ఎవరేమనుకున్నా ఆ దుస్తులే ధరిస్తా!

17 Jun, 2016 01:03 IST|Sakshi
ఎవరేమనుకున్నా ఆ దుస్తులే ధరిస్తా!

క్యాన్సర్ మహమ్మారిని జయించిన అతి కొద్దిమంది నటీమణుల్లో మమతామోహన్‌దాస్ ఒకరని చెప్పవచ్చు. తమిళం, తెలుగు, మలయాళం అంటూ పలు భాషల్లో నాయకిగా నటించి గుర్తింపు పొందిన ఈ కేరళ బ్యూటీ క్యాన్సర్ బారిన పడి దాన్ని జయించి మళ్లీ నటించడానికి రెడీ అయ్యారు. ఇటీవల ఇంగ్లాండ్‌లో జరిగిన ఒక అవార్డుల కార్యక్రమంలో పాల్గొని అలరించారు. కళ్ళు చెదిరే గ్లామరస్ దుస్తుల్లో తళుక్కుమన్న మమతామోహన్‌దాస్ ఆ కార్యక్రమంలో తమిళం, మలయాళం పాటల్ని పాడి సెంటర్ ఆఫ్ ది ఎట్రాక్షన్‌గా నిలిచారు. అయితే ఆమె ధరించిన గ్లామరస్ దుస్తులు మాత్రం విమర్శలకు దారితీశాయి. మమతామోహన్ దాస్ వస్త్రాధరణను నెటిజన్లు దుమెత్తిపోస్తున్నారు. ఈ అంశంపై స్పందించిన మమత మాత్రం తాను ధరించిన గ్లామరస్ దుస్తులను సమర్థించుకున్నారు.


ఆమె ఏమంటున్నారో చూద్దాం. నేను ధరించిన దుస్తులు మరీ గ్లామరస్‌గా ఉన్నాయంటున్నారు. అలాంటి విమర్శలు నన్నేమీ బాధించవు. పని లేనివారే ఇలాంటి విమర్శలు చేస్తుంటారు. తాను ధరించిన దుస్తులను అమెరికాలోని లాస్‌ఏంజిల్స్‌లో కొనుగోలు చేశాను. ఆ దుస్తుల్లో నన్ను చూసిన వారందరూ హాలీవుడ్ నటిలా ఉన్నావని ప్రశంసిస్తున్నారు.ప్రస్తుతం నేను అలాంటి నగరంలోనే నివశిస్తున్నాను.అందువల్ల ఇలాంటి వంకర బుద్ధి విమర్శలు నన్ను ఎంత మాత్రం బాధించవు.ఎవరేమనుకున్నా నేను గ్లామరస్ దుస్తులు ధరించకుండా ఆపలేరు.

 

>