ్వర్డ్ స్నోడెనే వెల్లడించారు.
 
అల్లో స్మార్ట్ చాట్ను వినియోగించ వద్దని ఆయన వినియోగదారులను హెచ్చరిస్తున్నారు.  గూగుల్ ప్రవేశపెట్టిన ఈ యాప్లో ప్రైవసీ సరిగా లేదని, ఈ చాట్ యాప్ ద్వారా పంపే మెసేజ్లన్నింటినీ గూగుల్ స్టోర్ చేయడం వల్ల ప్రైవసీ దెబ్బతింటుందని చెప్పారు. ఈ యాప్ను వినియోగదారులు వాడొద్దని సూచిస్తున్నారు. 
 
మెసేజ్లను కేవలం తాత్కాలికంగా మాత్రమే స్టోర్ చేస్తామని ప్రకటించిన గూగుల్ అల్లో టీమ్,  రహస్యంగా లేని అన్ని మెసేజ్లను డిలీట్ చేసేంత వరకు స్టోర్ చేసే ఉంచుతామని బుధవారం తేల్చేసింది. అదేవిధంగా గూగుల్కు, డివైజ్కు మధ్య మెసేజ్లు ఎన్క్రిప్టెడ్ అయి ఉంటాయని, వాటిని గూగుల్ చదివే వీలుంటుందని ప్రకటించింది. దీంతో ఈ యాప్ వ్యక్తిగత ప్రైవసీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  ఈ యాప్ను "గూగుల్ నిఘా"గా విమర్శిస్తూ వివిధ ట్వీట్లను ఎడ్వర్డ్ స్నోడెన్ పోస్టు చేశారు.  
 
యూజర్లు ఇతరులకు అల్లో ద్వారా చేరవేసే ప్రతి సందేశాన్ని గూగుల్ సేవ్ చేయడం ప్రమాదకరమని, ఇది వ్యక్తిగత స్వేచ్ఛను హరించివేయడమేనని ఆయన అన్నారు. పోలీసు రిక్వెస్ట్ ప్రకారం రికార్డు చేసిన వినియోగదారుల సమాచారాన్ని గూగుల్ లీక్ చేయొచ్చని తెలిపారు. గూగుల్ అల్లోకు సాధ్యమైనంతవరకు దూరంగా ఉండటమే మంచిదని ఆయన యూజర్లకు సూచించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement