ఉపాధిలో మహిళ

12 Feb, 2018 17:13 IST|Sakshi
కల్వకుర్తి మండలం తుర్కలపల్లిలో చెరువు కట్ట పనులు చేస్తున్న మహిళలు (ఫైల్‌)

ఈజీఎస్‌ కూలీల్లో 50 శాతానికి పైగా మహిళలే..

ఈ ఏడాది పనులు చేసిన కూలీల్లో 53శాతం వారే..

జిల్లాలో 1,91,256మంది మహిళా కూలీలు 

నాగర్‌కర్నూల్‌ టౌన్‌ : కరువు కాటకాల్లో చిక్కుకుని విలవిలలాడుతున్న పేదలకు సొంత ఊరిలోనే పని కల్పించి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లకుండా నివారించేందుకు 2005లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం వరంగా మారింది. గతంలో గ్రామాల్లో పనులు లేకపోవడంతో చాలా మంది బతుకుదెరువు కోసం పట్టణాలకు వలస వెళ్లే వారు. నెలల తరబడి కుటుంబాలకు దూరం గా ఉండి పిల్లాపాపలను వదిలేసి పొట్ట కూటి కోసం అన్నీ వదిలేసి పట్టణ ప్రాంతాల కు వెళ్లిపోయేవారు. ఈ నేపథ్యంలో ఉపాధి హామీ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత పలు కుటుంబాలు సొంత ఊర్లోనే పనులు చేసుకుంటూ అందుకు తగ్గ కూలి పొందుతున్నారు.

ఏడాది పొడవునా కూలీ పనులకు వెళ్తూ పథకాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంటున్నారు. అందులో జిల్లాలో మహిళలే అధికంగా ఉన్నారు. దీంతో ఉపాధిలో మహిళా శక్తి తన ప్రాభావాన్ని చాటుకుంటోంది. జిల్లాలో లక్షా 69వేల 27 ఉపాధి హామీ జాబ్‌ కార్డులు ఉండగా వారిలో 3లక్షల 71వేల 130మంది కూలీలు ఉన్నారు. వీరిలో లక్షా 91వేల 256 మంది మహిళలే ఉన్నారు. అంటే దాదాపు 51శాతం మంది మహిళలే ఉన్నారు. ఈ ఏడాది చేసిన పనుల్లో చూసుకుంటే ఇప్పటి వరకు లక్షా 11వేల మంది పనుల్లో పాల్గొనగా అందులో 59వేల మంది (53 శాతం) మహిళలు ఉన్నారు.
 
ఏడాదంతా పుష్కలంగా పనులు... 
ఉదయం వేళ పారా, పలుగు పట్టుకుని పురుషులతో పాటు మహిళలు కూలీ పనులకు వెళ్తున్నారు. తిరిగి మధ్యాహ్నం ఇంటికి చేరుకుని కుటుంబ పనులు చూసుకుంటున్నారు. మరికొందరు ఉదయం ఈజీఎస్‌ పనులకు వెళ్లి త్వరగా ముగించుకుని తర్వాత తమ సొంత వ్యవసాయ పనులకు సైతం వెళ్తున్నారు. ఇందుకు సంబంధించిన డబ్బులు వారి ఖాతాలోనే పడుతుండడంతో సొమ్ముకు సైతం భద్రత ఏర్పడింది. కాలానుగుణంగా ప్రతి సీజన్‌లోనూ కూలీలకు పనులు కల్పించడంతో పాటు గ్రామాల్లోని ఫీల్డ్‌ అసిస్టెంట్లు ప్రతి కూలీ వద్దకు వెళ్లి పనుల వివరాలు చెబుతూ పనులకు తీసుకెళ్తున్నారు. గతంలో వేసవి కాలంలోనే పనులు అధికంగా ఉండేవి. కానీ ప్రతి పనికి ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని ఉపయోగించుకుంటుండడంతో ఏడాది మొత్తం చేతినిండా పని ఉంటోంది. ముఖ్యంగా వానాకాలంలో హరితహారం మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడం ఇలా ప్రతి ప్రభుత్వ పథకంలోనూ ఉపాధి కూలీలను వినియోగిస్తూ వారికి చేదోడువాదోడుగా నిలుస్తోంది. దీంతో నిరుపేదలకు సంవత్సరమంతా పనులు గ్రామాల్లోనే పుష్కలంగా లభిస్తున్నాయి.  

 మహిళా కూలీలను ప్రోత్సహిస్తున్నాం 
గ్రామాలలో ఉపాధి హామీ పనుల్లో పాల్గొనే మహిళలను ప్రోత్సహిస్తున్నాం. ఈ  ఏడాది జరిగిన పనుల్లో ఇప్పటి వరకు అధిక శాతం మహిళలే పాల్గొంటున్నారు. పనులు చేసేందుకు కూడా పురుషుల కంటే మహిళలు అధిక ఆసక్తి చూపించడం మహిళా శక్తికి నిదర్శనం. 
– సుధాకర్, డీఆర్‌డీఓ

మరిన్ని వార్తలు