అప్పుడు నాన్నకు గడియారం కొనిపెట్టా!: శ్రుతిహాసన్

25 Jul, 2013 02:00 IST|Sakshi
అప్పుడు నాన్నకు గడియారం కొనిపెట్టా!: శ్రుతిహాసన్

 ‘‘అరవయ్యేళ్లల్లో ఇరవైఆరేళ్ల యువతిగా నటించలేను. కానీ అరవైలో ఇరవైలో ఉన్నట్లుగా పాడగలను కదా’’ అంటున్నారు శ్రుతిహాసన్. ఈ బ్యూటీ మంచి గాయని. సంగీతదర్శకురాలు కూడా. అయితే కథానాయికగా బిజీగా ఉంటున్నారు కాబట్టి మ్యూజిక్‌పై దృష్టి పెట్టడంలేదు. మరి వెలితిగా అనిపించడంలేదా? అనే ప్రశ్న శ్రుతి ముందుంచితే - ‘‘సంగీతం అంటే నాకు చాలా ఇష్టం. దానికి దూరం కాకూడదనే అడపా దడపా నా సినిమాల్లో పాటలు పాడుతున్నాను.
 
 ఇప్పుడు నా వయసు 26 ఏళ్లు. ఈ వయసుకి తగ్గ పాత్రలను ఇప్పుడు చేయగలను. కానీ వయసు పైబడ్డ తర్వాత ఇవి చేయలేను. కానీ పాటలు ఎప్పుడైనా పాడొచ్చు. వయసుతో సంబంధం లేదు. అరవయేళ్లల్లో కూడా పదహారేళ్ల పిల్లలా పాడే వీలుంటుంది. అందుకే ప్రస్తుతం యాక్టింగ్‌కే ప్రాముఖ్యం ఇస్తున్నా’’ అని చెప్పారు.
 
 ఇదిలా ఉంటే.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మీ తొలి పారితోషికాన్ని ఏం చేశారు అనే ప్రశ్నకు.. ‘‘మా అమ్మకు చీర కొనిపెట్టాను. నా పారితోషికం మరింత పెరిగిన తర్వాత, మా నాన్నకు ఓ ఫ్యాన్సీ గడియారం కొనిపెట్టా’’ అని చెప్పారు. మీలో మీకు నచ్చనిది అనే మరో ప్రశ్నకు - ‘‘నా పాదాలు. వీలుంటే వాటిని ట్రాన్స్‌ప్లాంట్ చేయాలనిపిస్తుంది. ఎందుకంటే నా పాదాలు అంత బాగుండవు’’ అని చెప్పారు.